Bollywood

పదవ తరగతి పరీక్షల్లో.. 93 % మార్కులు సాధించిన బుల్లితెర నటి..!

Sandeep Thatla  |  May 8, 2019
పదవ తరగతి పరీక్షల్లో.. 93 % మార్కులు సాధించిన బుల్లితెర నటి..!

“ఒకే సమయంలో రెండు పడవల పై ప్రయాణించరాదు” అనే సామెత మనందరికీ తెలిసిందే. దీనిని చాలామంది చాలా సందర్భాల్లో ఉదహరిస్తూ ఉంటారు. చేసే పనిపై మాత్రమే పూర్తి దృష్టి పెట్టాలి అని, ఒకేసారి రెండు పనులు చేయడం వల్ల ఏకాగ్రత కొరవడి సరైన ఫలితం దక్కదని చెప్పేందుకే ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు.

అయితే ఇది అందరికీ వర్తించకపోవచ్చు. కొందరు ఒకే సమయంలో ఎన్ని పనులు చేసినా పూర్తి ఏకాగ్రతతో వాటిని పూర్తి చేసి సఫలమవుతూ ఉంటారు. అలాంటి అతికొద్దిమందిలో ప్రముఖ బుల్లితెర నటీమణి, వర్ధమాన సినీనటి అష్నూర్ కౌర్ (Ashnoor Kaur) కూడా ఒకరు.

హిందీ టెలివిజన్ పరిశ్రమలో ప్రత్యేకించి పరిచయం అవసరం లేని పేరు అష్నూర్ కౌర్. గత పదేళ్లుగా ప్రముఖ ధారావాహికల్లో కీలక పాత్రల్లో నటిస్తూ ఉత్తరాదికి చెందిన బుల్లితెర అభిమానులకు సుపరిచితురాలైంది అష్నూర్. తనలో కేవలం నటన ఒక్కటే లేదని, ఇంకా మరో ప్రతిభ కూడా ఉందని తాజాగా నిరూపించిందీ చిన్నది.

సాధారణంగా చిన్నవయసులోనే నటనారంగంలోకి అడుగుపెట్టిన వారు చదువులో సరిగ్గా రాణించలేరని అంటూ ఉంటారు. కానీ ఈ మాటల్లో ఎంత మాత్రం నిజం లేదని నిరూపించింది అష్నూర్. మార్చిలో జరిగిన సీబీఎస్ఈ (CBSE) టెన్త్ క్లాస్ (X Class) పరీక్షల్లో 93% మార్కులు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ వార్తను స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అందరితోనూ పంచుకుంది.

‘‘పదో తరగతి పరీక్షా ఫలితాల్లో నాకు 93% మార్కులు వచ్చాయి.

ఈ మార్కులు సాధించడానికి నేను చాలా శ్రమించాల్సి వచ్చింది. ఓ వైపు షూటింగ్స్‌ని మేనేజ్ చేసుకుంటూ ..మరోవైపు చదువుకు సమయం కేటాయించడానికి చాలానే కష్టపడ్డా. ఈ పరీక్షల్లో 90% మార్కులు తెచ్చుకుంటానని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా. ఇప్పుడు అది నిలబెట్టుకున్నా. బాలనటులుగా రాణించిన వారు చదువులో సరిగ్గా రాణించలేరని కొంతమంది నమ్మకం. అది నిజం కాదని నేను నిరూపించా. ఫిబ్రవరిలో విద్యార్థులంతా పరీక్షల కోసం సన్నద్ధమవుతుంటూ నేను మాత్రం షూటింగ్‌లో పాల్గొనేదాన్ని.

పరీక్షల ముందు కూడా ప్రిపేర్ అయ్యేందుకు నాకు కేవలం 2 – 3 రోజుల సమయం మాత్రమే ఉండేది. ముఖ్యంగా 12 గంటల పాటు హెవీ సీన్స్ షూటింగ్ చేసిన తర్వాత కారులో ప్రయాణిస్తూ , ఇంటికి వెళ్లే దారిలో.. ఇలా అర్ధరాత్రి 1.30.. ఒక్కోసారి 2.30 గంటల వరకు చదువుకుంటూనే ఉండేదాన్ని. మర్నాడు ఉదయాన్నే 5.30 గంటలకు నిద్ర లేచి యథావిధిగా షూటింగ్‌కి సిద్ధమయ్యేదాన్ని. షూటింగ్ జరిగేటప్పుడు కూడా సెట్స్‌కి నా పుస్తకాలు తీసుకెళ్లి.. షాట్స్ మధ్య గ్యాప్ వచ్చినప్పుడు చదువుకునేదాన్ని. అంతగా శ్రమించిన నాకు తగిన ఫలితం లభించిందని భావిస్తున్నా.

ఈ క్రమంలో నాకు సహకరిస్తూ నన్ను అడుగడునా ప్రోత్సహించిన నా తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం, షూటింగ్ నిర్వహిస్తోన్న ప్రొడక్షన్ హౌస్.. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా..’’ అంటూ తన మనసులోని భావాలకు అక్షరరూపం ఇచ్చింది అష్నూర్.

ప్రస్తుతం అష్నూర్ కౌర్ పటియాలా బేబీస్ (Patiala Babies) అనే ధారావాహికలో నటిస్తుండగా తన 9 ఏళ్ల కెరీర్‌లో సుమారు 17 సీరియల్స్‌లో కీలక పాత్రలు పోషించింది. అంతేకాదు.. గతేడాది రణ్ బీర్ కపూర్ నటించిన సంజు బయోపిక్ ద్వారా వెండితెరకు కూడా పరిచయమైంది. ఆ తర్వాత తాప్సీ నటించిన మన్మర్జియాన్ (Manmarziyaan) చిత్రంలోనూ ఆమె సోదరిగా నటించింది.

పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఈ బుల్లితెర ముద్దుగుమ్మ భవిష్యత్తులో కూడా ఇటు నటనలోను, అటు చదువులోనూ మరింత ప్రతిభా పాటవాలతో రాణించాలని, అందరి ప్రశంసలు అందుకుంటూ చక్కని పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని మనమంతా ఆశిద్దాం.

Featured Image: Instagram.com.

 

ఇవి కూడా చదవండి

మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్.. తన చిన్ననాటి స్కూల్‌ని సందర్శించిన వేళ…!

కొనసాగుతున్న RRR టైటిల్ వేట.. ఆసక్తికరమైన ఎక్స్‌ప్యాన్షన్స్‌తో సినీ అభిమానుల ట్వీట్స్..!

సల్మాన్ ఖాన్ కోసం.. మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కీలక నిర్ణయం..!

Read More From Bollywood