ఢిల్లీలో స్వచ్ఛమైన 'గాలి' పీల్చుకోవాలంటే... ఈ 'ఆక్సిజన్ బార్'కి వెళ్లాల్సిందే ..!

ఢిల్లీలో స్వచ్ఛమైన 'గాలి' పీల్చుకోవాలంటే... ఈ 'ఆక్సిజన్ బార్'కి వెళ్లాల్సిందే ..!

A Bar In Delhi Is Selling 15 Mins Of Pure Oxygen (Fresh Air) For Rs. 300 to Citizens

గత నెలరోజులుగా మన దేశ రాజధాని ఢిల్లీ నగరాన్ని కాలుష్యం కమ్మేసిందనే చెప్పాలి. అయితే దీనికి రకరకాల కారణాలున్నాయి. ఈ విపత్తు నుండి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్నామని ఇప్పటికే ప్రకటించింది. అలాగే కాలుష్య నియంత్రణ మండలి కూడా పలు హెచ్చరికలు జారీ చేసింది. 

మధుమేహం అంటే ఎందుకు భయం..? ఈ సలహాలు మీకోసమే ..!

ఈ హెచ్చరికలలో భాగంగానే ప్రజలను మాస్కులు ధరించకుండా బయటకి రావద్దని చెబుతున్నారు. అలాగే బహిరంగ ప్రదేశాలలో ఎటువంటి పదార్ధాలను కాల్చకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు ఢిల్లీ ప్రజలు స్వచ్ఛమైన గాలి కోసం తహతహలాడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన కొందరు.. అదే స్వచ్ఛమైన గాలిని విక్రయించే కేంద్రానికి శ్రీకారం చుట్టడం గమనార్హం. 

ఈ క్రమంలో ఇప్పుడు యావత్ దేశ ప్రజల దృష్టి సైతం.. ఈ కృతిమ ఆక్సిజన్ అందించే కేంద్రం పైనే పడింది.  ఆ వివరాల్లోకి వెళితే, ఆర్యవీర్ కుమార్ అనే ఢిల్లీ వాసి.. ప్రస్తుతం ఆ ప్రాంత ప్రజలు ఎంతగానో తపిస్తున్న స్వచ్ఛమైన గాలి కోసం ఏదైనా ఒకటి చేయాలని సంకల్పించారు. ఆ సంకల్పం నుండి పుట్టిన ఆలోచనే ఈ 'ఆక్సీప్యూర్ ఆక్సిజన్ బార్' (Oxypure Oxygen bar).

ఈ 'ఆక్సీప్యూర్ బార్'లో స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవాలంటే.. పదిహేను నిమిషాలకి రూ. 299/- చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనం పీల్చుకునే గాలిలో కూడా.. రకరకాల ఫ్లేవర్స్‌ను అందిస్తుండడం కొసమెరుపు.  పుదీన, దాల్చిన చెక్క, లెమన్ గ్రాస్ సువాసనలతో ఆ గాలిని పీల్చుకొనే సౌలభ్యం కూడా ఉందట.  సాకేత్ ప్రాంతంలోని సెలెక్ట్ సిటీవాక్ మాల్‌లో ఈ అధునాతన బార్‌ని ఏర్పాటు చేశారు నిర్వాహకులు. 

ఇక ఈ ఆక్సిజన్‌ను ఫ్లేవర్స్‌లో అందించడం కోసం - ముందుగానే సిద్ధం చేసిన ఆక్సిజన్ సిలండర్స్‌ను.. రకరకాల ఫ్లేవర్స్‌తో నిండిన గ్లాస్ ఛాంబర్స్‌లోకి పంపించడం గమనార్హం. దీంతో గాలి పీల్చుకునే వారు.. ఆయా ఫ్లేవర్‌ని ఫీల్ అవ్వగలుగుతారు. ఈ ఆక్సిఫూర్ బార్ గురించి తెలియడంతో.. ప్రస్తుతం  ఢిల్లీ ప్రజలు ఈ బార్‌కి క్యూ కడుతున్నారట. అయితే ధరలను బట్టి ఈ బార్ పలు వర్గాల వారికి మాత్రమే పరిమితమయ్యే అవకాశముందని విమర్శలు వస్తున్నాయి. 

శీతాకాలం స్పెషల్ వంటకం.. సీతాఫల్ ఖీర్ తయారీ మీకు తెలుసా?

ఏదేమైనా.. ఈ కృతిమ పరికరాల ద్వారా ఆక్సిజన్ తీసుకోవడం వల్ల.. పలు ఉపయోగాలున్నాయని అంటున్నారు నిర్వాహకులు. అప్పుడప్పుడైనా ఇలాంటి  చక్కటి గాలిని పీల్చుకోవడం వల్ల.. శరీరం యాక్టివ్‌గా ఉండడంతో పాటు.. మానసిక ఒత్తిడి కూడా తగ్గే అవకాశాలు ఉంటాయట. అలాగే మంచి నిద్రకు ఇది ఔషధంలా కూడా పనిచేస్తుంది. 

ఈ ఆక్సిఫూర్ బార్ అనుభవం ఎలా ఉందనే విషయంపై కూడా భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  ప్రస్తుతం ఢిల్లీలోని వాతావరణం దృష్ట్యా.. అసలు పీల్చుకోవడానికి కూడా పరిశుద్ధమైన గాలి లేని తరుణంలో.. ఇటువంటి ఒక ఆక్సిఫూర్ బార్ ఆ కొరతని కొంతవరకు తీర్చిందనే అంటున్నారు. 

ఇంకొంతమందైతే... ప్రభుత్వమే ఇటువంటి బార్లని నిర్వహిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇటువంటి పనిని ప్రభుత్వమే చేపడితే.. ఎక్కువమంది ప్రజలు ఈ సౌలభ్యాన్ని పొందుతారని అభిప్రాయపడుతున్నారు.

ఏదేమైనా.. మన పంచభూతాలలో ఒకటైన గాలి రోజు రోజుకీ కలుషితమవుతున్న తరుణంలో.. ఇటువంటి ఆక్సిఫూర్ బార్లు కొంత ఉపశమనం కలిగించినప్పటికి... రాబోయే కాలంలో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే మంచిదని పలు స్వచ్ఛంద సంస్థలు అభిప్రాయపడడం గమనార్హం. 

హైదరబాదీ స్పెషల్ వంటకం.. 'కిచిడి - ఖీమా' తయారీ విధానం మీకోసం ..!