అవిసె గింజలు (Flax seeds).. చూసేందుకు, రుచిలో పెద్ద ప్రత్యేకత ఏమీ లేకపోయినా ఈ గింజలను మాత్రం సూపర్‌ఫుడ్ (Superfood) గా చెప్పుకోవచ్చు. 3000 సంవత్సరాల క్రితం బాబిలోయన్ల కాలంలోనే వీటిని పండించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అప్పటి రాజులు కూడా వీటిని ప్రజలు నిత్యం తినే ఆహారంలో భాగంగా మార్చారట.
దీనికి అందులోని పోషకాలే కారణం. అయితే ఇప్పుడు మాత్రం ఈ గింజల గురించి ఎక్కువమందికి తెలియకుండా పోయింది. ఇందులోని పోషకాల గురించి తెలిస్తే రుచి కాస్త తేడాగా ఉన్నా వీటిని రోజూ తినాలనుకుంటారు. దీనివల్ల మన ఆరోగ్యానికే కాదు.. అందానికి కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయి.
ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి నిండి ఉండే ఈ గింజల్లో ప్రొటీన్, ఒమెగా – 3 ఫ్యాటీ యాసిడ్లు వంటివి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల డయాబెటిస్, క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలను తగ్గించే శక్తి ఈ గింజలకు ఉందని చెప్పొచ్చు.
అవిసె గింజల వల్ల మన శరీరానికి ఉన్న ఉపయోగాలు
అవిసె గింజలు చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు
అవిసె గింజలు చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు
రుచికరంగా మార్చేందుకు ఇలా ప్రయత్నించండి..
అవిసె గింజలను ఎక్కువగా ఉపయోగించడం వల్ల దుష్ప్రభావాలు
పోషకాలు నిండిన గింజలు.. (Nutritional Value Of Flax Seeds (Avise Ginjalu))
అవిసె గింజలు(Flax seeds) పోషకాల గనులు.. ఇందులో మన శరీరానికి అవసరమయ్యే స్థూల పోషకాలైన ప్రొటీన్, ఫ్యాట్, ఫైబర్ వంటివి ఎక్కువగా లభిస్తాయి. ఇవే కాదు.. సూక్ష్మ పోషకాలు కూడా వీటిలో ఎక్కువగానే లభిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ అవిసె గింజల్లో ఉండే పోషకాలను ఓసారి గమనిస్తే…
క్యాలరీలు – 37
ప్రొటీన్ – 1.3 గ్రా.
కార్బొహైడ్రేట్లు – 2 గ్రా.
ఫైబర్ – 1.9గ్రా.
ఫ్యాట్ – 3 గ్రా.(మోనో అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ – 0.5 గ్రా. , సాచురేటెడ్ ఫ్యాట్ 0.3 గ్రా, పాలీ అన్‌సాచురేటెడ్ ఫ్యాట్ 2గ్రా.)
ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు – 1597 మి. గ్రా.
విటమిన్ బి1- రోజు తీసుకోవాల్సిన విలువలో 8శాతం
విటమిన్ బి6 – 2 శాతం
ఫోలేట్ – 2 శాతం
క్యాల్షియం – 2 శాతం
ఐరన్ – 2 శాతం
పొటాషియం – 2 శాతం
మెగ్నీషియం – 7 శాతం
ఫాస్పరస్ – 4 శాతం
ఇందులోని ఒమెగా – 3 ఫ్యాటీ ఆమ్లాలతో పాటు లిగ్నన్లు, ఫైబర్ వంటివి మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు తోడ్పడతాయి.
అవిసె గింజలు తీసుకోవడం వలన కలిగే ఆరోగ్య (Benefits Of Flax Seeds For Body)
అవిసె గింజలను ఉపయోగించడం వల్ల మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు అందుతాయి. దీంతో పాటు ఈ గింజల్లో ఉన్న ఔషధ గుణాలు మన శరీరం వివిధ వ్యాధుల బారిన పడకుండా.. మరికొన్ని ఆరోగ్య సమస్యలు తగ్గేలా చేస్తాయి. వాటి గురించి ఓసారి గమనిస్తే..
Also Read మెంతులు వల్ల కలిగే ప్రయోజనాలు (Benefits Of Fenugreek Seeds)
క్యాన్సర్‌ని తగ్గిస్తాయి (Reduces Cancer)
అవిసె గింజల్లోని యాంటీ ఆక్సిడెంట్లు మన శరీరానికి రక్షక భటుల్లా కాపలా కాస్తాయి. ఇవి మనకు ప్రొస్టేట్, పెద్దపేగు, రొమ్ము క్యాన్సర్లు రాకుండా మనల్ని కాపాడతాయి.
గుండెను రక్షిస్తాయి (Good For Heart)
అవిసె గింజలు రక్తపోటు ముప్పును తగ్గిస్తాయి. రక్తనాళాలు పెళుసుగా మారడాన్ని ఆపడమే కాదు.. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడం లేదా రక్తం గడ్డకట్టి రక్తప్రసరణను ఆపడం వంటివి జరగకుండా ఆపుతాయి. అంతేకాదు.. కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం చాలా తగ్గే వీలుంటుంది.
డయాబెటిస్ ముప్పు తగ్గిస్తాయి (Reduces Risk Of Diabetes)
రోజూ అవిసె గింజలు తినే డయాబెటిస్ పేషంట్లలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గడం, రక్తంలో చక్కెరల స్థాయులు అదుపులో ఉండడం గమనించారు పరిశోధకులు. అందుకే ఇది డయాబెటిస్ ఉన్నా.. లేక ఇంకే ఇతర సమస్య ఉన్నా ప్రతిఒక్కరూ తీసుకోగలిగే ఆహారం అని తేల్చి చెప్పారు.
బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. ( Avise Ginjalu For Weight Loss)
అవిసె గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ప్రొటీన్లు, ఫ్యాట్లు వంటివి కూడా ఎక్కువగానే ఉంటాయి. మన శరీరానికి అవసరమయ్యే పోషకాలన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి. అందుకే వీటిని కొద్దిగా తినగానే ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. తద్వారా ఆహారం తక్కువగా తీసుకుంటాం కాబట్టి బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఇందులోని ఫైబర్ వల్ల ఆహారంలోని పోషకాలన్నీ శరీరానికి అందే వీలుంటుంది.
మెనోపాజ్ లక్షణాలను దూరం చేస్తాయి. (Removes Menopause Symptoms)
రోజూ కేవలం రెండు టీస్పూన్ల అవిసె గింజలు తీసుకుంటే చాలు.. ప్రీ మెనోపాజల్, పోస్ట్ మెనోపాజల్ దశలో ఉన్న ఆడవారికి వేడి ఆవిర్లు రాకుండా ఇవి కాపాడతాయి.
నొప్పి, వాపులు తగ్గిస్తాయి. (Reduce Pain And Swelling)
చాలామందిలో ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాల లోపం కారణంగా శరీర భాగాల్లో నీరు పట్టేయడం, వాపులు రావడం, నొప్పిగా అనిపించడం వంటివి జరుగుతుంటాయి. అవిసె గింజలను తరచూ తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలేవీ ఉండకుండా జాగ్రత్తపడొచ్చు.
జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి (Improves Digestion)
అవిసె గింజలు మనం తీసుకునే ఆహారంలోని పోషకాలన్నీ శరీరానికి అందేలా తోడ్పడతాయి. ఇందులోని ఫైబర్ మన కడుపు నిండి ఉన్న ఫీలింగ్ కలిగించడంతో పాటు జీర్ణక్రియ సజావుగా సాగేలా చేస్తాయి.
అవిసె గింజలు చెక్క వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలు (Benefits Of Flax Seeds For Skin)
అందాన్నీ కాపాడేందుకు ఉపయోగపడుతుంది.. (Keeps Skin Healthy)
అవిసె గింజలు కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడేందుకు మాత్రమే కాదు.. మన చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతూ మన అందాన్ని ద్విగుణీకృతం చేసేందుకు కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఇవి మన చర్మానికి అందించే ప్రయోజనాలేంటంటే..
చర్మం ఆరోగ్యాన్ని కాపాడుతాయి. (Protect Skin From Rashes)
అవిసె గింజల్లోని ఒమెగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు మన చర్మంపై మంచి ప్రభావాన్ని చూపిస్తాయి. ఇవి చర్మంపై ఎలాంటి రాషెస్ రాకుండా కాపాడడంతో పాటు ఎరుపుదనం, మంట వంటివి రాకుండా చేస్తాయి. చర్మంపై తగిలిన గాయలను మాన్పడానికి ఇవి తోడ్పడతాయి.
చర్మాన్ని మాయిశ్చరైజ్ చేస్తాయి. (Moisturize Skin)
అవిసె గింజలు మన చర్మంలో సహజ నూనెలు ఎక్కువగా ఉత్పత్తయ్యేలా చేస్తాయి. దీనివల్ల మన చర్మం మెత్తగా, పట్టులా ఉండడంతో పాటు తేమ కూడా నిండి ఉంటుంది. ముఖ్యంగా ఎప్పుడూ చర్మం పొడిగా తయారయ్యే వారికి ఇవి మంచి ఎంపిక.
యాక్నేని తగ్గిస్తాయి.. (Reduce Acne)
అవిసె గింజలు మన చర్మం విడుదల చేసే సెబమ్ అనే సహజ నూనెలు తక్కువగా విడుదలయ్యేలా చేసి చర్మం మృదువుగా మారేలా చేస్తాయి. అంతేకాదు.. యాక్నె సమస్యను కూడా రాకుండా చేస్తాయి.ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా రోజూ ఒకటి రెండు టీస్పూన్లు అవిసెగింజలను తీసుకోవడమే..
ఎండ నుంచి రక్షణ కల్పిస్తాయి. (Protect From Heat Of Sun)
ఎండాకాలంలో సూర్యుని వేడి నుంచి మంట, సన్‌బర్న్ వంటి వాటన్నింటి నుంచి మనల్ని కాపాడే శక్తి ఈ అవిసె గింజలకు ఉంది. సూర్యుని వేడి వల్ల చర్మానికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా కాపాడుతాయి.
అవిసె గింజల వల్ల కేవలం మన చర్మానికే కాదు.. జుట్టుకు కూడా ఎన్నో ప్రయోజనాలు అందుతున్నాయి. అవేంటంటే..
అవిసె గింజలు చెక్క వల్ల జుట్టుకి కలిగే ప్రయోజనాలు (Avise Ginjalu Uses For Hair)
జుట్టు తెగి రాలిపోవడాన్ని ఆపుతాయి. (Reduces Hair Fall)
అవిసె గింజల్లోని ఒమెగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టులో తేమను పెంచి అవి తేమతో నిండి ఉండి సిల్కీగా కనిపించేలా చేస్తాయి. అందుకే జుట్టు సమస్యలున్నవారు వీటిని తప్పక తీసుకోవాల్సిందే.
చుండ్రును అడ్డుకుంటాయి. (Removes Dandruff)
అవిసె గింజలు జుట్టుకు మంచి మాయిశ్చరైజేషన్, పోషణ అందించడం వల్ల తల కూడా ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ. దీనివల్ల చుండ్రు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అవుతాయి. వీటిని తినడంతో పాటు అవిసె గింజల నూనె పెట్టుకోవడం, మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల చుండ్రు పూర్తిగా తగ్గిపోయే వీలుంటుంది.
బట్టతల రాకుండా కాపాడుతాయి. (Protects Baldness)
ఇటీవలి కాలంలో అబ్బాయిలకు బట్టతల సమస్య బాగా పెరిగిపోతోంది. మీక్కూడా ఇలాంటి సమస్యే ఉంటే మీరు రోజూ అవిసె గింజలు తీసుకోవడం మంచిది. దీనివల్ల మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. బట్టతలకు దారితీసే ఎంజైమ్‌లతో పోరాడి బట్టతలను అడ్డుకుంటాయి అవిసె గింజలు.
రుచికరంగా మార్చేందుకు ఇలా ప్రయత్నించండి.. (How To Use Flax Seeds In Diet – Avise Ginjalu Uses In Telugu)
చాలామందికి ఆరోగ్య ప్రయోజనాలను గమనించి అవిసె గింజలను తినాలనే ఆశ తప్పక ఉంటుంది. కానీ రుచిగా లేవన్న కారణంతో వీటిని పక్కనపెడుతుంటారు. అయితే రుచికరంగా మార్చుకోవడం తెలిస్తే చాలు.. అవిసె గింజలను వివిధ పదార్థాలతో కలిపి తినే వీలుంటుంది. ఇలా చేయడం వల్ల వాటిలోని పోషకాలు మన శరీరానికి అందుతాయి. కానీ వాటిని తీసుకున్నట్లుగా కూడా మనకు అనిపించదు. అలా ఏమాత్రం తేడా తెలియకుండా అవిసె గింజలను మన ఆహారంలో భాగం చేసుకుంటే ఇటు పోషకాలు పొందడంతో పాటు అటు ఏమాత్రం రుచిలో తేడా కూడా తెలీదు. అవిసె గింజలను ఉన్నవి ఉన్నట్లుగా తీసుకుంటే మన శరీరం వాటిని వినియోగించుకోలేదు. అందుకే వాటిని పొడి చేసి లేదా ముక్కలు చేసి తీసుకోవచ్చు. వీటిని వివిధ పదార్థాలతో కలిపి ఎలా తయారుచేసుకోవాలంటే..
1. మఫిన్స్ తయారుచేస్తున్నప్పుడు సాధారణంగా అందులో జీడిపప్పు, బాదం పప్పు వంటివి వేసుకోవడం సహజమే.. వాటితో పాటు కొన్ని అవిసె గింజలను కూడా చేర్చండి. రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.
2. మీకు రోజూ పొద్దున్నే పండ్లు, లేదా ఫ్రూట్ యోగర్ట్ బౌల్ తినే అలవాటు ఉంటే వాటిలోనూ అవిసె గింజలను చేర్చుకుంటే రుచిలో పెద్దగా తేడా రాకపోయినా కరకరలాడుతూ ఉండే స్నాక్ లేదా బ్రేక్‌ఫాస్ట్ తినడానికి వీలుంటుంది.
3. అవిసె గింజలను ఎండబెట్టి లేదా కాస్త వేయించి మిక్సీ పట్టి పొడి చేసిపెట్టుకుంటే చాలు.. రోజూ ఓ టీస్పూన్ చొప్పున ఈ పొడిని మీకు నచ్చిన వంటకంలో వేసి తినే వీలుంటుంది.
4. వీటిని టోస్ట్‌తో పాటు వేడి చేసి తింటే కరకరలాడుతూ వేడిగా తినే వీలుంటుంది.
5. ఒకటీ రెండూ కాదు.. మీరు చేసుకునే ప్రతి వంటలోనూ దీన్ని భాగం చేసుకునే వీలుంటుంది.
6. అవిసె గింజలను ఏ పదార్థంలోనైనా గుడ్లకు బదులుగా వేసే వీలుంటుంది. గుడ్డుకు బదులుగా అవిసె గింజలను వాడాలనుకుంటే రెండు టేబుల్‌స్పూన్ల అవిసె గింజల పొడికి, అంతే మోతాదులో నీళ్లు కలుపుకొని గుడ్డుకు బదులుగా దీన్ని ఉపయోగించాల్సి ఉంటుంది.
7. అవిసె గింజలను వేసి చేసే వంటకాలను బేక్ చేయడానికి ప్రయత్నించాలి. కేక్, బిస్కట్ల వంటివి బేక్ చేసే పదార్థాల్లో ఈ గింజలను జోడిస్తే సరిపోతుంది.
ముఖానికి ఇలా ప్రయత్నించండి. (How To Use Flax Seed For Skin)
అవిసె గింజలు మన చర్మం ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతగానో తోడ్పడతాయని తెలుసుకున్నాం కదా.. ఈ ప్రయోజనాలన్నింటినీ పొందాలంటే వాటిని ఆహారంలో భాగంగా తీసుకోవడంతో పాటు ఫేస్‌ప్యాక్‌లలో కూడా ఉపయోగించవచ్చు. వీటిలోని పోషకాలు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. ఈ ఫేస్‌ప్యాక్ ఎలా తయారుచేసుకోవాలంటే..
1. అవిసె గింజలు, గుడ్డు ప్యాక్ (Egg Face Pack)
దీనికోసం గుప్పెడు అవిసెగింజలను తీసుకొని పొడి చేసి వాటిని గుడ్డులోని తెల్లసొన తీసుకొని అందులో ఈ పొడి వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఆ తర్వాత దీన్ని ముఖానికి, మెడకు పట్టించి పది నిమిషాల తర్వాత మైల్డ్ ఫేస్‌వాష్ జెల్ తో ముఖం కడుక్కోవాలి. ఇవి మీ ముఖానికి తేమను అందిస్తాయి. దీన్ని నెలకు రెండుసార్లు వేసుకోవాలి.
2. అవిసె గింజలు, నిమ్మరసం, తేనె ప్యాక్ (Lemon Juice And Honey)
ఈ ప్యాక్ కోసం ముందురోజు రాత్రి అవిసె గింజలను నానబెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా నానబెట్టుకున్న గింజలను ఉదయాన్నే రుబ్బుకొని అందులో రెండు టీస్పూన్ల నిమ్మరసం, టేబుల్ స్పూన్ తేనె వేసి ముఖానికి అప్లై చేసుకొని ఆరే వరకూ ఉంచుకోవాలి. దీన్ని వేసుకుంటే మంచి యూత్‌ఫుల్ లుక్ మీ సొంతమవుతుంది. ఏవైనా ప్రత్యేకమైన అకేషన్లకు ముందు వేసుకుంటే ప్రత్యేకమైన లుక్ మీ సొంతమవుతుంది.
3. అవిసె గింజలు, దాల్చినచెక్క, పెరుగు ప్యాక్ (Cinnamon And Yogurt)
దీనికోసం రెండు టీస్పూన్ల అవిసె గింజల పొడి, టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, టేబుల్ స్పూన్ పెరుగు వేసి కలుపుకోవాలి. అది ముఖానికి అప్లై చేసుకొని చల్లని నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి.
4. తేనె, అవిసె గింజలతో.. (Honey)
వార్థక్య ఛాయలను దూరం చేసేందుకు అవిసె గింజలు బాగా ఉపయోగపడతాయి. చర్మంపై ఉన్న ముడతలు తొలగించడానికి దీనిని ఉపయోగించవచ్చు. ఇందుకోసం అవిసె గింజల పొడి, తేనె టేబుల్‌స్పూన్ చొప్పున తీసుకొని మిక్స్ చేసి వాటిలో కొన్ని వేడి నీరు కూడా పోయాలి.
ఇలా చేయడం వల్ల మిశ్రమం కాస్త వదులుగా మారుతుంది ఆ తర్వాత సన్నని వస్త్రం తీసుకొని దాన్ని ఈ ప్యాక్‌లో ముంచి ముఖంపై వేసుకోవాలి.. వేసుకునేటప్పుడు మరీ వేడిగా లేకుండా చూస్కోవాలి. ప్యాక్ పూర్తిగా ఆరిపోయిన తర్వాత వస్త్రాన్ని తొలగించి చన్నీళ్లతో కడిగేసుకుంటే సరి.
దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి.. (Side Effects OF Flax Seeds)
అవిసె గింజల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. కానీ అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లు ఏదైనా సరే ఎక్కువగా తీసుకుంటే ముప్పే.. అందుకే వీటిని కూడా ఎక్కువగా తీసుకోకూడదు. అంతేకాదు.. కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నవారు కూడా దీన్ని తీసుకోకూడదు. ఎలాంటివారంటే..
– ఆస్ప్రిన్ మాత్రలు వేసుకునేవారు
– రక్తం గడ్డకట్టకుండా ఉండే మాత్రలు వేసుకునేవారు
– బీపీ, షుగర్ మాత్రలు వేసుకునేవారు
– మలబద్ధకానికి మాత్రలు వేసుకునేవారు
– హైపోగ్లైసీమియా, లో బీపీ, ప్రొస్టేట్ క్యాన్సర్ వంటి సమస్యలు ఉన్నవారు నిపుణుల సలహా తీసుకొని వీటిని తీసుకోవాలి. గర్భంతో ఉన్నవారు, పాలిచ్చే తల్లులు వీటిని అస్సలు తీసుకోకూడదు.
వీటిని తీసుకోవడం వల్ల కొందరికి డయేరియా, మలబద్ధకం, గ్యాస్ సమస్య, రక్తం గడ్డకట్టడంలో సమస్యలు, ఎలర్జీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.
ఇవి కూడా చదవండి.
కమ్మని చాక్లెట్.. మీకు కళ్లు చెదిరే అందాన్ని కూడా అందిస్తుంది..!
బొప్పాయి మీకందించే.. బహుచక్కని ప్రయోజనాలేమిటో తెలుసా..?
నల్లా నల్లని ద్రాక్ష.. మీ అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందిలా..!