సరిలేరు నీకెవ్వరు చిత్రంతో.. రీఎంట్రీ ఇవ్వనున్న మరో నటీమణి..!

సరిలేరు నీకెవ్వరు చిత్రంతో.. రీఎంట్రీ ఇవ్వనున్న మరో నటీమణి..!

సంగీత (Sangeetha).. టాలీవుడ్‌ని ఒక దశకం పాటు ఏలిన నటీమణుల్లో ఈమె కూడా ఒకరు. ‘‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్.. నేనేంటో నిరూపించుకుంటా..’’ అంటూ తన అమాయకపు నటనతో ప్రేక్షకుల మదిని తాకినా.. 'బహుమతి' చిత్రంలో డబ్బు ఆశ ఎక్కువగా ఉన్న గడుసు భార్యగా అలరించినా అది ఆమెకే చెల్లింది. తెలుగులో ఖడ్గం సినిమాతో బాగా గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ ఆ తర్వాత పెళ్లాం ఊరెళితే, ఈ అబ్బాయి చాలా మంచోడు, ఆయుధం, ఖుషీ ఖుషీగా, విజయేంద్రవర్మ, సంక్రాంతి.. వంటి ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది.

కేవలం తెలుగులోనే కాదు.. తమిళం, మళయాళం, కన్నడ భాషల్లోనూ అనేక చిత్రాల్లో నటించి ప్రేక్షకుల విశేష అభిమానాన్ని చూరగొంది. 2009లో క్రిష్ అనే ఓ ప్లే బ్యాక్ సింగర్‌ని పెళ్లి చేసుకున్న తర్వాత వెండితెరకు దూరంగా ఉంటూ వచ్చిందీ సుందరి. అయితే తమిళంలో మాత్రం అప్పుడప్పుడూ సినిమాల్లో మెరుస్తూనే ఉంటుంది.

తెలుగులో ఆమె నటించిన చివరి చిత్రం 'కారా మజాకా'.. 2010లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొమ్మిదేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు సంగీత వెండితెర పై తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఇంతకీ ఏ చిత్రంలో ఆమె నటిస్తోంది? అందులో హీరో ఎవరు?? వంటి వరుస సందేహాలు మీకు ఇప్పటికే మొదలైపోయి ఉంటాయి. వాటికి సమాధానాలు మేం చెబుతాం రండి..

టాలీవుడ్ హ్యాండ్‌సమ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం సరిలేరు నీకెవ్వరు (Sarileru neekevvaru). ఇందులో ఒక కీలక పాత్రలో సంగీత నటించనుందని చిత్రసీమలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజయ్ క్రిష్ణ అనే ఆర్మీ ఆఫీసర్‌గా మహేష్ బాబు ఇందులో నటిస్తుండగా.. టాలీవుడ్ క్యూట్ బ్యూటీ రష్మిక కథనాయికగా నటిస్తోంది.

ఈ చిత్రంలో సంగీత పోషించే పాత్ర సినిమాలో.. రష్మిక పాత్రకు చాలా సన్నిహితంగా ఉంటుందంటున్నాయి సినీవర్గాలు. అయితే ఈ వార్తకు సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం సంగీత ప్రముఖ కథానాయకుడు విజయ్ ఆంథోనీ నటిస్తోన్న తమిళరసన్ అనే ప్రాజెక్ట్‌లో నటిస్తోంది. ఈ వార్తలు నిజమే అయితే.. దాదాపు 9 ఏళ్ల తర్వాత తెలుగు సినీ ప్రేక్షకులను పలకరించనుంది సంగీత.

మరోవైపు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తూన్న 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం షూటింగ్ ఇటీవలే తొలి షెడ్యూల్‌ని కాశ్మీర్‌లో పూర్తి చేసుకుంది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో 2వ దశ చిత్రీకరణ ప్రారంభించనున్నారు. ఈ మేరకు అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ఖాతా ద్వారా.. సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు పంచుకుంటూనే ఉన్నారు.

మరోవైపు ఇదే చిత్రం ద్వారా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా.. దాదాపు 13 ఏళ్ల తర్వాత తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. వీరితో పాటు ఓ కీలక పాత్రలో నటుడు జగపతిబాబు కూడా నటించాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల రీత్యా ఆయన ఇటీవలే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ వీడియో ద్వారా అందరికీ తెలియజేశారు.

2020 సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్న సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఏకె ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. మరి, ఇన్ని ప్రత్యేకతల నడుమ.. ఇద్దరు సత్తా గల నటీమణులను కొంత కాలం గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమాలో సంగీత నటిస్తోందా? లేదా? అనే వార్తలపై చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన వెలువరిస్తే కానీ ఓ స్పష్టత రాదేమో మరి..

ఇవి కూడా చదవండి

వయసు ఎంతైనా ఫర్వాలేదు.. అలాంటివాడినే పెళ్లి చేసుకుంటా : రష్మిక

'చంద్రయాన్ 2' ఓ 'బాహుబలి' : ప్రభాస్‌తో పాటు సెలబ్రిటీల ఆసక్తికర ట్వీట్స్

మిషన్ మంగళ్ చిత్రం కోసం.. "ఇస్రో శాస్త్రవేత్తలు"గా మారిన స్టార్ హీరోయిన్స్