నిజ జీవితంలో ప్రీతిలా అస్సలు వ్యవహరించను.. ప్రతిఘటిస్తా : కియారా అద్వానీ

నిజ జీవితంలో ప్రీతిలా అస్సలు వ్యవహరించను.. ప్రతిఘటిస్తా : కియారా అద్వానీ

కియారా అద్వానీ (Kiara Advani).. తెలుగులో భరత్ అనే నేను సినిమాతో సక్సెస్ సాధించి.. వినయ విధేయ రాముడి సీతగా అందరి మనసులను దోచుకున్న భామ. తెలుగులో ఈ రెండు సినిమాలకు ముందే హిందీలో ఫగ్లీ, ఎం.ఎస్ ధోనీ వంటి చిత్రాలతో అభిమానులను ఆకట్టుకుంది.

అయితే ఈ సినిమాలన్నింటితో ఆమెకు వచ్చిన క్రెడిట్ ఒకెత్తయితే.. కబీర్ సింగ్ చిత్రంలో (kabir singh)  ఈ అమ్మడికి వచ్చిన క్రేజ్ మాత్రం చాలా ఎక్కువ. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించినా.. అందులో కియారా నటించిన ప్రీతి పాత్ర మాత్రం.. చాలామంది నుంచి విమర్శలే అందుకుంది. సినిమా మొత్తం కబీర్ సింగ్ ఏం చేసినా.. తనని కొట్టినా, తిట్టినా.. సైలెంట్‌గా ఉండిపోయే పాత్రను చేసిన ఆమె సైతం చాలా విమర్శలను మూటగట్టుకుంది.

Instagram

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భాగంగా.. తన సినిమాల గురించే కాదు.. ప్రేమ, పెళ్లి.. జీవితం గురించి కూడా కియారా మాట్లాడింది. ముఖ్యంగా సిద్ధార్థ మల్హోత్రాతో ప్రేమలో ఉందనే పుకార్లను ఖండిస్తూ తాను సిద్ధార్థ్ మల్హోత్రాని మాత్రమే కాదు.. ఎవరినీ ప్రేమించడం లేదని చెప్పుకొచ్చింది కియారా. అయితే ప్రస్తుతానికి సింగిల్‌గానే ఉన్నా.. ఎప్పటికైనా ప్రేమించే పెళ్లి చేసుకుంటానని చెప్పింది కియారా. "పెళ్లిపై నాకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే ఆశ కూడా ఉంది. ఎప్పటికైనా నాకు నచ్చిన వ్యక్తి దొరికితే ప్రేమించే పెళ్లి చేసుకుంటాను"అని ఆమె చెప్పడం గమనార్హం.

నిజమైన ప్రేమంటే కొట్టే స్వేచ్ఛ ఉండాలి : దర్శకుడు సందీప్ వంగా వివాదాస్పద వ్యాఖ్యలు..!
Instagram

కబీర్ సింగ్ సినిమా పైనే కాదు.. ఆ తర్వాత దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రేమికులు, భార్యాభర్తలు ఒకరినొకరు కొట్టుకునే స్వేచ్ఛ ఉండడమే.. నిజమైన ప్రేమ" అంటూ చేసిన కామెంట్లపై కూడా విమర్శల వర్షం కురుస్తోంది.

ఈ సీన్ గురించి కియారా మాట్లాడుతూ "అది సినిమా. సినిమాలోని పాత్రకు సంబంధించి దర్శకుడు చెప్పినట్లుగా చేయడం నా పని. నేను నటించే పాత్రకు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి సంబంధం ఉండదు. వ్యక్తిగతంగా నాకైతే నేను ఒక బంధంలో ఉన్నప్పుడు.. అవతలి వ్యక్తి నన్ను అగౌరవపరిచేలా మాట్లాడడం, తిట్టడం, కొట్టడం వంటివి చేస్తే నేను అస్సలు భరించను. అవతలి వ్యక్తి నన్ను కొట్టేంత వరకూ అస్సలు తీసుకెళ్లను. ముందే అలాంటివారిని దూరంగా ఉంచుతాను" అని చెప్పింది.

అంతేకాదు.. ప్రీతి పాత్రకు తనకు ఏమాత్రం పోలిక లేదని.. అయితే సెట్స్‌లోకి వెళ్లిన తర్వాత.. తను కియారాలా కాకుండా ప్రీతిలా మాత్రమే ఆలోచించి సినిమాలో నటించడానికి ప్రయత్నిస్తానని.. అందుకే ప్రీతి పాత్రలో అలా కనిపించగలిగానని చెప్పుకొచ్చింది.

Instagram

అయితే ప్రీతి పాత్ర కూడా మరీ అంత బలహీనమైనదేమీ కాదని.. అదే ఆ పాత్రను తాను ఎంచుకునేలా చేసిందని చెబుతోంది కియారా. "ఒకరు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నారంటే.. అవతలి వారు చెప్పినదానికి తల వంచుతున్నారని అర్థం కాదు. ప్రీతి కూడా బలమైనదే. తను కబీర్‌ని వదిలేయాలనుకుంది. పెళ్లి చేసుకున్న రెండో రోజే ఇంటి నుంచి వెళ్లిపోయింది. తన కడుపులోని బిడ్డను కూడా ఒంటరిగా పెంచాలనుకుంది. తాను తల్లిని కాబోతున్నానని తెలిసినప్పుడు కూడా కబీర్ దగ్గరకు వెళ్లాలనుకోలేదు. మాటల్లోనే ధైర్యం తెలుస్తుందన్నది నా భావన కాదు. కొన్నిసార్లు మన చేతలు మాటల కంటే ఎక్కువగా చెబుతాయి.." అంటూ ప్రీతి పాత్ర గురించి తన అభిప్రాయాన్ని చెప్పింది కియారా.

భిన్నమైన లెహెంగా డిజైన్స్ తో స్టైల్ ఐకాన్ గా గుర్తింపు తెచ్చుకున్న కియారా..
Instagram

అలియా అద్వానీగా ఉన్న తన పేరును కియారాగా మార్చుకోవడానికి వెనకున్న కథను కూడా వెల్లడించింది కియారా. "2014లో నేను ఇండస్ట్రీకి పరిచయమైనప్పటి నుంచే.. నా పేరు కియారా అద్వానీగా మారింది. నాకంటూ ఓ సొంత గుర్తింపు సంపాదించుకోవడం కోసం ఇలా పేరు మార్చుకోవడం అవసరం అని నాకు అనిపించింది. నేను ఇండస్ట్రీలో అడుగుపెట్టేనాటికే అలియా భట్ ఇండస్ట్రీలో మంచి స్థానంలో ఉంది. ఇద్దరు అలియాలు ఉండడం వల్ల కన్య్ఫూజన్ ఉంటుంది అనిపించింది. అందుకే పేరు మార్చుకోవాలనుకున్నా.

కియారా అనే పేరు అంటే ఎప్పటి నుంచో నాకు చాలా ఇష్టం. అంజానా అంజానీ సినిమాలో ప్రియాంకా చోప్రా పేరు కియారా. ఆ సినిమాలో తను చాలా స్టైల్‌గా హాయ్.. నా పేరు కియారా అంటూ పరిచయం చేసుకుంటుంది. అది చూసినప్పటి నుంచి నాకు ఆ పేరంటే ఎందుకో ఇష్టం ఏర్పడింది. నాకు ఒకవేళ కూతురు పుడితే తనకు కియారా అని పేరు పెడదాం అనుకున్నా. కానీ ఆ పేరును నాకు నేనే పెట్టుకునే అవకాశం వచ్చింది. ఇలాంటి అవకాశం చాలా తక్కువ మందికి దొరుకుతుందేమో.." అంటూ తన పేరు మార్పు వెనకున్న కథ గురించి చెప్పుకొచ్చింది కియారా.

Instagram
'కబీర్ సింగ్' ప్రేయసి.. మన 'అర్జున్ రెడ్డి'ని ఎందుకు కలిసింది..?

ప్రస్తుతం లక్ష్మీ బాంబ్, గుడ్ న్యూస్ చిత్రాల్లో నటిస్తోంది కియారా. వీటి తర్వాత షేర్ షా, ఇందూ కీ జవానీ చిత్రాల్లోనూ నటించనుంది. ఆమె నటిస్తోన్న లక్ష్మీ బాంబ్ చిత్రం రాఘవ లారెన్స్, లక్ష్మీ రాయ్ నటించిన కాంచన 2 సినిమాకి రీమేక్. ఇందులో కియారా అక్షయ్ కుమార్ సరసన నటిస్తోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్న ఆమె మరో చిత్రం గుడ్ న్యూస్. అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ప్రధాన జంటగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కియారా, దిల్జీత్ మరో జంటగా కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 27న విడుదలకు సిద్ధమవుతోంది.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.

క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.