Health

పీరియడ్స్ గురించి అమ్మాయిలకున్న సందేహాలకు సమాధానాలు

Lakshmi Sudha  |  May 14, 2019
పీరియడ్స్ గురించి అమ్మాయిలకున్న సందేహాలకు సమాధానాలు

రుతుచక్రం, రుతుక్రమానికి సంబంధించిన విషయాల్లో అమ్మాయిలకు పూర్తిగా అవగాహన ఉండకపోవచ్చు. నెలసరి(period) విషయంలో వారికి ఎన్నో సందేహాలుంటాయి. కానీ వాటి గురించి ఎవరితోనూ చర్చించడానికి ఇష్టపడరు. ఆ సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి సైతం తమలోనే దాచుకొంటారు. నెలసరి సమయంలో వారిలో కనిపించే లక్షణాల విషయంలోనూ కాస్త అయోమయ పరిస్థితుల్లో ఉంటారు. అలాంటి కొన్ని సందేహాలకు(questions) సమాధానాలు తెలుసుకొనే ప్రయత్నం చేద్దాం.

1. పీరియడ్స్ లో ఎంత రక్తం బ్లీడింగ్ ద్వారా కోల్పోతాను?

నెలసరి సమయంలో కొంతమందిలో ఎక్కువగా; మరికొందరిలో తక్కువగా రక్తస్రావం అవుతుంది. చెప్పాలంటే ఒక్కొక్కరిలోనూ ఒక్కోవిధంగా రక్తస్రావం అవుతుంది. అయితే చాలామందికి పీరియడ్స్ సమయంలో ఓ ప్రశ్న కచ్చితంగా వస్తుంది. ‘అసలు నాకు ఎంత రక్తస్రావం అవుతుంది? పీరియడ్స్ సమయంలో నేను పోగొట్టుకొనే రక్తం ఎంత ఉండవచ్చు?’ అనే ప్రశ్నఎదురవుతుంది. ఎంత మేర మీరు రక్తం కోల్పోతారో మీకు తెలుసా? సుమారుగా 8 నుంచి 14 టీస్పూన్లు. ముందు మనం చెప్పుకొన్నట్టుగానే ఈ రక్తస్రావం ఒక్కొక్కరిలోనూ ఒక్కో విధంగా ఉంటుంది. అయితే నెలసరి సమయంలో రక్తస్రావం ద్వారా మనం కోల్పోయిన రక్తాన్ని మన శరీరం తిరిగి తయారు చేసుకొంటుంది.

2. నెలసరి సమయంలో విరేచనాలు ఎందుకు అవుతాయి?

నెలసరి సమయంలో కొందరు మహిళల్లో విరేచనాలవుతాయి. మరికొందరిలో ఇది డయేరియాకు కూడా దారి తీస్తుంది. దీనికి పీరియడ్స్ సమయంలో మన శరీరంలో విడుదలయ్యే ప్రోస్టాగ్లాండిన్స్ కారణం. ఇది గర్భాశయం కండరాలను వదులుగా అయ్యేలా చేసి నెలసరి రావడానికి కారణమవుతుంది. దీని కారణంగానే మనకు పీరియడ్స్ సమయంలో నొప్పులు వస్తుంటాయి. ఈ ప్రొస్టాగ్లాండిన్స్ కారణంగానే నెలసరి సమయంలో తరచూ టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుంది. కొందరిలో ఇది డయేరియాకు దారి తీస్తుంది. కొన్ని సందర్బాల్లో ఈ ప్రొస్టాగ్లాండిన్స్ కారణంగా నెలసరి సమయంలో మలబద్ధకం సమస్య వచ్చే అవకాశమూ లేకపోలేదు.

3. పీరియడ్స్ సమయంలో సెక్స్ గురించి ఆలోచనలు ఎక్కువగా వస్తాయెందుకు?

హార్మోన్ల ప్రభావం నెలసరి సమయంలో మనపై చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనినే ఫిమేల్ సెక్స్ హార్మోన్ అని కూడా అంటారు. దీనితో పాటు ఈస్ట్రాడయోల్ అనే మరో హార్మోన్ కూడా తన ప్రభావాన్ని చూపిస్తుంది. పైగా ఈ సమయంలో శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గి టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది కూడా లైంగికపరమైన కోరికలను పెంచుతుంది. దీని కారణంగా ఆ సమయంలో శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో సెక్స్ మంచిదేనా? అనే సందేహం వదిలిపెట్టి నెలసరి సమయంలో కలయికను ఎంజాయ్ చేయండి.

4. పీరియడ్స్ సమయంలో సెక్స్ లో పాల్గొనడం వల్ల నిజంగానే నొప్పి తగ్గుతుందా?

నిజంగానే తగ్గుతుంది. శృంగారంలో పాల్గొనడం వల్ల మనకు ఆర్గాజమ్ కలుగుతుంది. ఈ ఆర్గాజమ్ వల్ల మన శరీరంలో ఆక్సిటోసిన్ విడుదలవుతుంది. ఇది సహజసిద్ధమైన నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. కాబట్టి పీరియడ్స్ సమయంలో శృంగారంలో పాల్గొనడం వల్ల నొప్పి తగ్గుతుంది.

5. నెలసరిలో అయ్యే రక్తస్రావం వాసన ఎందుకు వస్తుంది?

నెలసరిలో మన శరీరం నుంచి రక్తం ఒకటే బయటకు రాదు. దానితో పాటు శ్లేష్మం(mucus), బ్యాక్టీరియా కూడా బయటకు వస్తాయి. వీటి కారణంగా ఆ సమయంలో అయ్యే రక్తస్రావం కాస్త వాసన వస్తుంటుంది. ఇలా వాసన రావడమనేది.. రక్తస్రావానికి ముందు రక్తం ఎంత సమయం గర్భాశయంలో ఉందనే దానిపై ఆధారపడి ఉంటుంది. ఇది మీ ఒక్కరిలోనే కాదు.. మహిళలందరిలోనూ సాధారణంగా జరిగే విషయమే. అయితే ఈ వాసనను మీరు తప్ప మరొకరు గుర్తించలేరు. నిర్ణీత వ్యవధిలో శానిటరీ న్యాప్కిన్ లేదా టాంఫూన్ మార్చుకొంటూ ఉంటే దుర్వాసన రాకుండా ఉంటుంది.

6. నెలసరి వచ్చే తేదీని ఎలా గణించాలి?

చాలామందికి నెలసరి వచ్చే తేదీని తప్పుగా లెక్కిస్తుంటారు. సాధారణంగా పీరియడ్స్ మొదలైన రోజును రుతుచక్రంలో మొదటి రోజుగా పరిగణించాలి. నెలసరి వచ్చిన ముందు రోజును రుతుచక్రంలో చివరి రోజుగా పరిగణించాలి. సాధారణంగా రుతుచక్రం 28 నుంచి 30 రోజుల పాటు ఉంటుంది. 28 వ రోజు  పూర్తయిన తర్వాత ఎప్పుడైనా నెలసరి రావచ్చు. కొన్ని నెలల పాటు మీ రుతుచక్రాన్ని గమనించడం ద్వారా ఏ తేదీకి వస్తుందో కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. సంతానం కోసం ప్రయత్నించేవారు రుతుచక్రంలో 14వరోజు కలయికలో పాల్గొంటే కచ్చితంగా మీ ప్రయత్నం ఫలిస్తుంది.

7. పీరియడ్స్ వచ్చే ముందు డిశ్చార్జి అవుతుంది కదా.. అది అందరిలోనూ జరుగుతుందా?

పీరియడ్స్ రావడానికి ముందు  అయ్యే డిశ్చార్జిని చాలా సాధారణంగానే పరిగణించాలి. ఆ సమయంలో హార్మోన్లలో వచ్చే మార్పుల వల్లే ఇలా జరుగుతుంది. డిశ్చార్జి కారణంగా ఎలాంటి దుర్వాసన లేకపోతే ఏ ఇబ్బందీ లేనట్లే. డిశ్చార్జి రంగు పసుపు రంగులో ఉండి దురద పెడుతూ, దుర్వాసన వస్తుంటే ఏదో సమస్య ఉన్నట్టే. ఈస్ట్ ఇన్ఫెక్షన్ లేదా లైంగికపరమైన వ్యాధుల కారణంగా కూడా ఇలా జరగొచ్చు. కాబట్టి గైనకాలజిస్ట్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం మంచిది.

8. ప్యాడ్స్ ఎక్కువ సమయం మార్చుకోకపోతే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందా?

ఎక్కువ సమయం ప్యాడ్స్ మార్చుకోకుండా ఉంటే టాక్సిక్ షాక్ సిండ్రోమ్ వచ్చే అవకాశాలుంటాయి. కానీ ఇది చాలా అరుదుగా కనిపించే సమస్య. కానీ దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. అందుకే కనీసం నాలుగు గంటలకోసారి టాంఫూన్, న్యాప్కిన్ మార్చుకొంటూ ఉండాలి. ఒకవేళ మీరు టాంఫూన్ వాడుతున్నట్టయితే దాన్ని తీయడం లేదా మార్చడం మరచిపోవద్దు. తరచూ ప్యాడ్స్ లేదా టాంఫూన్స్ మారుస్తున్నంత సేపు మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు.

ఇవి కూడా చదవండి:

పీరియడ్స్ విషయంలో అబ్బాయిలకు.. ఎలాంటి అపోహలుంటాయో మీకు తెలుసా?

చిన్నప్పుడు శానిటరీ న్యాప్కిన్ గురించి.. ఇలా సిల్లీగా ఆలోచించేవాళ్లం..!

GIFs: GiPhy. Tumblr

Read More From Health