Bigg Boss

అభినవ సీతాదేవి.. ‘బిగ్ బాస్ 1’ ఫేమ్ అర్చన నిశ్చితార్థం జరిగిన వేళ – ఆ వివరాలు మీకోసం..!

Sandeep Thatla  |  Oct 4, 2019
అభినవ సీతాదేవి.. ‘బిగ్ బాస్ 1’ ఫేమ్ అర్చన నిశ్చితార్థం జరిగిన వేళ – ఆ వివరాలు మీకోసం..!

(Tollywood actress Archana Shastry engagement with Industrialist Jagadeesh in Hyderabad) 

“శ్రీరామదాసు” చిత్రంలో అభినవ సీతాదేవిగా తెలుగు సినీ ప్రేక్షకుల కితాబునందుకుని… టాలీవుడ్‌లో ఓ చక్కటి గుర్తింపు తెచ్చుకున్న నటి వేద అలియాస్ అర్చన. స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి అయిన అర్చన 2004లో.. చిత్రపరిశ్రమలో అడుగు పెట్టింది. అయితే తొలి చిత్రం ‘తపన’తో తను పెద్ద గుర్తింపు తెచ్చుకోనప్పటికి.. ఆ తరువాత నటించిన ‘నేను’ చిత్రం ద్వారా ఆమె ప్రేక్షకులకి బాగా పరిచయమైంది.

ఇక ఆ తరువాత వచ్చిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రం ద్వారా సినీ అభిమానులకు మరింత దగ్గరైంది. ఆమె తన కెరీర్‌లో పౌర్ణమి, యమదొంగ, సామాన్యుడు, ఖలేజా మొదలైన చిత్రాలతో గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా.. అదే సమయంలో నృత్యకారిణిగా కూడా వివిధ వేదికలపై ప్రదర్శనలిస్తూ అందరి మన్ననలను పొందగలిగింది.

‘అమల – నాగార్జునల’ ప్రేమకథ ఎంత ఆసక్తిగా ఉంటుందో.. అంతే స్ఫూర్తినీ నింపుతుంది..!

ఆ తర్వాత ‘బిగ్ బాస్ 1’ రియాలిటీ షోలో కూడా పాల్గొన్న అర్చన..  టాప్ 5 లో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఆమె వ్యక్తిగత జీవితానికి వస్తే.. నిన్న హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ స్టార్ హోటల్‌లో జగదీశ్ అనే వ్యక్తితో అర్చన నిశ్చితార్ధం జరిగింది. అర్చన ‘బిగ్ బాస్ సీజన్ 1’లో పాల్గొన్న సమయంలోనే.. ఒకరితో ప్రేమలో ఉన్నట్టుగా తెలిసింది. అయితే అతను ఎవరు? ఏం చేస్తుంటాడు? తన పేరేమిటి? లాంటి విషయాలను మాత్రం ఆమె బయటపెట్టలేదు.

అప్పటికీ.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 1 హోస్ట్‌గా చేసిన ఎన్టీఆర్ కూడా పలుమార్లు షోలో.. అర్చన ప్రేమించిన ఆ అజ్ఞాత వ్యక్తి గురించి ఆరా తీశారు. ఇదే క్రమంలో రకరకాల ప్రశ్నలు కూడా వేశారు. అయితే  అర్చన ఆ వివరాలు ఏమీ బయటకు చెప్పకపోవడం గమనార్హం. అదే సమయంలో తోటి బిగ్‌బాస్ హౌస్‌మేట్స్ నవదీప్, హరితేజ, శివ బాలాజీలు కూడా.. అర్చన మనసులోని వ్యక్తి గురించి తెలుసుకుందామని ప్రయత్నించారు. అయినా ఆమె ఎప్పుడూ బయటపడలేదు. 

కాకపోతే తను ప్రేమించిన వ్యక్తి పేరు ‘మిస్టర్ బాలి’ అని మాత్రం తెలిపింది. ఇక బిగ్ బాస్‌లో అర్చనను చూడడానికి వచ్చిన వాళ్ళ అమ్మతో కూడా.. తన ప్రేమ విషయం ఎవ్వరికి చెప్పొద్దని ఆమె తెలిపింది.

ఇక గత నెలలో అర్చన ఒకరోజు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా.. తన జీవితంలోకి రాబోయే వ్యక్తి ఫోటోని పోస్ట్ చేయడం విశేషం. ఆ పోస్ట్ ద్వారా తన జీవిత భాగస్వామి గురించి అందరికీ స్పష్టంగా తెలియజేసింది. అతని పేరే జగదీష్. 

అర్చన ప్రేమించి.. పెళ్లి చేసుకుంటున్న జగదీష్.. ఓ హెల్త్ కేర్ కంపెనీ యజమాని అని తెలుస్తోంది. వీరిద్దరి నిశ్చితార్ధం ఇరు కుటుంబాలు.. ఆత్మీయుల మధ్య చాలా నిరాడంబరంగా జరిగింది. అయితే వివాహ తేదీ ఎప్పుడు అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.

‘ఉప్పెనంత ప్రేమ’కి సాక్ష్యం అంటున్న.. డ్యాన్స్ మాస్టర్ రఘు & సింగర్ ప్రణవి

ఈ నిశ్చితార్ధానికి అర్చన స్నేహితులైన శివబాలాజీ, మధుమితలు జంటగా విచ్చేయగా.. సినీ హీరో సుమంత్, నవదీప్‌లు కూడా ఈ వేడుకకి హాజరై అర్చన – జగదీశ్‌ల జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం  అర్చన నటించిన ఓ తెలుగు చిత్రం ఇటీవలే విడుదలవ్వగా.. కన్నడలో చేసిన మరి కొన్ని చిత్రాలు ఇంకా విడుదలకావాల్సి ఉన్నాయట.

మరి అర్చన రాబోయే రోజుల్లో తన నటనని కొనసాగిస్తుందా? లేదా? అనేదానికి కాలమే సమాధానం చెప్పాలి. అయితే ఆమె ఎంతో ఇష్టంగా నేర్చుకున్న కూచిపూడిని మాత్రం.. తను ఎన్నటికీ వీడదని మాత్రం చెప్పవచ్చు.

మొత్తానికి అభినవ సీతాదేవిగా తెలుగు ప్రేక్షకుల చేత శభాష్ అనిపించుకున్న అర్చన.. తన జీవితంలో ఒక మధురమైన మజిలీని చేరుకునే సందర్భంలో.. ఆమెకి మీ & మా తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. 

మాది 100 % ‘లవ్ స్టోరీ’ – సింగర్ గీతా మాధురి & యాక్టర్ నందు ..!

Featured Image: www.facebook.com/officialarchanashastry

Read More From Bigg Boss