ఎప్పుడైనా హోటల్‌కి వెళితే చివర్లో బిల్‌తో పాటూ ఇచ్చే సోంపు గింజలంటే (Fennel Seeds) మనకు చాలా ఇష్టం. భోజనం పూర్తి చేసిన తర్వాత వెయిటర్.. వాటిని ఎప్పుడు తీసుకొస్తాడా అని చూస్తాం. కొందరైతే ఓ గుప్పెడు తీసుకొని టిష్యూ పేపర్లో పొట్లం కట్టి మరీ తీసుకెళుతుంటారు. అదో సరదా. ఇలా మీరు సరదాగా తినే సోంపు మీకు బోలెడంత మేలు చేస్తుంది.
సాధారణంగా భోజనం చేసిన తర్వాత ఈ సోంపు తినడం చాలామందికి ఉండే అలవాటు. అసలు దీని వల్ల ఏంటి ప్రయోజనం? ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.. ఎసిడిటీ రాకుండా ఉంటుంది. ఇది మనకు తెలిసింది మాత్రమే. కానీ సోంపు తినడం వల్ల మనకు సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు (beauty, health benefits) అందుతాయి. అవేంటో తెలుసుకోవడంతో పాటు.. సోంపు తినడం లేదా దాని కషాయం తాగడం మన దైనందిన జీవితంలో కూడా భాగం చేసుకొనే ప్రయత్నం చేద్దాం రండి..
సోంపులోని పోషక విలువలు (Nutritional Value Of Fennel Seeds)
భోజనం తర్వాత కాలక్షేపం కోసం తినే సోంపు గింజల్లో (fennel seeds) ఏముంటుంది? దీనిలో చాలానే పోషక పదార్థాలుంటాయి. విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాపర్, పాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, థయమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పీచుపదార్థంతో పాటు కొద్ది మొత్తంలో క్యాలరీలు సైతం లభిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సీకి నీటిలో కరిగే తత్వం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడటానికి ఈ తరహా విటమిన్ సి మనకు చాలా అవసరం.
మన శరీరంలో యాంటీ ఆక్సిడెంట్‌గా విటమిన్ సి పనిచేస్తుంది. అంటే అనారోగ్యానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను బయటకు పంపుతుంది. సోంపులో ఉండే మెగ్నీషియం మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. సోంపు ద్వారా మనకు అందే పొటాషియం, మాంగనీస్ సైతం ఎముకలు దృఢంగా మారేందుకు దోహదం చేస్తాయి. రోజూ ఒక చెంచాడు సోంపు తింటే చాలు.. దానిలో ఉండే ఆవశ్యక పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.
Shutterstock
చర్మ, కేశ సౌందర్యానికి సోంపు (Fennel Seeds Benefits In Telugu For Skin And Hair)
చర్మం, కేశ సంరక్షణ కోసం మనం ఎన్నో రకాల ఉత్పత్తులను ఉపయోగిస్తాం. అయితే ఇటీవలి కాలంలో సహజసిద్ధంగానే సౌందర్యాన్ని కాపాడుకోవాలనే ఆలోచన చాలామందిలో కనిపిస్తోంది. ఆ ఆలోచనతో సరిపెట్టుకోకుండా దాన్ని ఆచరణలోనూ చూపిస్తున్నారు.
సోంపు గింజలను ఉపయోగించి సైతం.. మన చర్మం అందంగా మారేలా చేసుకోవచ్చు. దీనిలో ఉన్న ఎన్నో పోషకాలు మనకు పోషణను అందించి చర్మ సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి. అలాగే స్కాల్ఫ్ సమస్యలను కూడా తగ్గించి జుట్టు ఒత్తుగా పెరిగేలా చేస్తాయి. ఈ ఫలితాన్ని పొందాలంటే మనం కొన్ని చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మొటిమలను తగ్గిస్తుంది (Reduces Acne)
సోంపు గింజల్లో యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తాయి. అంతేకాదు.. మొటిమలతో పాటు వచ్చే వాపు, నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఈ ఫలితం పొందడానికి సోంపు గింజల పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలిపి మొటిమలపై రాసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
సహజసిద్ధమైన ఫేసియల్ టోనర్ (Natural Facial Toner)
సోంపు గింజల్లో సహజసిద్ధమైన ఆస్ట్రింజెంట్ గుణాలుంటాయి. ఇవి చర్మరంధ్రాల్లో చేరిన మురికిని తొలగించి.. అవి తిరిగి తెరుచుకొనేలా చేస్తాయి. అంతేకాదు.. చర్మగ్రంథులు విడుదల చేసే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి. ఒక స్ప్రే బాటిల్లో సోంపు టీ వేసి దాన్ని ఫ్రిజ్‌లో ఉంచాలి. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం దీన్ని ముఖంపై స్ప్రే చేసుకోవడం ద్వారా చర్మంపై చేరిన మురికిని తొలగించుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా చర్మం చక్కగా టోనింగ్ అవడంతో పాటు సాగిపోకుండా ఉంటుంది.
వృద్ధాప్య ఛాయలు రాకుండా.. (Reduce Wrinkles)
సోంపులో లభించే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని ముడతలు పడేలా చేసే ప్రీ రాడికల్స్‌ను శరీరం నుంచి బయటకు పంపిస్తుంది. ఈ ఫ్రీరాడికల్స్ చర్మానికి ఆక్సిజన్ అందకుండా చేస్తాయి. దీని వల్ల చిన్నవయసులోనే చర్మం ముడతలు పడటంతో పాటుజజ గీతలు కూడా ఏర్పడతాయి. రోజుకొకసారి సోంపు నీటితో ముఖం కడుక్కొంటే క్రమంగా ముడతలు తగ్గుముఖం పడతాయి. గ్లాసు నీటిలో చెంచా సోంపు వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయానికి సోంపు నీరు తయారవుతుంది. దీన్ని ముఖం శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు.
క్లెన్సింగ్ చేసుకోవడానికి (Cleanser)
చర్మంపై ఉన్న మురికి, జిడ్డు, మృతకణాలు.. వీటన్నింటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకొన్నప్పుడే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. చర్మరంధ్రాల్లో చేరిన మురికిని సోంపు గింజలతో తయారుచేసిన ప్రత్యేకమైన మిశ్రమంతో తొలగించవచ్చు. దీనికోసం గిన్నెలో వేడి నీరు పోసి.. అందులో పెద్ద చెంచాడు సోంపు వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. చల్లారిన తర్వాత రెండు చుక్కల టీట్రీ ఎస్సెన్సియల్ ఆయిల్ సైతం కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి మూత గట్టిగా బిగించాలి. ఈ నీటిలో దూదిని ముంచి ..దానితో ముఖం తుడుచుకొంటే చర్మంపై చేరిన మురికి మొత్తం వదిలిపోతుంది.
చర్మాన్ని డీటాక్సిఫై చేసుకోవడానికి (Used To Detox Skin)
చర్మాన్ని పై నుంచి శుభ్రం చేసుకోవడంతో పాటు.. లోపలి నుంచి సైతం డీటాక్సిఫై చేసుకోవాల్సి ఉంటుంది. దీని కోసం ఫెన్నెల్ టీ (సోంపు టీ) తాగాలి. ఇది చర్మానికి హాని చేసే టాక్సిన్లు, ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తుంది. ప్రతిరోజూ పరగడుపున సోంపు టీ తాగుతూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
ఎక్స్ఫోలియేట్ చేసుకోవడానికి (To Exfoliate)
చర్మంపై ఉన్న మృతకణాలు తొలగించుకొన్నప్పుడే చర్మం అందంగా కనిపిస్తుంది. వాటిని తొలగించుకోవాలంటే చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేసుకోవాల్సిందే. దీని కోసం సోంపు ఉపయోగిస్తే మంచి ఫలితం పొందవచ్చు. సోంపు గింజలను మెత్తటి పొడిగా చేసుకోవాలి. చెంచా సోంపు పొడి తీసుకొని.. దానికి మరో చెంచా నీరు కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీంతో ముఖాన్ని స్క్రబ్ చేసుకోవడం ద్వారా చర్మంపై ఉన్న మృతకణాలు, మురికి తొలగించుకోవచ్చు. అయితే స్క్రబ్ చేసుకొన్నప్పుడు మునివేళ్లతో గుండ్రంగా రుద్దుకోవాలి.
సెల్యులైట్ తగ్గించుకోవడానికి (To Cut Down On Cellulite)
సోంపు గింజల్లో యాంటీ సెల్యులైట్ గుణాలుంటాయి. ఇవి చర్మకణాల్లో చేరిన కొవ్వును తొలగిస్తాయి. అంతేకాకుండా చర్మాన్ని ముడతలు పడకుండా చేసి, మృదువుగా మారుస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి సోంపును సరిపడినంత నీటితో కలిపి పేస్ట్ చేయాలి. దీన్ని ప్రభావిత ప్రాంతంలో అప్లై చేసుకోవాలి. ఇలా కొన్ని రోజులు చేస్తే ఆ ప్రాంతంలో కొవ్వు తగ్గడం మీరు గమనిస్తారు. సాధారణంగా సెల్యులైట్ ప్రభావం తొడల దగ్గర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అక్కడ ఈ చిట్కాను ప్రయత్నించి చూడండి. ఫలితం కనిపిస్తుంది.
చర్మం ప్రకాశవంతంగా (Skin Brightening=ng)
చర్మం ప్రకాశవంతంగా కనిపించడానికి సోంపు గింజల నీటితో ఆవిరి పట్టుకోవచ్చు. సోంపు గింజల్లో ఉన్న యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మాన్ని అందంగా మారుస్తాయి. లీటరు వేణ్నీళ్లలో టేబుల్ స్పూన్ సోంపు గింజలు వేయాలి. దళసరి టవల్ కప్పుకొని ముఖానికి ఐదు నిమిషాలు ఆవిరి పట్టుకోవాలి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటిస్తే మీ చర్మం ఛాయ మెరుగుపడుతుంది.
చర్మం ప్రకాశవంతంగా తయారవడానికి సోంపు ఫేస్ ప్యాక్ కూడా ప్రయత్నించవచ్చు. అరకప్పు వేడి నీటిలో టేబుల్ స్పూన్ సోంపు వేయాలి. అరగంట తర్వాత నీటిని వడపోసి సోంపు వేరు చేయాలి. ఆ నీటిలో టేబుల్ స్పూన్ ఓట్ మీల్, టేబుల్ స్పూన్ తేనె కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది.
వెంట్రుకల కుదుళ్ల దృఢత్వం కోసం.. (Stiffness Of Hair Follicle)
జుట్టు రాలడం.. ఈ సమస్య దాదాపుగా అందరినీ ఇబ్బంది పెడుతుందనే చెప్పుకోవాలి. దీనికోసం రకరకాల షాంపూలు, కండిషనర్లు, నూనెలు వాడుతుంటారు. వాటిని ఉపయోగిస్తే విసుగు వస్తుంది. కానీ ప్రయోజనం ఏమీ కనిపించదు. అయితే ఓ సారి సోంపును (fennel seeds) కూడా ప్రయత్నించి చూడండి. జుట్టు రాలడం ఆగిపోతుంది. దీని కోసం మూడు టేబుల్ స్పూన్ల సోంపును మెత్తటి పొడిగా దంచుకోవాలి. మూడు కప్పుల వేడి నీటిలో సోంపు పొడి వేసి పావుగంట ఆగి వడపోయాలి. తలస్నానం చేసేటప్పుడు చివరిలో ఈ నీటిని తలపై పోసుకొంటే సరిపోతుంది. వారానికి రెండు సార్లు ఇలా చేయడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
జుట్టు తెల్లగా మారకుండా ఆపుతుంది (Reduce Hair Whitening)
ప్రిమెచ్యూర్ గ్రేయింగ్.. అంటే చిన్న వయసులోనే జుట్టు తెల్లగా మారిపోవడం. తలకు డై వేసుకొని ఆ తెల్ల వెంట్రుకలను కప్పి ఉంచచ్చు. కానీ వాటిలో ఉండే రసాయనాల ప్రభావం మనపై పడదనే గ్యారంటీ లేదు. అందుకే సహజమైన పద్ధతులు అవలంబిస్తూ.. జుట్టు తెల్లబడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. సోంపు ఈ విషయంలో మనకు సాయపడుతుంది. దీనిలో క్యాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్ వంటి పోషకాలుంటాయి. ఇవి జుట్టు తెల్లబడకుండా చూస్తాయి. దీని కోసం ఏం చేయాలంటే.. క్రమం తప్పకుండా సోంపు టీ తాగడం లేదా కొద్దిగా సోంపు తింటే సరిపోతుంది.
స్కాల్ప్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది (Keeps Scalp Healthy)
స్కాల్ప్ పొడిగా ఉన్నా ఇబ్బందే. అలాగని జిడ్డుగా ఉన్నా ఇబ్బందే. మాడుపై పీహెచ్ విలువలో మార్పులు రావడం వల్ల ఇలా పొడిగా లేదా జిడ్డుగా మారిపోతుంది. సోంపు గింజలు ఉపయోగించి పీహెచ్ విలువను క్రమబద్ధీకరించుకోవచ్చు. దీని కోసం హెయిర్ ప్యాక్ వేసుకోవాల్సి ఉంటుంది. పెరుగులో సోంపు గింజల పొడి కలిపి మిశ్రమంగా చేసి తలకు అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది.
Shutterstock
ఆరోగ్యానికి సోంపు (Benefits Of Fennel Seeds For Health)
అప్పుడప్పుడూ మనం సరదాగా తినే సోంపు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అజీర్తి, గ్యాస్ నొప్పి.. ఇలా ఎన్నో రకాల సమస్యల నుంచి ఇది ఉపశమనాన్నిస్తుంది. ఎందుకంటే సోంపు గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్స్ ఉంటాయి. ఆయుర్వేదంలో సైతం సోంపుకి ప్రాధాన్యం ఉంది. త్రిదోషాలుగా పేర్కొనే వాత, పిత్త, కఫ దోషాలను సోంపు, సోంపు నుంచి తీసిన నూనెతో తగ్గించుకోవచ్చు. సోంపు తినడం, సోంపు టీ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తపోటు తగ్గిస్తుంది (Reduces Blood Pressure)
సోంపు గింజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. రక్తపోటును అదుపు చేయడంలో పొటాషియం కీలకంగా వ్యవహరిస్తుంది. అంతేకాదు.. సోంపు గింజలు నమలడం వల్ల లాలాజలంలో నైట్రైట్ శాతం పెరుగుతుంది. దీని వల్ల కూడా రక్తపోటు అదుపులో ఉంటుంది.
శరీరం నీరు పట్టకుండా (Hydrates The Body)
ప్రతి రోజూ సోంపు టీ తాగడం వల్ల శరీరంలో ఉన్న టాక్సిన్లు ఎప్పటికప్పుడు బయటకు వెళ్లిపోతాయి. దీనివల్ల శరీరం నీరు పట్టకుండా ఉంటుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి.
జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా.. (Improves Digestion)
జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలకు సోంపు చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. ముఖ్యంగా అజీర్తి, ఎసిడిటీ, పొట్ట పట్టినట్టుగా ఉండటం.. ఇలాంటి సమస్యలకు సోంపు తినడం లేదా సోంపు నీరు తాగడం ద్వారా చక్కటి ఉపశమనం దొరుకుతుంది. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్(ఐబీఎస్) సమస్యతో బాధపడేవారు సోంపు టీ తాగడంతో.. జీర్ణవ్యవస్థకు సంబంధించిన ఎంజైమ్‌లు విడుదలవడంతో పాటు.. గ్యాస్ట్రో ఇంటస్టైనల్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకొనేవారికి సైతం సోంపు గింజలు మేలు చేస్తాయి.
ఆస్తమా తగ్గుతుంది (Reduce Asthma)
సోంపులో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్ సైనస్‌ను తగ్గిస్తాయి. అంటే ఆస్తమా తీవ్రత కూడా తగ్గుతుంది. అలాగే ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలైన బ్రాంకైటిస్, ఊపిరి తీసుకోలేకపోవడం, దగ్గు.. లాంటి సమస్యలు సైతం తగ్గుముఖం పడతాయి. అయితే ఆస్తమా సమస్యతో ఉన్నవారు ఈ విషయంలో సొంత నిర్ణయం తీసుకోకుండా వైద్యులను సంప్రదించి ఆ తర్వాత సోంపు ఉపయోగించడం మంచిది. ఎందుకంటే.. కొంతమందిలో సోంపు ఉపయోగించడం వల్ల ఆస్తమా లక్షణాలు పెరిగే అవకాశం ఉంది.
రక్తాన్ని శుద్ధి చేస్తుంది (Cleans The Blood)
సోంపులో యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థం ఉంటాయి. ఇవి రక్తంలోని టాక్సిన్లను, ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపిస్తాయి. అంటే ఇది రక్తాన్ని క్లెన్స్ చేస్తుంది. మనం తిన్న ఆహారం శరీరానికి బాగా పడుతుంది. ఫలితంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. కాబట్టి శరీరం నుంచి టాక్సిన్లను బయటకు పంపించే ఆహారాన్ని ప్రతి రోజూ తినడం మంచిది.
కంటి చూపు మెరుగుపడుతుంది (Improves Eyesight)
కంటి చూపు మెరుగ్గా ఉండాలంటే విటమిన్ ఎ చాలా అవసరం. సోంపు గింజల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. సోంపు గింజలు తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మీకో విషయం తెలుసా? కంటి చూపుకి సంబంధించిన సమస్యలకు చికిత్స అందించడానికి ఆయుర్వేదంలో సోంపును ఉపయోగిస్తారు.
రొమ్ముల పరిమాణం పెరగడానికి (Increase Size Of Breast)
సోంపు గింజల్లో ఉండే యానెథోల్ మానవ శరీరంలో ఈస్ట్రోజెన్ మాదిరిగా ప్రవర్తిస్తుంది. ఈస్ట్రోజెన్ రొమ్ముల పరిమాణం పెరగడానికి దోహదపడుతుంది. అలాగే సోంపులో ఉండే ఫ్లేవనాయిడ్స్ సైతం ఈస్ట్రోజెన్ హార్మోన్ విడుదలయ్యేలా చేస్తాయి. ఇవి రెండూ కలిసి రొమ్ములు పరిమాణం పెరగడానికి దోహదం చేస్తాయి. ప్రతిరోజు మెంతులు, సోంపు రెండింటినీ కలిపి తీసుకొంటే.. రొమ్ముల పరిమాణం క్రమంగా పెరుగుతుంది. అయితే ఈ మార్పు వెంటనే కనిపించదు. ప్రభావం కనిపించడానికి ఆరు నెలల నుంచి ఏడాది వరకు సమయం పడుతుంది.
క్యాన్సర్‌ను దూరంగా చేస్తుంది (Rich In Anti-Cancer Properties)
సోంపులో యానెథోల్ ఉంటుంది. దీనికి క్యాన్సర్‌తో పోరాడే గుణాలున్నట్లు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ కణాలపై టెస్ట్ ట్యూట్ లో జరిపిన పరిశోధన ప్రకారం యానెథోల్ బ్రెస్ట్ క్యాన్సర్ కణాలను తగ్గించినట్టు గుర్తించారు. మరో అధ్యయనంలో సైతం సోంపు రొమ్ము క్యాన్సర్ కలిగించే కణాలను సంహరించినట్లు గుర్తించారు. రొమ్ము క్యాన్సర్ మాత్రమే కాదు.. చర్మ, జీర్ణ సంబంధమైన క్యాన్సర్లను తగ్గిస్తుంది. ఆయుర్వేదంలో సైతం సోంపు క్యాన్సర్‌ను తగ్గిస్తుందనే ప్రస్తావన ఉంది.
నెలసరి ఇబ్బందులకు చెక్ (Reduce Pain During Periods)
పీరియడ్స్ సమయంలో మహిళందరికీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. కొందరికి కడుపు నొప్పి.. మరికొందరికి నడుం నొప్పి.. ఇంకొందరికి అధిక రక్తస్రావం.. ఇలా ఒక్కొక్కరిలోనూ ఒక్కో రకమైన సమస్య ఉంటుంది. వీటి నుంచి ఉపశమనం పొందడానికి ఎన్నో చిట్కాలను పాటిస్తుంటారు. ఈ సారి పీరియడ్స్ వచ్చినప్పుడు సోంపు నీరు తాగండి. ఇది అధిక రక్తస్రావాన్ని, నొప్పిని తగ్గిస్తుంది. పీరియడ్స్ సమయంలో సోంపు గింజలు తిన్నా ఇదే ఫలితం కనిపిస్తుంది.
పీఎంఎస్ తగ్గిస్తుంది (Reduce The Effect Of PMS)
పీరియడ్స్ రావడానికంటే ముందే.. మనల్ని పీఎంఎస్ పలకరిస్తుంది. ఈ సమయంలో కోపంగా, చిరాగ్గా, అసహనంగా కనిపిస్తారు మహిళలు. దీనికి హార్మోన్ల ప్రభావమే కారణం. సోంపులో ఫైటో ఈస్ట్రోజెన్ ఉంటుంది. ఇది హార్మోన్ల విడుదలను క్రమబద్ధీకరిస్తుంది. కాబట్టి పీఎంస్ ప్రభావం తగ్గుతుంది. ఈ ఫలితాన్ని పొందడానికి సోంపు టీ తాగాల్సి ఉంటుంది.
మెనోపాజ్ సమస్యలకు పరిష్కారం (Solution To Menopause Problem)
మెనోపాజ్ దశలోకి ప్రవేశించిన తర్వాత.. మహిళల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా వెజీనా దురదగా అనిపించడం, కలయిక సమయంలో నొప్పి, మంట, నిద్ర సరిగా పట్టకపోవడం, శరీరం వేడిగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటన్నింటికీ కారణం.. వయసు మీరిన తర్వాత హార్మోన్లలో ఏర్పడే అసమతౌల్యతే. సోంపులో ఉండే ఫైటోఈస్ట్రోజెన్, ఫ్లేవనాయిడ్స్ ఈ సమస్యను తగ్గిస్తాయి. కాబట్టి ప్రతి రోజూ సోంపు తినడం లేదా సోంపు టీ తాగడం వల్ల మెనోపాజ్ సమస్యలను తగ్గించుకోవచ్చు.
పాలిచ్చే తల్లులకు ప్రయోజనం (Helpful For Breast Feeding Mothers)
సోంపులోని యానెథోల్ ఫైటో ఈస్ట్రోజెన్ మాదిరిగా పనిచేస్తుందని మనకు తెలుసు. పాలు విడుదలవ్వడానికి ఈ ఫైటో ఈస్ట్రోజెన్ చాలా అవసరం. అందుకే పాలు బాగా రావడానికి.. కాస్త సోంపు తినమని బాలింతలకు మన పెద్దలు చెబుతుంటారు. అయితే ఈ విషయంలో పాలిచ్చే తల్లులు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. సోంపు చాలా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఎక్కువ తింటే ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిరావచ్చు.
నోటి దుర్వాసన తగ్గిస్తుంది (Reduce Oral Odour)
నోటి దుర్వాసన సమస్యకు చెక్ పెట్టే మౌత్ ఫ్రెషనర్‌గా సోంపు పనిచేస్తుంది. దీనిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ శ్వాసను ఫ్రెష్‌గా మారుస్తాయి. కొన్ని సోంపు గింజలను నమలడం ద్వారా నోటి దుర్వాసన సమస్యను దూరం చేసుకోవచ్చు. దీనిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటి దుర్వాసను కలిగించే బ్యాక్టీరియాను సంహరిస్తాయి.
Shutterstock
వంటల్లో సోంపును ఎలా చేర్చుకోవాలంటే..(Tips To Add Fennel Seeds In Recipes)
ప్రపంచవ్యాప్తంగా సోంపును వినియోగిస్తుంటారు. వంటకాలకు ప్రత్యేకమైన ఫ్లేవర్ రావడానికి కూడా సోంపు వాడతారు. శాఖాహారం, మాంసాహారం, స్వీట్స్, జ్యూసులు ఇలా దాదాపుగా అన్ని రకాల ఆహారపదార్థాల తయారీలోనూ దీనిని ఉపయోగించవచ్చు. సాధారణంగా టీ, బ్రెడ్, స్వీట్ పేస్ట్రీల తయారీలో వినియోగిస్తారు.
- వెజిటబుల్ సలాడ్ చేసుకున్నప్పుడు.. ఉప్పు, మిరియాల పొడి చల్లుకొని తినడం చాలామందికి ఉండే అలవాటు. వీటితో పాటు సోంపు పొడిని కూడా చల్లుకొని తినచ్చు.
- బ్రెడ్, బిస్కెట్ తయారు చేసేటప్పుడు.. కొన్ని సోంపు గింజలను పిండిలో కలుపుకోవచ్చు. ఇది బిస్కెట్లకు ప్రత్యేకమైన రుచి, ఫ్లేవర్‌ని అందిస్తుంది.
- మాంసం, చేపలు మారినేట్ చేసేటప్పుడు కొద్దిగా సోంపు గింజల పొడి కలిపితే రుచిగా ఉంటుంది.
- సాస్ తయారీలోనూ సోంపుని వాడవచ్చు.
- రోజూ వండుకొనే కూరల్లోనూ కొద్దిగా సోంపు గింజలు లేదా సోంపు పొడి కలపొచ్చు.
- పాస్తా పై కొద్దిగా సోంపు పొడి చల్లుకొని తింటే టేస్ట్ బాగుంటుంది.
సోంపు టీ (Fennel Tea) ఎలా తయారుచేయాలంటే.. (How To Make Fennel Tea)
సోంపు టీ( Fennel Tea) తయారు చేయడం చాలా సులభం.
- గిన్నెలో కప్పు నీరు వేసి బాగా మరగనివ్వాలి.
- నీరు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చెంచా సోంపు గింజలు వేసి మూత పెట్టాలి.
- పది నిమిషాల తర్వాత కప్పులోకి ఈ నీటిని వడపోస్తే ఫెన్నెల్ టీ రెడీ.
రోజుకు రెండు సార్లు ఈ టీ తాగొచ్చు. అయితే ఈ టీని తయారు చేసేటప్పుడు చిన్న జాగ్రత్త పాటించాలి. వేడినీటిలో సోంపు గింజలు వేయాలి. నీటిలో సోంపు గింజలు వేసి వేడి చేయకూడదు. ఇలా చేస్తే దానిలో ఉన్న పోషక విలువలు నశించిపోతాయి.
సోంపు వాటర్ లేదా సోంపు నీరు ఎలా తయారు చేసుకోవాలి? (How To Take Fennel Seeds With Water)
కప్పు నీటిలో చెంచా సోంపు గింజలు వేసి ఒక రాత్రంతా అలా ఉంచితే.. మరుసటి రోజు ఉదయానికి సోంపు నీరు తయారవుతుంది. ప్రతి రోజూ ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ నీటిని సౌందర్యపరమైన చిట్కాలు పాటించడానికి కూడా ఉపయోగించవచ్చు.
Shutterstock
సోంపు గింజల వల్ల ఎదురయ్యే దుష్పలితాలు ( Side effects Of Fennel Seeds)
సోంపు గింజల వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. వాటిని అతిగా ఉపయోగించడం వల్ల అంతకంటే ఎక్కువ దుష్ప్రభావాలు సైతం ఎదుర్కోవాల్సి వస్తుంది.
- సోంపు గింజలను ఎక్కువగా తినడం వల్ల చర్మం సున్నితంగా మారిపోతుంది. ముఖ్యంగా ఎండలోకి వెళ్లినప్పుడు సూర్యరశ్మి ప్రభావాన్ని తట్టుకోలేదు. చర్మం కమిలిపోవడం, ఎర్రటి పొక్కులు వస్తాయి.
- కొన్ని రకాల మందులు తీసుకొంటున్నప్పుడు సోంపుకు దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే సోంపులో ఉన్న మూలకాలు వాటితో చర్య జరపడం వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా మూర్ఛరోగంతో బాధపడుతున్నవారు దీనికి దూరంగా ఉండటం మంచిది.
- సోంపు గింజలు చర్మానికి ఎంత మేలు చేస్తాయో.. అంతే హాని కలిగించే అవకాశమూ లేకపోలేదు. సోంపు వల్ల చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చర్మం మంటగా అనిపించడం, పొక్కులు రావడం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
- సోంపు కొంతమందిలో ఎలర్జీలను కలిగిస్తుంది. కాబట్టి ఎలర్జీలతో ఇబ్బంది పడేవారు సోంపుకు దూరంగా ఉండాలి. సోంపు తినడం లేదా సోంపు టీ తాగడం వల్ల కడుపు నొప్పి, తలతిరగడం లాంటి సమస్యలు ఎదురవుతాయి.
- సోంపు ఉపయోగించడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుముఖం పడుతుందని మనం ముందుగానే చెప్పుకొన్నాం. కానీ కొన్ని పరిస్థితుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి సోంపు కారణమవుతుంది. ఎందుకంటే సోంపులో ఫైటో ఈస్ట్రోజెన్, ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. వీటి వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ ఉత్పత్తి ఎక్కువ అవుతుంది. రొమ్ము క్యాన్సర్ రావడానికి ఈస్ట్రోజెన్ పెరగడమూ కారణమే. కాబట్టి సోంపు ఉపయోగించే విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. రొమ్ము క్యాన్సర్ గురించి మొత్తం సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- గర్భిణిలు సోంపు తినకూడదు. దీనివల్ల గర్భస్రావం జరిగే అవకాశం ఉంటుంది.
- జంతువుల్లో జరిపిన పరిశోధనల్లో సోంపు నూనె వల్ల కణితులు ఏర్పడటం గమనించారు.
ఇవీ సోంపు గింజల వల్ల ్ల కలిగే దుష్ఫ్రభావాలు. కాబట్టి మీరు సోంపు గింజలను మీ ఆరోగ్యం మెరుగు పడటానికి ఉపయోగించాలని భావిస్తే.. ముందుగా ఆయుర్వేద వైద్య నిపుణులను సంప్రదించి, వారి సూచనలకు అనుగుణంగా నడుచుకోవడం మంచిది.
Shutterstock
తరచూ అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)
సోంపు ఎక్కువగా తినడం వల్ల.. అనారోగ్యం ఎదుర్కోవాల్సి వస్తుందా?
అతి ఎప్పుడూ అనర్థమే చేస్తుందని మన పెద్దలంటారు కదా. అదే విషయం సోంపుకి సైతం వర్తిస్తుంది. మితంగా సోంపు తినడం వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో.. ఎక్కువగా తినడం వల్ల అంతకంటే ఎక్కువ దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్మ సంబంధిత అలర్జీలు, క్యాన్సర్లు, శరీరంలో కణితులు వచ్చే అవకాశం ఉంది. అందుకే సోంపు చాలా తక్కువ మొత్తంలో తినాల్సి ఉంటుంది. రెండు టీస్పూన్లకు మించకుండా సోంపు తినడం వల్ల ప్రయోజనాలు పొందవచ్చు.
ప్రతి రోజూ సోంపు టీ తాగడం ఆరోగ్యానికి మంచిదేనా?
సోంపు టీ తాగడం వల్ల ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలే అందుతాయి. చర్మం, కురులు ఆరోగ్యంగా తయారవుతాయి. శరీరంలోని టాక్సిన్లు బయటకు పోతాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కానీ రోజుకి ఎంత మొత్తంలో .. మీరు టీ తాగుతున్నారనే దానిపై ఈ ప్రభావం ఆధారపడి ఉంటుంది. రోజుకి రెండు సార్లు సోంపు టీ తాగడానికి పరిమితమైతే మెరుగైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అయినప్పటికీ ఆయుర్వేద వైద్యులను సంప్రదించిన తర్వాతే సోంపు టీ తాగడం ప్రారంభించడం మంచిది.
సోంపు వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ లేదా ఇతర క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉందా?
పైన మనం చర్చించుకొన్నదాని ప్రకారం.. టెస్ట్ ట్యూబ్‌లో క్యాన్సర్ కణాలు, జంతువులపై జరిగిన పరిశోధనల్లో సోంపు నుంచి తీసిన ఎక్స్ట్రాక్ట్స్ క్యాన్సర్ కణాలను సంహరించాయని తేలింది. అయితే మనుషుల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అలాగే కొన్నిసార్లు బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి సోంపు కారణం అవ్వచ్చు. ఎందుకంటే దీన్ని ఎక్కువగా తినడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువగా విడుదలవ్వచ్చు. క్యాన్సర్ రావడానికి ఇది కూడా కారణమే.. కాబట్టి సోంపు ఎక్కువగా తినకూడదు.
గర్భవతులు, పాలిచ్చే తల్లులు సోంపు తినవచ్చా?
గర్భవతులు వీలైనంత వరకు సోంపుకి దూరంగా ఉండటమే మంచిది. సోంపు అధికంగా తినడం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఉంది. సాధారణంగా పాలు పట్టడానికి బాలింతలకు సోంపు తినమని సూచిస్తుంటారు. సోంపు తినడం లేదా సోంపు టీ తాగడం వల్ల పాలు బాగా వస్తాయి. అలాగని ఎక్కువగా తాగినా ఇబ్బందే. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యం దెబ్బతినే అవకాశమూ లేకపోలేదు. అందుకే సోంపు తినడం లేదా సోంపు టీ తాగడం ప్రారంభించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముందు రోజులో ఒక్కసారి సోంపు టీ తాగడం మొదలుపెట్టాలి. ఎలాంటి ప్రభావం కనిపించకపోతే.. దాన్ని కొనసాగించవచ్చు. తొలుత కొన్ని రోజుల పాటు ఒక పూట తాగి ఆ తర్వాత రెండు పూటలూ సోంపు టీ తాగొచ్చు.
నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను.. సోంపు తగ్గిస్తుందా?
కచ్చితంగా తగ్గిస్తుంది. సోంపు టీ తాగడం, సోంపు గింజలు తినడం ద్వారా పీరియడ్స్ సమయంలో తలెత్తే ఇబ్బందులు తగ్గుతాయి. అలాగే హార్మోన్ల అసమతౌల్యత కారణంగా వచ్చే పీఎంఎస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఆ సమయంలో కాస్త సోంపు టీ తాగడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
Featured Image:
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.