మరో సారి "మన్మధుడు"గా వచ్చేస్తున్న నాగ్.. రకుల్ ప్రీత్ సరసన రొమాంటిక్ ఎంట్రీ

మరో సారి "మన్మధుడు"గా వచ్చేస్తున్న నాగ్.. రకుల్  ప్రీత్ సరసన రొమాంటిక్ ఎంట్రీ

మ‌న్మ‌ధుడు (Manmadhudu).. 2002లో విడుద‌లైన ఈ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఇక ఈ సినిమాలోని పాట‌లైతే ఇప్ప‌టికీ లేటెస్ట్ సాంగ్స్‌కు పోటీగా వినిపిస్తూనే ఉంటాయి. అయిదు ప‌దుల వ‌య‌సులో కూడా త‌న ఛ‌రిష్మా ఏ మాత్రం త‌గ్గ‌కుండా మెయింటైన్ చేస్తున్న క‌థానాయకుడు అక్కినేని నాగార్జున‌ (Nagarjuna).


హీరోలుగా సినీప‌రిశ్ర‌మ‌లో అడుగుపెట్టిన ఇద్ద‌రు కొడుకులు, స‌క్సెస్‌ని త‌న మ‌రో పేరుగా మార్చుకున్న కోడ‌లు.. ఇంత‌మంది ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఉన్న అభిమానుల ఫాలోయింగ్ అస‌లు ఏమాత్రం త‌గ్గ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. ప‌ర్ఫెక్ట్ ఫిట్ నెస్‌తో కొడుకుల‌తోనే పోటీప‌డుతూ న‌టిస్తున్నాడు ఈ న‌వ‌మ‌న్మ‌ధుడు. ఆయన  న‌టించిన "మన్మధుడు" చిత్రానికి సీక్వెల్ రానుంద‌ని మునుపు చిత్ర‌సీమ‌లో వార్త‌లు వినిపించాయి.


అయితే ఆ వార్త‌లు నిజ‌మేన‌ని తాజాగా నిరూపిత‌మైంది. మ‌న్మ‌ధుడు చిత్రానికి సీక్వెల్‌గా "మ‌న్మ‌ధుడు 2" వచ్చేస్తుంది. ఈ చిత్ర షూటింగ్ కూడా త్వరలో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాలు ఇటీవ‌లే జ‌రిగాయి. అయితే 17 ఏళ్ల క్రితం విడుద‌లైన మ‌న్మ‌ధుడు చిత్రానికి సీక్వెల్ వస్తున్నా.. క‌థ‌ప‌రంగా క‌చ్చితంగా మార్పులు ఉంటాయ‌న్నది పలువురి అభిప్రాయం.తాజాగా చిత్ర‌బృందం చెప్పిన వివ‌రాల‌ను బ‌ట్టి ఇది నిజ‌మేన‌నిపిస్తోంది. ఎందుకంటే ఈ క‌థ‌లో నాగార్జున 40 ఏళ్ల వ్యక్తిగా క‌నిపిస్తే.. ఆయ‌న‌కు జ‌త‌గా టాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్ రకుల్ ప్రీత్ మాత్రం 20 ఏళ్ల సుంద‌రిగా క‌నిపించ‌నుంద‌ట‌! మ‌రొక ఆస‌క్తిక‌ర‌మైన వార్త ఏంటంటే.. ఆర్ ఎక్స్ 100తో కుర్ర‌కారు గుండెల్లో గిలిగింత‌లు పుట్టించిన సుంద‌రి పాయ‌ల్ రాజ్ పూత్ కూడా ఈ సినిమాలో మెర‌వ‌నుంద‌ట‌! 


మ‌న్మ‌ధుడు 2 చిత్రానికి "చి.ల‌.సౌ" చిత్రంతో ద‌ర్శ‌కుడిగా మారిన న‌టుడు.. అదేనండీ... మ‌న రాహూల్ ర‌వీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. తొలి చిత్రంతోనే ద‌ర్శ‌కుడిగా మంచి మార్కుల‌తో పాటు చ‌క్క‌టి హిట్ కూడా కొట్టేసిన ఈ యువ ద‌ర్శ‌కుడు త‌న రెండో చిత్రానికే కింగ్ నాగార్జునతో క‌లిసి ప‌ని చేసే అవ‌కాశం ద‌క్కించుకోవ‌డం విశేషం. ఇక ఆర్ ఎక్స్ 100 చిత్రానికి మంచి బాణీలు అందించిన చైత‌న్ భ‌రద్వాజ్ ఈ చిత్రానికి కూడా స్వ‌రాలు స‌మ‌కూర్చ‌నున్నారు. మ‌న్మ‌ధుడు 2 చిత్రాన్ని మ‌నం ఎంట‌ర్ ప్రైజ‌స్, ఆనంది ఆర్ట్ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.


అలాగే ఈ చిత్ర షూటింగ్ కూడా త్వ‌ర‌లో ప‌ట్టాలెక్క‌నుంది. ఈ గురువారం నుంచి దాదాపు ఒక వారం రోజుల పాటు హైద‌రాబాద్‌లో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకున్న త‌ర్వాత.. 40 రోజుల షెడ్యూల్ నిమిత్తం పోర్చుగ‌ల్ వెళ్ల‌నుందీ చిత్ర‌బృందం. ఓవైపు ప్ర‌ధాన తారాగ‌ణంతోనే ప్రేక్ష‌కుల్లో అంచ‌నాలు రేకెత్తిస్తోన్న ఈ సినిమా షూటింగ్ కూడా.. అంతే స్థాయిలో ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి క‌లిగిస్తోంది.


 అమ్మాయిల‌ను ద్వేషించే ఒక అబ్బాయిగా.. ఒక అడ్వ‌ర్టైజింగ్ ఏజెన్సీ ఎండీ అభిరామ్‌గా.. మ‌న్మ‌ధుడు చిత్రంలో నాగ్ పూయించిన న‌వ్వుల పువ్వులు ఇప్ప‌టికీ గుర్తే. మ‌న్మ‌ధుడు సినిమా ఎప్పుడు చూసినా ఆ న‌వ్వుల పువ్వులు విర‌బూస్తూనే ఉంటాయి. అభిగా నాగార్జున న‌టిస్తే, ఆయ‌న‌కు జ‌త‌గా సోనాలీ బింద్రె, అన్షు న‌టించారు. క‌థ‌కు ఈ మూడు పాత్ర‌లే బలంగా నిలిచిన విష‌యం మ‌న‌కు విదిత‌మే. 


ఇక ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బా న‌వ్వించేందుకు సునీల్ & బ్ర‌హ్మానందం పాత్రలు కూడా బాగా తోడ్ప‌డ్డాయి. అయితే పాత్ర‌ల బ‌లంతో పాటు మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ డైలాగ్స్, హాస్య చ‌తుర‌త కూడా ఈ చిత్రానికి కీల‌కంగా నిలిచాయ‌నే చెప్పాలి. అందుకే ఈ చిత్రం అప్ప‌ట్లో అంత పెద్ద హిట్‌గా నిలిచింది.


అయితే ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా తెర‌కెక్క‌నున్న చిత్రంపై కూడా ప్రేక్ష‌కుల్లో భారీగానే అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. మ‌రి, నాగార్జున కెరీర్‌లోనే ఒక మైలు రాయిగా నిలిచిపోయిన మ‌న్మ‌ధుడు చిత్రంలానే ఈ చిత్రం కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుందా? ప‌్రేక్ష‌కుల అంచ‌నాలను అందుకుంటుందా?? తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాల్సిందే..!


ఇవి కూడా చ‌ద‌వండి


ఈ ముద్దుకు... కథకు సంబంధముంది: 'డియర్ కామ్రేడ్' కథానాయిక రష్మిక


న‌య‌న‌తార‌పై అనుచిత వ్యాఖ్య‌లు.. ప్రముఖ తమిళ నటుడి స‌స్పెన్ష‌న్..!


ఆసుపత్రిలో "అర్జున్ రెడ్డి".. విజయ్ దేవరకొండకు ఏమైంది...?