ప్రముఖ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalithaa) జీవితం ఆధారంగా రూపొందించే బయోపిక్స్ జాబితా రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. జయలలిత పుట్టినరోజు సందర్భంగా నిత్యా మేనన్ ప్రధాన పాత్రలో ఒక చిత్రం తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించగా.. ఆ తర్వాత మరో రెండు చిత్రాలు కూడా రూపొందుతున్నాయని పలువురు దర్శకులు ప్రకటించారు.
ఇక ఈ మధ్యే ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో జయలలిత బయోపిక్ రూపొందిస్తున్నట్లు తెలిపారు పలువురు దర్శక, నిర్మాతలు. దీనికి తలైవి అనే టైటిల్ కూడా పెట్టారు. ఈ చిత్రానికి ఏ.ఎల్. విజయ్ దర్శకత్వం వహిస్తుండగా; విష్ణు ఇందూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
తాజాగా జయలలిత జీవిత కథ ఆధారంగా మరో బయోపిక్ రూపొందించనున్నట్లు ప్రకటించారు ప్రముఖ తెలుగు, తమిళ దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి (Kethireddy Jagadeeshwar Reddy). అయితే మిగతా బయోపిక్స్ జయలలిత బాల్యం, నటిగా ఎదిగిన తీరు, రాజకీయ ప్రస్థానం.. మొదలైనవన్నీ ప్రస్తావించాలని భావిస్తుంటే; ఈయన మాత్రం ఇందుకు భిన్నంగా చిత్రాన్ని తీయాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే – జయలలిత జీవిత ప్రస్థానంలోని చివరి 75 రోజుల్లో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమాను తీసేందుకు సిద్ధమయ్యారు. దీంతో జయలలిత బయోపిక్‌ల సంఖ్య అయిదుకి చేరింది.
ఈ 75 రోజులలో జయలలిత స్నేహితురాలు శశికళ (Shashikala) ఆమె పక్కనే ఉండడం, ఆమె కనుసన్నల్లోనే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం పని చేయడం.. వంటివి జరగడంతో అప్పట్లో ఆమె వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అలాగే జయలలితకు చికిత్స అందిస్తూ.. ఎప్పటికప్పుడు హెల్త్ బులిటెన్స్ విడుదల చేసిన నేపథ్యంలో అపోలో ఆసుపత్రి కూడా వార్తల్లో నిలిచింది. అదీకాకుండా జయలలిత చికిత్సకు అయిన ఖర్చుల గురించి.. ఆ హాస్పిటల్ యాజమాన్యం చేసిన ప్రకటనతో దాని పేరు కూడా దేశం మొత్తం మార్మోగిపోయింది. ఆ సదరు ఆసుపత్రిలోనే.. 75 రోజుల పాటు చికిత్స పొందిన జయలలిత తుదిశ్వాస విడిచారు.
ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే తాను తెరకెక్కించనున్న ఈ చిత్రానికి “శశి లలిత” (Shashi Lalitha) అనే పేరు పెట్టినట్లు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి ప్రకటించారు. అయితే ఈ చిత్రంలోని కథ జయలలిత ఆత్మ చుట్టూ తిరుగుతుందని.. ఆయన చెప్పడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సంబంధించి జయలలిత & శశికళ పాత్రలే కీలకం కాబట్టి వీరిరువురి ముఖచిత్రాలతో ఒక పోస్టర్‌ను కూడా విడుదల చేశారు కేతిరెడ్డి. ఈ దర్శకుడే.. ఒక ఏడాది క్రితం లక్ష్మీస్ వీరగ్రంధం పేరుతో లక్ష్మీ పార్వతి జీవితంపై ఒక సినిమా తీస్తానంటూ ప్రకటించి అప్పట్లో వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అయితే ఈ సినిమాను ఎన్నికల తర్వాత విడుదల చేస్తానని ఆయన అన్నారు.
ఇప్పటికే నిత్యా మేనన్ (Nithya Menen) & కంగనా రనౌత్ (Kangana Ranaut).. ప్రధాన పాత్రల్లో జయలలిత జీవితంపై తెరకెక్కుతోన్న సినిమాలు అందరి దృష్టినీ ఆకర్షిస్తుండగా; ఇప్పుడు జయలలిత జీవితంలో చివరి 75 రోజులు అనే కాన్సెప్ట్ ఆధారంగా తెరపైకి వచ్చిన “శశి లలిత” కూడా ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే ఈ చిత్రంలో జయలలిత, శశికళ పాత్రలు ప్రధానం.. కాబట్టి ఆ పాత్రల కోసం ధీటైన నటీమణులను తీసుకోవాలని యోచిస్తున్నారట. అందుకే జయలలిత పాత్ర కోసం ప్రముఖ బాలీవుడ్ నటీమణి కాజోల్‌ని, శశికళ పాత్ర కోసం అమలాపాల్‌ని సంప్రదించారట. అయితే ఈ పాత్రల ఎంపికకు సంబంధించి అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన వెలువడలేదు.
అయితే కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి సినిమాలు ప్రకటిస్తారే తప్ప.. విడుదల చేయరని ఇప్పటికే ఓ వార్త చిత్రసీమలో హల్చల్ చేస్తోంది. లక్ష్మీస్ వీరగ్రంధం చిత్రం విడుదలైతే గానీ.. ఇందులో నిజానిజాలు ఏంటన్నది అందరికీ తెలియకపోవచ్చు. మరి, ఆ కాన్సెప్ట్‌తోనే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించిన ఈయన.. చక్కని కథ సమకూర్చుకొని తన చిత్రం ద్వారా ఏవైనా సత్యాలు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారేమో చూడాలి. ఇది తెలియాలంటే మనం ఇంకొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి..
ఇవి కూడా చదవండి
ఆర్జీవీ మాత్రమే కాదు.. వీరు కూడా నటులుగా మారిన దర్శకులే..!
అల్లు అర్జున్ సినిమాలో.. ఛాన్స్ కొట్టేసిన ‘గీత గోవిందం’ హీరోయిన్..!
#JoinRishi అంటూ ‘ఉగాది’ని స్టైలిష్‌గా మార్చేసిన… మహేష్ బాబు ‘మహర్షి’ టీజర్