Education

#POPxoWomenWantMore మ‌హిళా సాధికార‌త‌కు.. అద్దం ప‌ట్టే ఈ పుస్తకాలు కచ్చితంగా చదవాల్సిందే..!

Lakshmi Sudha  |  Mar 6, 2019
#POPxoWomenWantMore  మ‌హిళా సాధికార‌త‌కు.. అద్దం ప‌ట్టే ఈ పుస్తకాలు కచ్చితంగా చదవాల్సిందే..!

ఒక్క పుస్తకం చదివితే చాలు వెలకట్టలేని జ్ఞానం మన సొంతమవుతుంది. ఎందుకంటే.. అది మన ఆలోచనావిధానాన్ని మారుస్తుంది. మానసికంగా ఉన్నత స్థాయికి చేరుస్తుంది. మన దృక్పథాన్ని మార్చేస్తుంది. మనల్ని సాధికారత దిశగా నడిపిస్తుంది. మహిళా దినోత్సవం జరుపుకొంటున్న వేళ స్త్రీ సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడతారు.

కానీ మహిళా సాధికారత దిశగా మహిళల్ని నడిపించే ప్రయత్నం చేశారు కొంతమంది రచయిత్రులు. ఆంక్షల చట్రం నుంచి బయటకు రావడానికి ఎవరో వచ్చి మనకు సాయం చేయాల్సిన అవసరం లేదు. మన ఆలోచనల్లో మార్పు వస్తే.. వాటిని చేధించే తెగువ మనకు వస్తుంది. ఇలాంటి స్ఫూర్తినిచ్చే కొన్ని పుస్తకాలు (books) మీకోసం..

నిర్జన వారధి

కొండపల్లి కోటేశ్వరమ్మ ఈ తరానికి పెద్దగా పరిచయం లేని పేరు. కమ్యూనిస్ట్ కార్యకర్తగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడిన మహిళ. కట్టుకొన్నవాడు మధ్యలోనే చేయి వదిలేసినా.. కన్న తల్లి, కడుపున మోసిన ఇద్దరు బిడ్డలు కళ్ల ముందు కాల ధర్మం చేసినా వాటిని తట్టుకొని నిలబడిన ధీర. ఆమె జీవితం ఎన్ని మలుపులు తిరిగిందో.. ఎన్ని కష్టాలకోర్చుకుందో.. తెలియాలంటే ఆమె రచించిన నిర్జన వారధి చదవాల్సిందే. ఈ పుస్తకం చదవడం ద్వారా అసలు పోరాటతత్వం అంటే ఏంటో తెలుస్తుంది. ఈ పుస్తకం చదివిన తర్వాత మీలో, మీ ఆలోచనల్లో ఎంతో కొంత మార్పు కచ్చితంగా కనిపిస్తుంది.

చిట్టగాంగ్ విప్లవ వనితలు

యువ రచయిత్రి చైతన్య పింగళి కలం నుంచి జాలువారిన పరిశోధనాత్మక రచన ఇది. మహిళా శక్తి గురించి వారిలోని తెగువ గురించి తెలుసుకోవాలంటే.. ఈ పుస్తకాన్ని మించినది మరొకటి లేదని నా ఉద్దేశం. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా గెరిల్లా పోరాటం చేసిన మహిళల గురించి దీనిలో సవివరంగా తెలియజేశారు. ప్రీతిలత వదేదార్, కల్పనా దత్, సుహాసినీ గంగూలి వంటి మహిళల ఉక్కు సంకల్పం, స్వాతంత్య్ర సాధన కోసం బ్రిటిష్ వారి చేతిలో వారు అనుభవించిన కష్టాలు, ఎంత చిత్రవధ చేసినా చెక్కు చెదరని వారి ధైర్యం.. మనలో స్ఫూర్తిని రగిలిస్తాయి.

జానకి విముక్తి

రంగనాయకమ్మ గారి రచనలు మన ఆలోచనలపై చాలా ప్రభావం చూపిస్తాయి. మహిళగా ఎలా ఆలోచించాలో చెబుతాయి. ఆమె రచనల్లో నాకు బాగా నచ్చిన వాటిలో జానకి విముక్తి ఒకటి. మూడు భాగాలుగా ఉన్న ఈ నవల్లో స్త్రీ, పురుషుల జీవితాలు వేర్వేవు కావు.. ఇద్దరిదీ ఒకటేనని చెబుతారు రంగనాయకమ్మ. ఈ నవల్లోని నాయిక జానకి తొలుత పితృస్వామ్య భావ‌జాలానికి, పురుషాధిక్యతకు తలొగ్గి జీవిస్తుంటుంది. అదే ఆడదాని జీవితమనుకొంటుంది. కానీ క్రమక్రమంగా అలాంటి ఆలోచనలకు దూరంగా జరిగి స్త్రీగా పురుషాధిక్యపు చెర నుంచి తనని తాను విడుదల చేసుకొని తన గమ్యం వైపు నడుస్తుంది. మూడు భాగాలుగా ఉన్న ఈ నవల చదవడం పూర్తయ్యేసరికి స్త్రీ సాధికారత అంటే అర్థమవ్వడంతో పాటు దాని కోసం ఏం చేయాలో కూడా మ‌న‌కు అవగతమవుతుంది.

స్వేచ్ఛ

స్త్రీవాద రచయిత్రి ఓల్గా కలం నుంచి జాలువారిన నవల స్వేచ్ఛ. దీనిలో అరుణ పాత్ర ద్వారా స్త్రీ స్వేచ్ఛకు ఆమె నిర్వచనాన్ని ఇచ్చారు. పుట్టినప్పటి నుంచే ఈ సమాజం ఆడపిల్లకు ఎన్నో ఆంక్షలు విధిస్తుంది. అలాంటి ఆంక్షల బంధిఖానా నుంచి స్వేచ్ఛను కోరుకొనే అమ్మాయి అరుణ. ఆర్థికంగా స్వతంత్రంగా నిలబడిన తర్వాతే పెళ్లి చెప్పే అమ్మాయి అరుణ. ఆమె మాత్రమే కాదు.. ఈ నవల్లోని మరో పాత్ర ఉమ సైతం ఆధునిక భావాలకు అద్ధం పడుతుంది. ఈ నవల ద్వారా మహిళలను చైతన్యవంతం చేసి వారిని సమానత్వం దిశగా నడిపించే ప్రయత్నం చేశారు ఓల్గా.

స్వీట్ హోం

రంగనాయకమ్మ రచనల్లో మరో అద్భుతమైన నవల స్వీట్ హోం. మూడు భాగాలుగా ఉంటుంది. ఆద‌ర్శ భావాలు క‌లిగిన ఆధునిక గృహిణి విమ‌ల‌. ఆమెకు తోడూనీడగా నిలిచే భర్త బుచ్చిబాబు. ఎప్పుడూ ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఇష్టం లేని విమల మహిళా మండలికి వెళ్లి స్త్రీ శక్తి గురించి మరింత బాగా తెలుసుకొంటుంది. రచయిత్రిగా మారుతుంది. లా చదవడం మొదలుపెడుతుంది. భర్త సహకారంతో తనని తాను సాధికారత దిశగా నడిపించుకొంటుంది. మూడు భాగాలు కలిపి ఒకే సంపుటంగా ఉన్న ఈ నవల మీ ఆలోచనల్లో కచ్చితంగా మార్పు తీసుకొస్తుంది.

Featured Image: Pexels

ఇవి కూడా చ‌ద‌వండి

#StrengthOfAWoman మ‌హిళా శ‌క్తిని గుర్తించండి.. సాధికార‌త దిశ‌గా వారిని ప్రోత్స‌హించండి..!

అమ్మాయిలను మనుషులుగా చూడండి.. మార్పు అదే వస్తుంది: నీలిమ పూదోట

ఇంట్లో ఒంటరిగా ఉంటే.. అమ్మాయిలు ఎలాంటి చిలిపి పనులు చేస్తారో తెలుసా?

Read More From Education