ఆమె అతిలోక సుందరి.. లేడీ సూపర్‌స్టార్. అప్పట్లో అగ్ర హీరోలందరూ ఆమెతో నటించేందుకు పోటీపడేవారు. తనే శ్రీదేవి (Sridevi). ఆమె మరణించి నేటికి సంవత్సరం పూర్తవుతున్నా.. తను మన మధ్య లేదంటే అభిమానులెవరూ ఇప్పటికీ ఆ మాటను జీర్ణించుకోలేకపోతున్నారు. గతేడాది తన మేనల్లుడు మోహిత్ మార్వా వివాహం కోసం దుబాయ్‌కి వెళ్లిన శ్రీ అక్కడే ఓ హోటల్‌లోని బాత్‌టబ్‌లో.. ప్రమాదవశాత్తు ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. తన మరణం భారతీయ సినీ పరిశ్రమకే తీరని లోటు. ఎంతమంది నూతన కథానాయికలు వచ్చినా శ్రీదేవికి స్థాయిని అందుకోలేరు సరికదా.. నటన విషయంలో ఆమెకు సగం కూడా పోటీ ఇవ్వలేరని చెప్పవచ్చు.
బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రీదేవి కేవలం తమిళం, తెలుగు చిత్రాలలోనే కాదు..బాలీవుడ్‌లోనూ నటించారు. శ్రీదేవి లాంటి కథానాయిక అంతకుముందు లేదు. ఇకపై రారు అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఒకప్పుడు తెలుగులో అందరు టాప్ హీరోలతో కలిసి నటించిన అగ్రకథానాయిక శ్రీదేవి. హీరోయిన్లలో ఎవరికీ లేని క్రేజ్ తన సొంతం. అందుకేనేమో.. ప్రతి హీరో తనతో కలిసి నటించాలని కోరుకునేవారు. బాలీవుడ్‌లోనూ స్టార్ కథానాయకులతో కలిసి నటించి లేడీ సూపర్‌స్టార్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించారామె. బోనీకపూర్‌తో వివాహం తర్వాత వెండితెరకు దూరమైనా.. తిరిగి ఇంగ్లిష్ వింగ్లిష్, పులి, మామ్ చిత్రాలతో రీఎంట్రీ ఇచ్చారు. శ్రీ కెరీర్ మరోసారి అద్భుతంగా సాగుతోందని అనుకునేలోపే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం కేవలం వెండితెరకే కాదు.. మనందరికీ తీరని లోటు.
అలాంటి అద్బుత కథానాయికను తిరిగి తీసుకురాలేకపోయినా.. తాను ఉన్నప్పటి ఫొటోలు చూస్తూ ఆ లోటును మర్చిపోవాల్సిందే.. అందుకే ఆ అందాల అతిలోక సుందరి శ్రీదేవి వర్థంతి(Death anniversary) సందర్భంగా జీవితంలో ఇప్పటివరకు మనం చూడని అరుదైన ఫొటోలు ఓసారి చూసేద్దాం.
శ్రీదేవి తన తల్లి ప్రోత్సాహంతోనే చిన్నతనంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. చిన్నతనంలో బాలనటిగా ఆమె నటించిన హీరోలతోనే తర్వాత కథానాయికగానూ నటించారు. ఆమెకు ఓ చెల్లెలు కూడా ఉంది. తనపేరు శ్రీలత.
ప్రముఖ కథానాయిక మహేశ్వరి శ్రీదేవి కజిన్. వాళ్లిద్దరూ కలిసి వివిధ చోట్లకు వెళ్తూ ఉండేవారు.
శ్రీదేవి టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కి వెళ్లి అక్కడ హీరోలందరితో కలిసి నటించారు. బోనీ కపూర్ నిర్మాతగా వ్యవహరించిన చిత్రాల్లో కూడా ఆమె నటించారు. వారిద్దరి ప్రేమ అప్పుడే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు.
బోనీ కపూర్‌తో వివాహం తర్వాత అడపాదడపా చిత్రాల్లో నటించినా.. జాన్వి పుట్టిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు శ్రీదేవి.
ఖుషి పుట్టిన తర్వాత అటు తల్లిగా బాధ్యతలు నిర్వహిస్తూనే.. ఇటు నిర్మాణ వ్యవహారాల్లో కూడా భర్తకు సాయం చేసేవారు.
తన పిల్లలంటే శ్రీదేవికి ఎంతో ఇష్టం. తల్లి తోడుగా లేకపోతే జీవితం లేదు. తల్లి కాలేకపోతే ఆ జీవితానికి అర్థం లేదు అని చెప్పేవారట శ్రీదేవి.
పిల్లలిద్దరిలోనూ జాన్వి అంటే శ్రీదేవికి చాలా ఇష్టమట. ఖుషి ఎంతో స్ట్రాంగ్.. కానీ జాన్వి తనలాగే ఎంతో సెన్సిటివ్ అనే శ్రీ.. ఆమెను అన్నివేళలా జాగ్రత్తగా కాపాడుకునేదట. పిల్లలకు దగ్గరగా ఉండేందుకు ఆమె ఎంతో ఇష్టపడేదట.
ఆమె పెద్దకూతురు జాన్వి తెరంగేట్రం చేసే “దడక్” చిత్రం షూటింగ్ జరుగుతుండగానే శ్రీదేవి కన్నుమూశారు. ఆ చిత్ర ప్రారంభోత్సవం రోజున ఆమె తన కూతురితో కలిసి షూటింగ్‌కి వెళ్లి తనకు అండగా ఉండి ధైర్యాన్ని అందించారట!
శ్రీదేవికి ఐస్‌క్రీం అంటే ఎంతో ఇష్టమట. కానీ చిన్నతనంలో అది తింటే లావైపోయి.. అవకాశాలు తగ్గిపోతాయని ఎక్కువగా తిననిచ్చేవారు కాదట. ఆ ముచ్చటను బోనీతో పెళ్లయిన తర్వాత తీర్చుకున్న శ్రీ.. తరచూ భర్తతో కలిసి ఐస్‌క్రీం తినేవారట.
కేవలం ఇండస్ట్రీలోనే కాదు.. దేశంలోని వివిధ నగరాల్లో శ్రీదేవికి మంచి స్నేహితులున్నారు. ఫిక్కీ జాతీయాధ్యక్షురాలు, సుబ్బిరామిరెడ్డి కుమార్తె పింకీ రెడ్డి శ్రీదేవికి మంచి స్నేహితురాలు.
శ్రీదేవి నటించిన చిత్రాలు ఒక్కొక్కటి ఒక్కో అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఏ ఒక్కదాన్ని మరోదానితో పోల్చలేం. దానికి సంబంధించిన అద్భుత చిత్రాలు మీకోసం..
ఈ అందాల అతిలోక సుందరి ఏ లోకాన ఉన్నా.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం.
ఇవి కూడా చదవండి.
తమ తల్లిదండ్రుల కంటే.. ఈ బుజ్జాయిలు భలే ఫేమస్ తెలుసా..!
రామ్ ఒక్కడే కాదు.. ఇలాంటి ఖరీదైన గిఫ్టులు చాలామందే ఇచ్చారు..
నైసా దేవగన్ .. ఈ బాలీవుడ్ స్టార్‌కిడ్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే.. !