ADVERTISEMENT
home / సౌందర్యం
కుదుళ్ల వద్ద జిడ్డుదనాన్ని.. సహజసిద్ధంగా దూరం చేద్దామిలా..!

కుదుళ్ల వద్ద జిడ్డుదనాన్ని.. సహజసిద్ధంగా దూరం చేద్దామిలా..!

కొందరి కురులు ఎన్ని చిట్కాలు పాటించినప్పటికీ జిడ్డుగానే కనిపిస్తుంటాయి. ఇందుకు కారణం వారి కుదుళ్ల వద్ద.. అంటే మాడు (Scalp) వద్ద కూడా జిడ్డుగా ఉండడమే. స్కాల్ప్ జిడ్డుగా ఉన్నప్పుడు కుదుళ్లు పొడిగా, అందంగా కనిపించాలని ఎంత ప్రయత్నించినా.. అది నామమాత్రంగానే మిగిలిపోతుంది. అయితే ఇంట్లో అందుబాటులో ఉండే సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చంటున్నారు సౌందర్య నిపుణులు. అసలు, మాడు వద్ద జిడ్డుగా ఉండడానికి గల కారణాలేంటో మీకు తెలుసా?? అవేంటంటే..

మాడు వద్ద జిడ్డుగా ఉండడానికి గల కారణాలు..

స్కాల్ప్ వద్ద జిడ్డుగా ఉండడానికి కూడా అనేక రకాల కారణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకున్నప్పుడే వాటికి పూర్తిస్థాయిలో చెక్ పెట్టడం సాధ్యమవుతుంది.

జన్యుపరమైన కారణాలు

మీ తల్లిదండ్రులు ఇరువురిలో ఎవరికైనా ఈ సమస్య ఉంటే.. అది జన్యువుల ద్వారా మీకు కూడా సంక్రమించే అవకాశాలున్నాయి. ఈ క్రమంలో దీనిని వారసత్వంగా వచ్చే సమస్యగా భావించవచ్చు.

తేమ

మీరు నివసించే ప్రదేశంలోని వాతావరణంలో తేమ మరీ అధిక స్థాయిలో ఉంటుందా?? అయితే జాగ్రత్తండోయ్.. స్కాల్ప్ జిడ్డుగా ఉండడానికి అది కూడా ఓ కారణం కావచ్చు. ఇలాంటి వాతావరణంలో కేవలం మాడు వద్ద మాత్రమే కాదు.. చర్మం కూడా జిడ్డుగానే ఉంటుంది.

ADVERTISEMENT

హార్మోన్ల అసమతౌల్యతలు

ప్రెగ్నెన్సీ, ప్యూబర్టీ, మెనోపాజ్, ఒత్తిడి.. వంటి కారణాలతో పాటు మనం తీసుకునే కొన్ని రకాల మందుల వల్ల కూడా హార్మోన్ల అసమతౌల్యత సమస్యలు తలెత్తవచ్చు. ఫలితంగా కుదుళ్ల వద్ద నూనెలు అధికంగా ఉత్పత్తయ్యే అవకాశాలున్నాయి. ఈ కారణంగా కూడా మాడు వద్ద జిడ్డుగా అనిపించవచ్చు.

హెయిర్ ఉత్పత్తులు అధికంగా వినియోగించడం

shutterstock

కేశ సంబంధిత ఉత్పత్తులైన కండిషనర్, సీరమ్, హెయిర్ జెల్, హెయిర్ వ్యాక్స్.. వంటి వాటిని పరిమితికి మించి అధిక పరిమాణాల్లో ఉపయోగించడం వల్ల.. అవి కుదుళ్ల వద్ద కాస్త అధికమొత్తంలో పేరుకుపోతాయి. వీటిలో ఉండే రసాయన పదార్థాల కారణంగా సెబేషియస్ గ్లాండ్స్ పని తీరు ప్రభావితం అవుతుంది. ఇక ఆల్కహాల్ ఆధారిత ఉత్పత్తులు ఉపయోగిస్తే ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ఇవి సెబమ్‌తో కలిసి కేశాలకు హాని కలిగిస్తాయి.

ADVERTISEMENT

సరిపడని ఉత్పత్తులు వినియోగించడం..

ఒక్కొక్కరి కేశాలు ఒక్కో తీరులో ఉంటాయి. కొందరికి పొడి జుట్టుతత్వం ఉంటే.. ఇంకొందరికి జుట్టు మామూలుగానే జిడ్డుగా ఉంటుంది. ఎవరు ఉపయోగించే ఉత్పత్తులైనా జుట్టుతత్వం బట్టే ఎంచుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా సాధారణంగానే జిడ్డుతత్వం ఉన్నవారు కేశాలకు మరింత తేమను అందించే షాంపూలు, కండిషనర్స్ వంటివి ఉపయోగిస్తే.. మాడు వద్ద మరింత జిడ్డుగా మారే అవకాశాలు లేకపోలేదు.

తలస్నానానికి వేడి నీళ్లు..

వేడినీళ్లు సెబేషియస్ గ్రంథుల పనితీరుని ప్రభావితం చేసి.. మరింత ఎక్కువ సెబమ్ ఉత్పత్తి చేసేలా చేస్తాయి. కాబట్టి తలస్నానానికి.. గోరువెచ్చగా ఉన్న నీళ్లు మాత్రమే ఉపయోగిస్తే మంచిది.

ఎక్కువసార్లు షాంపూ చేసుకోవడం..

కొంతమందికి రోజూ తలస్నానం చేసే అలవాటు ఉంటుంది. అలా చేయడం వల్ల తలలోని జిడ్డుదనం తగ్గుతుందని వారు భావిస్తూ ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. ఇలా జుట్టును తరచూ షాంపూతో శుభ్రం చేయడం వల్ల.. కుదుళ్ల వద్ద మరింత ఎక్కువ మొత్తంలో సెబమ్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఫలితంగా జుట్టులోని జిడ్డుదనం మరింత ఎక్కువ అవుతుంది.. తప్ప తగ్గదు.

ఇవే కాదు.. జుట్టును తరచూ కండిషనింగ్ చేయడం, జుట్టుతో ఆడుకోవడం, ఎక్కువసార్లు దువ్వుకోవడం, బిగుతుగా పైకి దువ్వుకోవడం, హీట్ స్టైలింగ్ ఉత్పత్తులు ఉపయోగించడం.. వంటివి కూడా మాడు వద్ద జిడ్డుదనం ఎక్కువగా ఉండడానికి కారణాలు అవుతాయి.

ADVERTISEMENT

జిడ్డుదనాన్ని తగ్గించే సహజసిద్ధమైన చిట్కాలు

మాడు వద్ద ఎక్కువగా ఉన్న జిడ్డుదనాన్ని తగ్గించడానికి ఇంట్లో లభ్యమయ్యే కొన్ని సహజసిద్ధమైన పదార్థాలను ఉపయోగిస్తే సరిపోతుంది. మరి, ఏయే పదార్థాలను ఎలా ఉపయోగించాలో కూడా ఓసారి తెలుసుకుందాం రండి..

టీ ట్రీ ఆయిల్

సాధారణంగా చర్మంపై పేరుకున్న జిడ్డుదనాన్ని తొలగించడంలో.. టీ ట్రీ ఆయిల్ సమర్థంగా పని చేస్తుంది. అలాగే మాడు వద్ద ఎక్కువగా ఉత్పత్తయ్యే సెబమ్‌ని నియంత్రించడంలోనూ ఇది బాగా ఉపకరిస్తుంది. ముందుగా ఒక గ్లాస్ బౌల్‌లో కొద్దిగా టీ ట్రీ ఆయిల్ తీసుకొని.. రెండు చుక్కల వెజిటబుల్ ఆయిల్ కూడా అందులో వేసి బాగా కలపాలి. ఈ రెండూ బాగా కలిసిన తర్వాత ఆ మిశ్రమాన్ని కుదుళ్లకు బాగా పట్టించాలి. దాదాపు 15 నిమిషాల పాటు దానిని ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

యాపిల్ సిడార్ వెనిగర్

యాపిల్ సిడార్ వెనిగర్‌ని కేవలం వంట గదిలోనే కాదు.. సౌందర్యపరమైన చిట్కాల నిమిత్తం కూడా నిరభ్యంతరంగా ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు స్కాల్ప్ జిడ్డుగా మారడానికి కారణమైన బ్యాక్టీరియాను నియంత్రించడంలో బాగా ఉపకరిస్తాయి. అలాగే మాడు వద్ద ఉన్న పీహెచ్ లెవల్స్‌ను కూడా క్రమబద్ధీకరిస్తాయి. ఫలితంగా జిడ్డుదనంతో పాటు.. దురద కూడా తగ్గుముఖం పడుతుంది.

ఇందుకోసం ముందుగా తలస్నానం చేసి కురులను పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్ప్రే బాటిల్ తీసుకుని .. అందులో రెండు చెంచాల యాపిల్ సిడార్ వెనిగర్, ఒక చెంచా నీళ్లు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని బాటిల్ సహాయంతో జుట్టుపై స్ప్రే చేసుకోవడం లేదా దూది సహాయంతో కుదుళ్ల వద్ద అప్లై చేసుకోవడం వంటివి చేయాలి. దీనిని 10 నుంచి 15 నిమిషాల పాటు ఆరనిచ్చి.. ఆ తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి.

ADVERTISEMENT

కొబ్బరి నూనె

కేశాలకు సరిపడా కొబ్బరినూనె తీసుకుని కొద్దిగా వేడి చేయాలి. అయితే నూనెను నేరుగా వేడి చేయడం కాకుండా మరిగించిన వేడినీళ్లు ఒక బౌల్లోకి తీసుకుని.. అందులో కొబ్బరినూనె ఉంచిన బౌల్‌ని ఉంచాలి. ఇప్పుడు దీనిని కుదుళ్లకు పట్టించి బాగా మర్దన చేసుకోవాలి. తర్వాత తలస్నానం చేసి కురులు ఆరబెట్టుకోవాలి. ఇలా వారానికోసారి క్రమం తప్పకుండా చేయడం వల్ల కుదుళ్ల వద్ద జిడ్డుదనం తగ్గుతుంది.

కలబంద

కురులు ఒత్తుగా ఉండేందుకు మనం ఉపయోగించే పదార్థం కలబంద. అయితే ఇందులో ఉండే అస్ట్రింజెంట్ గుణాలు మాడు వద్ద ఉన్న జిడ్డుదనాన్ని కూడా తగ్గిస్తాయి. ఇందుకోసం ఒక కప్పు నీళ్లలో.. రెండు చెంచాల కలబంద గుజ్జు, ఒక చెంచా పొటెల్లా జ్యూస్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వద్ద బాగా అప్లై చేసి 10 నిమిషాల పాటు ఆరనిచ్చి తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికోసారి క్రమం తప్పకుండా చేయడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.

గ్రీన్ టీ

కురుల ఆరోగ్యానికి ఉపకరించే సహజసిద్ధమైన పదార్థాల్లో గ్రీన్ టీ కూడా ఒకటి. ఇది కేశాలకు పోషణ అందించడమే కాదు.. మాడు వద్ద జిడ్డుదనం తగ్గించి సమస్య తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ఇందుకోసం ఒక కప్పు వేడి నీళ్లలో గ్రీన్ టీ బ్యాగ్ వేసి.. ఐదు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక స్ప్రే బాటిల్‌లో తీసుకోవాలి. దీనిని కుదుళ్ల వద్ద స్ప్రే చేసి లోపలికి ఇంకేలా చేతివేళ్లతో  మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత అరగంట పాటు ఆరనిచ్చి.. చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారానికోసారి చొప్పున.. క్రమం తప్పకుండా చేయడం వల్ల చక్కని ఫలితం కనిపిస్తుంది.

ADVERTISEMENT

కొకొవా పౌడర్

కొకొవా పౌడర్‌ని సహజసిద్ధమైన డ్రై షాంపూగా ఉపయోగించవచ్చు. ఇది మాడు వద్ద పేరుకున్న జిడ్డుదనాన్ని నియంత్రించడంలో చక్కగా పని చేస్తుంది. కొకొవా పౌడర్‌ని కుదుళ్ల వద్ద జల్లి.. వెడల్పాటి పళ్లున్న దువ్వెన సహాయంతో మొత్తం పరుచుకునేలా చేయాలి. కాసేపు అలానే ఉంచి.. తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ చిట్కాను తలస్నానం చేసే సమయం లేనప్పుడు ఫాలో అయిపోవచ్చు.

గుడ్డులోని పచ్చసొన

జుట్టులోని సహజసిద్ధమైన నూనెలను క్రమబద్ధీకరించేందుకు.. గుడ్డులోని పచ్చసొన మనకు బాగా ఉపయోగపడుతుంది. ఫలితంగా మాడు వద్ద విడుదలయ్యే స్రావాలు నియంత్రణలో ఉండి జిడ్డుదనం లేకుండా ఉంటాయి. ఇందుకోసం గుడ్డులోని పచ్చసొన, పొటెల్లా జ్యూస్ కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని కురులకు అప్లై చేసి 30 నిమిషాల నుంచి గంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కురులను శుభ్రం చేసుకోవాలి. షాంపూ ఉపయోగించకూడదు.

నిమ్మరసం

ఒక కప్పు నిమ్మరసం తీసుకుని.. దానిని నీళ్లతో కలిపి బాగా పలుచగా చేసుకోవాలి. దీనిని కుదుళ్ల లోపలకు ఇంకేలా చేతి మునివేళ్లతో బాగా మర్దన చేసుకొని.. 15 నుంచి 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. అనంతరం చల్లని నీటితో కురులను శుభ్రం చేసుకుంటే సరిపోతుంది.

జొజొబా ఆయిల్

ADVERTISEMENT

shutterstock

మాడు వద్ద పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మురికిని శుభ్రం చేసేందుకు జొజొబా ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే సెబేషియస్ గ్రంధుల నుంచి సెబమ్.. ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కూడా నియంత్రిస్తుంది. ఇందుకోసం జొజొబా ఆయిల్‌ని బాదం లేదా కొబ్బరి వంటి నూనెలతో మిక్స్ చేసి అప్లై చేస్తే సరిపోతుంది. అనంతరం 20 నిమిషాల పాటు మర్దన చేసుకుని.. తర్వాత మైల్డ్ షాంపూ ఉపయోగించి తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికోసారి చొప్పున క్రమం తప్పకుండా చేయాల్సి ఉంటుంది.

ఓట్ మీల్

మాడు వద్ద ఉన్న అధిక నూనెలు లేదా జిడ్డుదనాన్ని సత్వరమే పీల్చేసుకోవడం ద్వారా తగ్గించేందుకు ఉపయోగపడే పదార్థాల్లో ఓట్ మీల్ ముందు వరుసలో ఉంటుంది. కాబట్టి కుదుళ్ల వద్ద జిడ్డు ఎక్కువగా ఉండేవారు ఓట్ మీల్స్‌తో తయారు చేసే.. ఈ మాస్క్‌ని తప్పకుండా ప్రయత్నించి చూడవచ్చు. తొలుత కొద్దిగా ఓట్ మీల్స్ తీసుకొని వాటిని నీటిలో కడిగి శుభ్రం చేసుకోవాలి. తర్వాత వాటిని మెత్తని పేస్ట్‌లా చేసుకొని కుదుళ్ల లోపలికి ఇంకేలా అప్లై చేసుకోవాలి. తర్వాత 5 నుంచి 20 నిమిషాల పాటు ఆరనిచ్చి.. అనంతరం మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

యోగర్ట్ మాస్క్

సాధారణంగా యోగర్ట్‌ను సహజసిద్ధమైన జిడ్డు నివారిణిగా చెబుతుంటారు. కేవలం కురులకు మాత్రమే కాదు.. చర్మంపై ఉండే అధిక నూనెలు, జిడ్డుదనాన్ని తగ్గించడంలో సైతం యోగర్ట్ మనకు బాగా ఉపయోగపడుతుంది. అరకప్పు యోగర్ట్, చెంచా బేకింగ్ సోడా, రెండు చెంచాల పొటెల్ల జ్యూస్ ఒక గిన్నెలోకి తీసుకుని.. బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మాడుకి బాగా అంటుకునేలా అప్లై చేసి.. చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఆ రోజు షాంపూని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదని గుర్తుంచుకోండి.

ADVERTISEMENT

హెన్నా

కుదుళ్ల వద్ద అధికంగా ఉండే నూనెలు, జిడ్డుదనాన్ని తగ్గించేందుకు హెన్నాని కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇందుకోసం అరచెంచా హెన్నా పౌడర్ తీసుకుని.. అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, రెండు చెంచాల కొబ్బరినూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు అప్లై చేసి అరగంట పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో కురులు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. హెన్నా ఉపయోగించినప్పుడు షాంపూ వాడకూడదని గుర్తుంచుకోండి.

Shutterstock

ADVERTISEMENT

shutterstock

మాడు వద్ద జిడ్డుదనం ఎక్కువగా ఉంటే చేయాల్సినవి, చేయకూడనివి..

కుదుళ్ల వద్ద జిడ్డుదనం అధికంగా ఉన్నప్పుడు మనం తప్పకుండా చేయాల్సిన, చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అవి..

చేయకూడనివి..

ADVERTISEMENT

Shutterstock

1. కుదుళ్లు, కురుల పై పదే పదే చేతులు వేయడం..

2. కుదుళ్ల వద్ద కండిషనర్ అప్లై చేయడం

3. వేడి నీళ్లతో కేశాలు శుభ్రం చేసుకోవడం

ADVERTISEMENT

4. నూనె ఆధారిత పదార్థాలు, చక్కెర, రెడ్ మీట్.. వంటివి తక్కువగా తీసుకోవడం

చేయాల్సినవి..

1. రోజులో కేవలం ఒకే ఒక్కసారి మాత్రమే కురులను నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది.

2. వీలైనంత అధిక మొత్తంలో నీళ్లు తాగడం

3. పిల్లో కవర్‌ని ప్రతి వారం మార్చడం..

ADVERTISEMENT

4. కురులు శుభ్రం చేసుకోవడానికి చల్లని నీళ్లు మాత్రమే ఉపయోగించడం

5. రోజూ తీసుకునే ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా ఉండాలి.

తరచూ అడిగే కొన్ని సందేహాలు – వాటి సమాధానాలు

కుదుళ్ల వద్ద జిడ్డుదనం సమస్యతో బాధపడేవారు.. చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటివారిని తరచూ అడిగే కొన్ని సందేహాలు.. వాటి సమాధానాలు ఓసారి చూద్దాం..

నా కుదుళ్ల వద్ద జిడ్డుదనం ఎక్కువగా ఉంటుంది. మరి, నేను కురులకు నూనె రాసుకోవాలా??

ADVERTISEMENT

Shutterstock

మాడు వద్ద జిడ్డుగా ఉన్నంత మాత్రాన.. నూనె రాసుకోకూడదనే నియమం ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే చాలా నూనెలు.. కురులకు ఆరోగ్యాన్ని అందిస్తూనే కుదుళ్లను సంరక్షిస్తుంటాయి. అయితే మీ జుట్టు తత్వానికి అనుగుణం..గా మీరు రాసుకునే నూనెను కూడా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ కుదుళ్ల ఆరోగ్యం కూడా పదిలంగా ఉంటుంది.

ఆయిలీ హెయిర్, స్కాల్ప్ యొక్క లక్షణాలేంటి??

స్కాల్ప్ వద్ద జిడ్డుదనం ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ దురద, కాస్త నొప్పిగా కూడా అనిపించవచ్చు. అయితే ఇది మాడు వద్ద విడుదలయ్యే సెబమ్ రకం, పరిమాణం పై ఆధారపడి ఉంటుంది. పైగా ఈ సమస్య వల్ల జుట్టు ఎదుగుదల కూడా క్షీణిస్తుంది. ఇలా అధికంగా విడుదలయ్యే నూనెలు, సెబమ్ కారణంగానే చర్మం, జుట్టు జిడ్డుగా మారతాయి.

కుదుళ్ల వద్ద ఉండే జిడ్డుదనం వల్ల జుట్టు పలచబడుతుందా??

కుదుళ్ల వద్ద అధికంగా ఉండే జిడ్డుదనం లేదా నూనెల కారణంగా జుట్టు పలచబడే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ఎందుకంటే ఈ సమస్య కారణంగా చుండ్రు, జుట్టు రాలిపోవడం.. వంటి అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. అధికంగా విడుదలయ్యే ఈ స్రావాలు జుట్టు సహజసిద్ధమైన ఎదుగుదలను సైతం బాగా ప్రభావితం చేస్తాయి. ముఖ్యంగా ఈ సమస్య కారణంగా మాడు వద్ద ఉన్న చర్మంలో.. వాపు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.

ADVERTISEMENT

మాడు వద్ద ఉండే జిడ్డుదనాన్ని నియంత్రించడం ఎలా??

చేతివేళ్లతో కుదుళ్లను, కేశాలను తరచూ తాకకండి. అలాగే కురులకు కండిషనర్ అప్లై చేసుకునే సమయంలో కూడా కుదుళ్ల వద్ద కాకుండా ఒక ఇంచ్ పై భాగం నుంచి చివర్ల వరకు దానిని అప్లై చేసుకోండి. ముఖ్యంగా అధిక ఒత్తిడికి దూరంగా ఉండండి. అలాగే తలస్నానానికి బాగా వేడిగా ఉన్న నీళ్లను ఉపయోగించడం, హెయిర్ స్టైలింగ్ నిమిత్తం అత్యధికంగా వేడిని విడుదల చేసే ఉత్పత్తులను వినియోగించడం, రోజూ తీసుకునే ఆహార పదార్థాల్లో చక్కెర, వేయించిన పదార్థాలు, మాంసం.. వంటివి తక్కువగా ఉండేలా చూసుకోవడం.. వంటివి చేయాలి. 

కురులను రెండు నుంచి మూడు రోజులకోసారి తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. మరీ తరచూ తలస్నానం చేయకూడదు. అలాగే తలస్నానం నిమిత్తం మైల్డ్ షాంపూని మాత్రమే ఉపయోగించాలి. సహజసిద్ధమైన నూనెలను ప్రభావితం చేసే రసాయనాలు కలిగిన ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. సరిపడినంత నిద్ర ఉండేలా చూసుకుంటూ; అధిక మొత్తంలో నీళ్లు తాగాలి. ప్రతి వారానికోసారి పిల్లో కవర్స్ తప్పనిసరిగా మార్చుకోవాలి. తలస్నానం చేసేందుకు గోరువెచ్చని లేదా చల్లని నీటిని మాత్రమే ఉపయోగించాలి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవడంతోపాటు.. విటమిన్ బి ఎక్కువగా లభించే బీన్స్, పౌల్ట్రీ, చేపలు, తాజా కూరగాయలు, పండ్లు.. మొదలైనవి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడే ఈ సమస్యను నియంత్రించే వీలు ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మీ కురులు ఒత్తుగా కనిపించాలా?? అయితే ఇలా చేయాల్సిందే..

ADVERTISEMENT

మీ కురులు అందంగా కనిపించాలంటే.. హైలైట్ చేసుకోండిలా..!

ఈ సహజసిద్ధమైన చిట్కాలతో…. ట్యాన్‌కు టాటా చెప్పేయచ్చు..!

 

29 Aug 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT