12 రోజుల్లో కన్నడ పై పట్టు సాధించి.. అనర్గళంగా ప్రసంగించిన ధీశాలి సుష్మా స్వరాజ్

12 రోజుల్లో కన్నడ పై పట్టు సాధించి..  అనర్గళంగా ప్రసంగించిన ధీశాలి సుష్మా స్వరాజ్

సుష్మా స్వరాజ్ (Sushma Swaraj) - భారతదేశ రాజకీయాల పట్ల చిటికెడు అవగాహన ఉన్నా సరే.. ఈ పేరు కచ్చితంగా వినే ఉంటారు. అయితే 2014 - 2019 మధ్య కాలంలో  కేంద్ర విదేశాంగ మంత్రిగా ఆమె పోషించిన పాత్ర, ఆ  పదవి ద్వారా విదేశాల్లో చిక్కుకున్న ఎందరో అభాగ్యులను భారతదేశానికి రప్పించడంలో ఆమె చూపిన తెగువను బట్టి... సుష్మాజీని సామాన్య ప్రజానీకం ఎప్పటికీ మరువదు అని చెప్పచ్చు.

ముస్లిం మహిళలకు మేలు చేసే.. ట్రిపుల్ తలాక్ బిల్లు గురించి తెలుసుకోవాల్సిన విషయాలివే..!

దిల్లీలోని ఎయిమ్స్‌లో నిన్న సుష్మా స్వరాజ్ (67) తుదిశ్వాస విడిచారు. ఆమెకు రాజకీయాలన్నా, ప్రజా సంబంధాలన్నా ఎంతో మక్కువ. ఆమె మరణించడానికి సరిగ్గా 4 గంటల ముందు ట్విట్టర్‌, వేదికగా ఆమె చేసిన ట్వీట్ ఇందుకు నిదర్శనం. నిన్న పార్లమెంట్‌లో జమ్మూ- కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370ని తొలగించడం వంటి పరిణామాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు అభినందనలు తెలుపుతూ ఆమె ట్వీట్ చేశారు.

‘‘నా జీవితంలో ఈ రోజు కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నాను..’’ అన్నది దాని సారాంశం. ఆమె ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉన్నా.. దేశంలో జరుగుతున్న అంశాలను సునిశితంగా పరిశీలించడం, వాటి పట్ల ఆమె స్పందనను సామాజిక మాధ్యమాల ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేయడం.. వంటివి చేస్తూనే ఉండేవారు. ఈ ఒక్క ఉదాహరణ చాలదు.. ఆమెకు దేశ ప్రస్తుత పరిస్థితులు, రాజకీయాలంటే ఎంత ఆసక్తో చెప్పడానికి..

ఇక ఆమె వ్యక్తిగత జీవితానికొస్తే; తన సహాధ్యాయి స్వరాజ్ కౌశల్‌ని 1975లో వివాహమాడారు సుష్మ. ఆయన సుప్రీమ్ కోర్టులో న్యాయవాదిగా పనిచేయడంతో పాటు 37 ఏళ్ళకే మిజోరామ్ రాష్ట్రానికి గవర్నర్‌గా పనిచేసి రికార్డు సృష్టించారు. వీరిరువురికీ బన్సురి స్వరాజ్ అనే కూతురు ఉంది. ఆమె కూడా తల్లిదండ్రుల మాదిరిగానే.. న్యాయశాస్త్రంలో పట్టభద్రురాలై.. ప్రస్తుతం న్యాయవాదిగా కొనసాగుతున్నారు.

25 ఏళ్ళకే రాష్ట్రమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన సుష్మా స్వరాజ్ జీవితంలో జరిగిన కొన్ని కీలక ఘట్టాలు మీకోసం..

* రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పదవి చేపట్టిన పిన్న వయస్కురాలిగా (25 సంవత్సరాలు) సుష్మా స్వరాజ్ రికార్డు నమోదు చేశారు.

* దిల్లీకి తొలి మహిళా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

* భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండవ మహిళగా రికార్డు సాధించారు.

*విదేశాంగ మంత్రిత్వ శాఖలో ట్విట్టర్‌ని ఉపయోగించి.. విదేశాల్లో చిక్కుకున్న ఎందరో భారతీయుల్ని త్వరితగతిన మన దేశానికి తీసుకురావడంలో ఆమె కృషి మరువలేనిది.

* ప్రజలు చాలా సులువుగా తనను చేరగలిగేలా; వారి ప్రతిపాదనలకు చాలా వేగంగా స్పందించే మంత్రిగా సుష్మా స్వరాజ్ పేరు సంపాదించుకున్నారు.

* 2009 నుంచి 2014 వరకు లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా.. పూర్తి సమయం ఉన్న తొలి మహిళ సుష్మా స్వరాజ్ కావడం విశేషం.

* ఐక్యరాజ్య సమితిలో భారత విదేశాంగ మంత్రిగా హిందీలో ప్రసంగించి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.

* సోనియా గాంధీ ప్రధాని పదవి చేపడితే.. తాను తెల్ల చీర ధరించి పార్లమెంట్‌కి వస్తాను అని ప్రకటించి సంచలనం సృష్టించారు.

* అలాగే 1999 సార్వత్రిక ఎన్నికల్లో కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుంచి సోనియా గాంధీ పైన పోటీ చేసే సందర్భంలో... కన్నడ భాషని కేవలం 12 రోజుల్లో నేర్చుకుని, బహిరంగ సభలో 5 నిమిషాల పాటు అనర్గళంగా కన్నడ భాషలో ప్రసంగించి అందరి చేత ఔరా అనిపించుకున్నారు. ఈ సంఘటన ఆమెలోని పట్టుదలకు అద్దం పడుతుంది.

* పార్లమెంట్ ఉభయ సభల్లో అత్యంత వాగ్ధాటితో మాట్లాడగలిగే నాయకుల్లో ఆమె ఒకరు అని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆమె పార్లమెంట్‌లో మాట్లాడే సమయంలో అవతలి పక్షాన్ని డిఫెన్స్‌లోకి నెట్టేయగలిగే సత్తా ఉన్న నాయకురాలు. ఇది పార్టీలకతీతంగా నాయకులంతా ఒప్పుకునే విషయం.

డాక్టర్. ముత్తులక్ష్మీ రెడ్డి ఎవరు..? ప్రతీ మహిళ ఆమె గురించి ఎందుకు తెలుసుకోవాలంటే?

సుష్మా స్వరాజ్‌కి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఎక్కువే. ఇందుకు ఓ చిన్న ఉదాహరణ మీకోసం -

ఒకసారి ట్విట్టర్‌లో ఆమెకి ఒక వ్యక్తి - "నేను మార్స్ ప్లానెట్ పైన చిక్కుకున్నాను" అని ట్వీట్ చేయగానే.. వెంటనే దానికి స్పందిస్తూ - ఏం ఫర్వాలేదు! నువ్వు మార్స్ గ్రహం పైన ఉన్నా ... అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీ నిన్ను రక్షిస్తుంది" అని సమాధానం ఇచ్చారు. దీనితో ఆమెకి ఉన్న 'సెన్స్ ఆఫ్ హ్యూమర్'కి సదరు వ్యక్తి షాక్ అయ్యాడు.

భారత రాజకీయాల్లో ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని, చరిత్ర పుటల్లో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్న సుష్మా స్వరాజ్... మహిళలకు ఎంతో స్ఫూర్తి అని చెప్పాలి.

రాజకీయాల ద్వారా ఎన్నో ఉన్నత విలువలను మనకి వదిలిపెట్టి ఈ లోకాన్ని విడిచిన సుష్మా స్వరాజ్ ఆత్మకు శాంతి కలగాలని మనమంతా మనసారా కోరుకుందాం..

జీవితం విలువను తెలియజేసే ఈ 75 లైఫ్ కొటేషన్స్ .. మీలో స్ఫూర్తిని కలిగిస్తాయి..!