Diet

బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి (How To Lose Weight At Home In Telugu)

Soujanya Gangam  |  May 30, 2019
బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఇంటి చిట్కాలు పాటించండి (How To Lose Weight At Home In Telugu)

బరువు (Weight).. ప్రస్తుతం చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇదొకటి. అధిక బరువు ఉండడం ఎన్నో రకాల సమస్యలకు కారణమవుతుంది. అయితే చాలామందికి ముఖ్యంగా మహిళలకు బరువు తగ్గించుకోవడానికి సమయం తో పాటు తగిన సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండవు. అయితే బరువు తగ్గాలంటే న్యూట్రిషనిస్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. జిమ్ లో కష్టపడి పనిచేయాల్సిన అవసరమే లేదు. మీ ఇంట్లోనే (Home) సులువగా డైట్ పాటిస్తూ.. ఇంట్లో చేయదగిన చిన్న చిన్న వ్యాయామాలతో బరువు తగ్గించుకోవడం సులభం. దీనికి కావాల్సిందల్లా కాస్త పట్టుదల మాత్రమే..

బరువు తగ్గేందుకు తోడ్పడే వెయిట్ లాస్ డ్రింక్స్

బరువు తగ్గేందుకు తీసుకోవాల్సిన, తీసుకోకూడదని ఆహార పదార్థాలు

తినకూడనివి

బరువు తగ్గడానికి ఇంట్లోనే చేయాల్సిన వ్యాయామాలు

బరువు తగ్గడం గురించి వచ్చే సందేహాలకు సమాధానాలు

వెయిట్ లాస్ డ్రింక్స్ ప్రయత్నించండి. . (Weight Loss Tips At Home With These Drinks)

ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గేందుకు వెయిట్ లాస్ డ్రింక్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ డ్రింక్స్ రోజూ తీసుకోవడం వల్ల ఒంట్లోని కొవ్వు కరిగి బరువు తగ్గే వీలుంటుంది. ఇవి మన శరీరం మెటబాలిజం రేటును పెంచి క్యాలరీలు త్వరగా కరిగిస్తాయి. వీటన్నింటినీ పరిగడుపున ఓసారి రోజు మరో ఒకటి లేదా రెండు సార్లు తాగడం వల్ల తొందరగా కొవ్వు తగ్గే వీలుంటుంది. మరి, బరువు తగ్గేందుకు ఇంట్లోనే తాగాల్సిన ఆ డ్రింక్స్ ఏంటో మీకు తెలుసా?

1. గ్రీన్ టీ (Green Tea)

బరువు తగ్గించుకోవాలనుకునేవారు తప్పక తాగాల్సిన డీటాక్స్ డ్రింక్ గ్రీన్ టీ. ఇది మన శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. గ్రీన్ టీలో ఎన్నో రకాల యాంటీబయోటిక్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ గ్రీన్ టీ ని కనీసం రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. దీంతో మెటబాలిజం పెరుగుతుంది. గ్రీన్ టీలో కెఫీన్ కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి శరీరానికి ఏమాత్రం ఇబ్బంది ఉండదు దీన్ని తయారుచేయడానికి ప్రత్యేకంగా గ్రీన్ టీ బ్యాగ్ అందుబాటులో ఉంటాయి. వాటిని వేడి నీటిలో వేసి కాసేపు ఉంచి తీసి ఆ గ్రీన్ టీ తాగేస్తే సరిపోతుంది. ఇలా రోజుకు మూడు సార్లు తాగాల్సి ఉంటుంది.

2. కలబందతో.. (Aloevera)

కలబంద మంచి డీటాక్స్ ఏజెంట్. దీనిలో పోషక విలువలు కూడా ఎక్కువగగా ఉంటాయి. దీన్ని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గకుండా ఉంటుంది. దీనికోసం కలబంద గుజ్జును ఫ్రెష్ గా ఒక స్పూన్ తీసుకొని అందులో మరో స్పూన్ నిమ్మరసం కలిపి ఈ మిశ్రమాన్ని గ్లాసు నీటిలొ దీన్ని మిక్స్ చేసి తాగాలి. అయితే గర్భం ధరించిన వారు మాత్రం ఈ డ్రింక్ తాగకూడదు.

3. యాపిల్ సైడర్ వెనిగర్ (Apple Cider Vinegar)

బరువు తగ్గించడంలో యాపిల్ సైడర్ వెనిగర్ ఎంతో ఉపయోగపడుతుంది. దీనికోసం యాపిల్ సైడర్ వెనిగర్ ని చల్లని నీటిలో వేసి తేనెతో కలిపి భోజనానికి ముందు తాగాల్సి ఉంటుంది. ఇది ఆకలి నియంత్రించి తక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. శరీరంలో మలినాలను కూడా తొలగిస్తుంది.

4. నిమ్మరసం, అల్లంతో..(Lemon Juice And Ginger)

నిమ్మరసంతో చేసిన ఈ డ్రింక్ ఆకలిని బాగా తగ్గిస్తుంది. పొట్టను కూడా కరిగిస్తుంది. దీనికోసం అల్లం తురుముకోవాలి. గ్లాసు నీళ్లు తీసుకొని అందులో నిమ్మరసం మిక్స్ చేసి, రెండు మూడు పుదీనా ఆకులు కూడా వేయాలి. ఆ తర్వాత అల్లం తురుమును కూడా అందులో వేసుకోవాలి. అలా కాసేపు ఉంచిన తర్వాత దీన్ని తీసుకోవాలి. దీన్ని పరగడుపున తీసుకోవడం వల్ల కొవ్వు కరుగుతుంది. ఇది శరీరాన్ని కూడా డీటాక్సిఫై చేస్తుంది.

5. జీరా పానీ (Jeera Water)

ఇది జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు బరువు తగ్గేందుకు కూడా తోడ్పడుతుంది. దీనికోసం టీస్పూన్ జీలకర్రను గ్లాసు నీళ్లలో వేసి ఆ నీటిని మరిగించాలి. దాన్ని చల్లార్చిన తర్వాత తాగాల్సి ఉంటుంది. కావాలంటే ఇందులోనూ నిమ్మరసం చేర్చుకోవచ్చు.

6. పసుపుతో టీ (Tea With Turmeric)

పసుపుతో తయారుచేసే టీ (టర్మరిక్ టీ) వల్ల బరువు తగ్గడంతో పాటు ఆకలి తగ్గడం, రక్తంలో చక్కెర స్థాయులు మరీ ఎక్కువగా లేదా తక్కువగా కాకుండా చూడడం వంటివన్నీ జరుగుతాయి. దీనికోసం చేయాల్సిందల్లా ఒక గిన్నె తీసుకొని అందులో నీళ్లు వేడి చేసి టీస్పూన్ పసుపును అందులో వేసి మరిగించాలి. ఇది మరిగిన తర్వాత అందులో దాల్చిన చెక్క పొడి వేసుకొని దింపి వేడివేడిగానే తాగాలి. మీకు దీని రుచి నచ్చకపోతే కావాలంటే ఇందులో పుదీనా, అల్లం తురుము, నిమ్మరసంలలో ఏవైనా ఉపయోగించవచ్చు.

ఆహారంతో ఇలా ప్రయత్నించి చూడండి.. (Food For Weight Loss)

బరువు తగ్గేందుకు కేవలం వెయిట్ లాస్ డ్రింక్స్ తాగడం, వ్యాయామం చేయడం మాత్రమే కాదు.. మంచి ఆహారం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీనికోసం తీసుకోవాల్సిన ఆహారం ఏంటంటే..

1. ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం (Diet With High Protein)

మన శరీరంలో కండరాలు పెరగాలంటే వాటికి ప్రొటీన్ ఎంతో అవసరం. బరువులు ఎత్తడం వల్ల మన కండరాలు దెబ్బతింటాయి. ఈ సమయంలో మన శరీరానికి ప్రొటీన్ ని అందించడం వల్ల కండరాలు పెరిగే అవకాశం ఉంటుంది. కండరాలు ఎక్కువగా ఉండడం వల్ల శరీరం మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉండి తీసుకున్న ఆహారంలోని క్యాలరీలన్నీ ఇట్టే కరిగిపోతాయి.

2. పండ్లు (గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేవి) (Fruits)

చాలామంది బరువు తగ్గడానికి పండ్లు మంచివి కావు అనుకుంటారు. ఇవి తియ్యగా ఉంటాయి. బరువు తగ్గేందుకు చక్కెరను తీసుకోకూడదు కాబట్టి వీటికి దూరంగా ఉండాలి అనుకుంటారు. కానీ పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. ముఖ్యంగా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు తీసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలుంటాయి. అయితే పండ్లు తీసుకోమన్నాం కదా అని మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు.

3. కూరగాయలు, కూరగాయల రసాలు (Vegetable And Vehetable Juice)

పండ్లు తినడం వల్ల బరువు పెరిగే వీలుండదు. అయితే ఆ భయం ఇంకా అలాగే ఉన్నవారు పచ్చి లేదా ఉడికించిన కూరగాయలు, కూరగాయలు, ఆకుకూరల రసాలను తీసుకోవడం వల్ల తక్కువ క్యాలరీలలో ఎక్కువ పోషకాలతో కడుపు నింపుకోవచ్చు.

4. డ్రై ఫ్రూట్స్, నట్స్ (Dry Fruits)

సాధారణంగా బరువు తగ్గాలనుకునేవాళ్లు డ్రై ఫ్రూట్స్, నట్స్ కి దూరంగా ఉంటారు. వీటి ద్వారా ఎక్కువ  అందుతాయని వారి నమ్మకం. కానీ వీటి ద్వారా పోషకాలు కూడా అందుతాయి. బరువు తగ్గడానికి కావాల్సిన మంచి కొవ్వులు కూడా శరీరానికి అందుతాయి కాబట్టి తక్కువ మోతాదులో అయినా వీటిని తప్పక తీసుకోవాలి.

5. ముడి ధాన్యాలు, పప్పుధాన్యాలు (Raw Grains And Legumes)

బరువు పెరగడానికి కారణం మనం తినే ఆహారం ఒక్కసారిగా గ్లూకోజ్ గా మారిపోయి రక్తంలో కలవడం. మన శరీరం వీటిని మొత్తం ఉపయోగించుకోలేదు కాబట్టి ఎక్కువగా ఉన్న శక్తి కొవ్వుగా నిల్వ ఉండిపోతుంది. అందుకే రిఫైన్ చేసిన ధాన్యాలకు బదులుగా ముడి ధాన్యాలు, పప్పు ధాన్యాలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి నెమ్మదిగా అరుగుతాయి. శక్తి కూడా నిరంతరం అందుతుంది.

6. కొబ్బరి నూనె (Coconut Oil)

అన్ని రకాల నూనెల్లోనూ కొబ్బరి నూనె బరువు తగ్గించేందుకు చాలా బాగా తోడ్పడుతుంది. ఇందులో మీడియం ఛైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. అవి మన శరీరం మెటబాలిజాన్ని పెంచేందుకు, బరువు తగ్గించేందుకు ఎంతో తోడ్పడతాయి. అందుకే రోజూ వంటల్లో ఈ నూనెను ఉపయోగించాలి. ముఖ్యంగా ఉదయాన్నే గ్లాసు నీళ్లు లేదా కాఫీలో కొబ్బరినూనె వేసి తాగడం వల్ల రోజంతా ఆకలి వేయకుండా ఉంటుంది.

7. నీళ్లు (Water)

బరువు తగ్గడంలో ఎక్కువ మంది నిర్లక్ష్యం చేసే అంశం ఏంటంటే తగినన్ని నీళ్లు తాగడం మీ శరీర బరువుకు తగినట్లుగా కనీసం మూడు లీటర్ల నీటిని తీసుకోవడం వల్ల చెడు పదార్థాలు శరీరం నుంచి బయటకు వెళ్లిపోవడంతో పాటు కడుపు నిండుగా అనిపించి జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటారు. దీనివల్ల బరువు కూడా తగ్గే వీలుంటుంది.

తినకూడనివి (Food To Avoid)

1. రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ (Refined Carbohydrates)

రిఫైన్డ్ కార్బొహైడ్రేట్స్ మన శరీరానికి చాలా హానికరమైనవి. ఇవి తీసుకోగానే సులువుగా అరిగిపోయి రక్తంలో గ్లూకోజ్ స్థాయులను పెంచుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండాలి.

2. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం (Diet With High Fats)

 కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారంతో పాటు డైట్ ఫుడ్ అని చెప్పుకునే లో ఫ్యాట్ ప్యాకేజ్ డ్ ఫుడ్ కి కూడా దూరంగా ఉండాలి. ఎందుకంటే కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహారం మన శరీరంలో కొవ్వును పెంచితే.. తక్కువగా ఉన్న ఆహారం మనలో నిర్లక్ష్యాన్ని పెంచి ఎక్కువ ఆహారం తీసుకునేలా చేస్తుంది. వీటిలో ఫ్యాట్ తక్కువగా ఉంటుందేమో కానీ క్యాలరీలు మాత్రం ఎక్కువగానే ఉంటాయని గుర్తుంచుకోవాలి.

3. చక్కెర (Sugar)

బరువు తగ్గేవారికి చక్కెర శత్రువు అనే చెప్పుకోవాలి. ఇది అధిక క్యాలరీలు కలిగి ఉండడంతో పాటు ఆహారానికి మంచి రుచిని అందించి ఎక్కువగా తినేలా చేస్తుంది. దీంతో మన శరీరానికి ఒకేసారి ఎక్కువ క్యాలరీలు అందుతాయి. అవన్నీ రక్తంలో ఒకేసారి విడుదలవ్వడం వల్ల షుగర్ లెవెల్ పెరగడంతో పాటు అవి కొవ్వుగా మారి కొవ్వు శాతం కూడా పెరుగుతుంది.

4. ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ (Artificial Sweetner)

చక్కెర తీసుకోకూడదు కదా అని చాలామంది దాని బదులు ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్ వాడుతుంటారు. ఇవి మన శరీరానికి అస్సలు మంచివి కావు. జీర్ణ క్రియ ప్రక్రియలో ఇబ్బందిని కలగజేస్తాయి. వీటితో పాటు ఎంఎస్ జీ ( మోనో సోడియం గ్లుటమేట్ ) కూడా జీర్ణ ప్రక్రియలో ఇబ్బందులు కలిగించడంతో పాటు ఆరోగ్యానికి హాని చేస్తుంది అందుకే వీటికి దూరంగా ఉండాలి.

5. ఆల్కహాల్ (Alchol)

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనే సమస్య ఎదురవుతుంది. ఇది మన లివర్ ని పాడు చేస్తుంది. అంతేకాదు.. మన శరీరం కార్బొహైడ్రేట్లు, కొవ్వులను శక్తిగా మార్చే ప్రక్రియలో మార్పులు తీసుకొస్తుంది. మన శరీరం శక్తిని తీసుకునే పద్ధతిలో మార్పులు కలుగజేసి బరువు తగ్గడం కష్టతరంగా మారుస్తుంది. అందుకే ఆల్కహాల్ కి కూడా దూరంగా ఉండాలి.

6. ప్రాసెస్ చేసిన ఆహారం, కోలాలు. (Processed Food)

నూనెలో వేయించిన పదార్థాలతో పాటు బేక్ చేసిన కేకులు, పఫ్ లు వంటివి.. చిప్స్, నూడిల్స్ వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు నోటికి రుచిగా అనిపిస్తాయి. కానీ వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా హాని జరుగుతుంది. ముఖ్యంగా బరువు తగ్గడం కష్టతరం అవుతుంది. వీటితో పాటు కోలా డ్రింక్స్ కి కూడా దూరంగా ఉండాలి.

 బరువు తగ్గడానికి ఇంట్లో చేయదగిన వ్యాయామాలు (How To Lose Weight At Home In Telugu)

బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర డైటింగ్ దే అయినా.. వ్యాయామం లేకుండా బరువు పూర్తిగా తగ్గే వీలుండదు. అందుకే బరువు తగ్గడానికి ఇంట్లోనే కొన్ని సులభమైన వ్యాయామాలు చేయాలి. అవేంటంటే..

1. నడక (Walk)

రోజూ కనీసం పదివేల అడుగులైనా వేయడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలసిన శరీరానికి నిద్ర కూడా బాగా వస్తుంది. శరీరంలో జీర్ణ క్రియలు వేగంగా సాగుతాయి. యాక్టివ్ లైఫ్ ని సాగించేందుకు ఇది మొదటి మెట్టు అన్నమాట. పదివేల అడుగులు వేయడం అంటే దాదాపు ఏడు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవడం అన్నమాట. ఇది ఒకేసారి చేయాల్సిన అవసరం లేదు కానీ ఉదయం నుంచి రాత్రి పడుకునేలోపు పదివేల అడుగులు వేయాలన్నమాట. పదివేల అడుగులు నడుస్తున్నామా? లేదా.? అన్నది ఫిట్ నెస్ ట్రాకర్ల సాయంతో తెలుసుకునే వీలు కూడా ఉంటుంది.

2. స్కిప్పింగ్ (Skipping)

నడక మన జీవనశైలిని మార్చి మెటబాలిజం వేగంగా చేయడానికి మొదటి మెట్టైతే ఇది రెండో మెట్టు అన్నమాట. వేగంగా స్కిప్పింగ్ చేయడం అంటే మంచి కార్డియో వ్యాయామం చేయడం అన్నట్లే.. అందుకే మధ్యలో ఆపకుండా కనీసం ఐదు నిమిషాల పాటు స్కిప్పింగ్ చేయాలి. ఇలా రోజులో కనీసం నాలుగు సార్లైనా చేయడం వల్ల సులభంగా బరువు తగ్గే వీలుంటుంది.

3. ప్లాంక్ (Planks)

ఇంట్లోనే కొవ్వు తగ్గించుకోవడానికి సరైన వ్యాయామం ప్లాంక్. ఇది మీ పొట్ట, తొడలు, చేతులు, నడుము వంటి భాగాలన్నింటికీ వ్యాయామాన్ని అందిస్తుంది. ఐదు నుంచి పది సెకన్లతో ప్రారంభించి కనీసం నిమిషం పాటు ప్లాంక్ వేయడం అలవాటు చేసుకోవాలి. మామూలుగా ప్లాంక్ వేసిన తర్వాత ఒక్కోవైపు ఒక చేతిని కింద ఉంచుతూ సైడ్ ప్లాంక్స్ వేయాలి. ఇలా ఒక్కో చేత్తో నిమిషం అంటే మొత్తం మూడు నిమిషాల పాటు రోజూ ప్లాంక్ చేయడం వల్ల మీ కండరాలకు మంచి వ్యాయామం అందుతుంది. ఆయా భాగాల్లో ఉన్న కొవ్వు కూడా కరుగుతుంది.

4. స్క్వాట్స్ (Squats)

స్క్వాట్స్ చేయడం చూసేందుకు చాలా సింపుల్ గా అనిపిస్తుంది. కానీ పర్ఫెక్ట్ స్క్వాట్ చేయడం ఎంతో కష్టం. మీ మోకాళ్ల స్థాయి వరకూ వంగి కూర్చున్నట్లుగా కొన్ని సెకన్లు ఉండి తిరిగి సాధారణ పొజిషన్ కి రావాలి. ఇదే స్క్వాట్ లో చాలా ముఖ్యం. దీనివల్ల నడుము, పిరుదులు, తొడలు, కాళ్ల కండరాలు బలంగా మారతాయి. అవి మన శరీరంలో పెద్ద కండరాలు కాబట్టి కొవ్వు కూడా వేగంగా కరుగుతుంది. పన్నెండు స్క్వాట్స్ చేస్తే ఒక సెట్. ఇలా ఒక సెట్ తో ప్రారంభించి రోజంతా వీలున్నప్పుడల్లా నాలుగైదు సెట్స్ చేయడం వల్ల వేగంగా బరువు తగ్గుతారు.

5. ట్రైసెప్ డిప్ (Triceps Dip)

ఇప్పటివరకూ పొట్ట, నడుము, తొడలు, కాళ్ల వద్ద కొవ్వు కరిగేందుకు వ్యాయామాలు చూశాం. ఇది చేతులు, వీపు వద్ద కొవ్వు కరిగించేందుకు తోడ్పడుతుంది. దీనికోసం కుర్చీ సాయంతో పైకి లేస్తూ కింద కూర్చుంటూ చేసే ఈ వ్యాయామం త్వరగా పూర్తవుతుంది. దీన్ని కూడా 12 సార్లు చేస్తే ఒక సెట్ అవుతుంది. ముందు ఒక సెట్ తో ప్రారంభించి తర్వాత సంఖ్యను పెంచుకుంటూ పోయి నాలుగైదు సెట్లకు చేరుకోవాలి.

6. పుషప్ (Pushups)

ఇది చేతులు, వీపు, రొమ్ముల భాగం వంటివన్నింటికీ వ్యాయామం అందిస్తుంది. బరువు తగ్గించేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చేయడం కష్టం అనుకుంటే ముందు మోకాళ్లు కిందకు ఆనించి చేస్తూ అలవాటైన తర్వాత అరికాళ్ల వరకూ కింద ఆనించకుండా ప్లాంక్ లా ఉండి చేయవచ్చు. దీన్ని కూడా పన్నెండుసార్లు చేస్తే ఒక సెట్. మొదట మోకాళ్లు కింద ఉంచి చేయడం అలవాటు చేసుకొని ఒకటి నుంచి నాలుగు వరకూ సెట్స్ చేసుకుంటూ పోవాలి. ఆ తర్వాత అసలైన వ్యాయామం ప్రారంభించవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు.. (FAQ’s)

1. సరైన డైట్ తీసుకుంటూ వ్యాయామం చేస్తున్నా నా బరువు తగ్గట్లేదు. ఎందుకు?

సరైన ఆహారం తీసుకుంటూ తగినంత వ్యాయామం చేస్తున్నా బరువు తగ్గకపోవడానికి చాలా కారణాలుంటాయి. అందులో ముఖ్యమైనవి హార్మోన్లు.. వీటి ప్రభావం వల్ల మనం బరువు తగ్గకపోతుండొచ్చు. అలాగే బరువు తగ్గడానికి మనం ఖర్చు చేసే క్యాలరీల కంటే మనం తీసుకునే క్యాలరీలు తక్కువగా ఉండాలన్న విషయం గుర్తుంచుకోవాలి. ఇలా చేస్తున్నా కొన్ని రోజులు తగ్గి ఆ తర్వాత ఒక స్టేజికి చేరుకొని బరువు తగ్గడం ఆగిపోతే కార్బ్ సైక్లింగ్ (రెండు రోజులు కార్బొహైడ్రేట్లు ఎక్కువగా తీసుకొని మరో రెండు రోజులు తక్కువగా తీసుకోవడం) వంటి డైట్స్ పాటిస్తే ఫలితం ఉంటుంది.

2. వెయిట్ లాస్ డ్రింకుల వల్ల ఏవైనా దుష్ప్రభావాలుంటాయా?

సహజ ఉత్పత్తులతో చేసే ఈ వెయిట్ లాస్ డ్రింకుల వల్ల దాదాపు మన శరీరానికి ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అయితే వాటిలో ఉపయోగించే పదార్థాలు మీకు పడకపోతే మాత్రం ఏవైనా దుష్ప్రభావాలు ఎదురయ్యే వీలుంటుంది.

3. తొందరగా బరువు తగ్గేందుకు ఏవైనా సప్లిమెంట్లు ఉంటాయా?

తొందరగా బరువు తగ్గేందుకు మార్కెట్లో ఎన్నో సప్లిమెంట్లు అందుబాటు ఉన్నాయి. కానీ వాటిని ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అందుకే సప్లిమెంట్లపై ఆధారపడకుండా కేవలం సహజ పద్ధతులు ఉపయోగిస్తూ, వ్యాయామం చేస్తూ బరువు తగ్గాలి. ఇలా చేయడం వల్ల బరువు తగ్గడం కాస్త ఆలస్యమైనా ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. అంతేకాదు.. ఇలా తగ్గిన బరువు మళ్లీ పెరగకుండా చూసుకోవడం కూడా సులభమవుతుంది.

4. ఎక్స్ పర్ట్ సాయం లేకుండా ఈ వ్యాయామాలు చేయవచ్చా?

ఇంట్లో చేసుకోగలిగే ఈ వ్యాయామాలు చాలా సులువుగా ఎలాంటి పరికరాలు అవసరం లేకుండా కేవలం శరీరం బరువునే ఆధారంగా చేసుకొని చేయగలిగేవి. వీటిని చేసే పద్ధతిని యూట్యూబ్ లేదా రకరకాల యాప్స్ లో చూడవచ్చు. ఇంట్లో సులువుగా చేసుకోగలిగే ఈ వ్యాయామాలు ఎలా చేయాలో సరిగ్గా గమనించి చేస్తే సరిపోతుంది. ప్రత్యేకంగా ఎక్స్ పర్ట్ లేదా ట్రైనర్ సాయం లేకుండా కూడా వీటిని చేయవచ్చు.

ఇవి కూడా చదవండి. 

పెళ్లి తర్వాత.. మీరు బరువు ఎందుకు పెరుగుతారో తెలుసా?

పొట్ట దగ్గర కొవ్వు మటుమాయం కావాలా?? అయితే ఈ ఆహారం తినాల్సిందే..!

బరువు సులభంగా తగ్గాలంటే.. ఈ సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే..!

 

Read More From Diet