ద్రాక్ష(Grapes).. అదో సూపర్‌ఫుడ్.. కేవలం తినడానికి, వైన్(Wine) తయారీకి.. స్వీట్‌కి బదులుగా తీసుకోవడానికి మాత్రమే కాదు.. మన అందాన్ని పెంచేందుకు కూడా ఇది చక్కగా ఉపయోగపడుతుంది. ఇవి అన్ని రకాల సూపర్ ఫుడ్స్‌కి ఎంతో పోటీని అందిస్తాయి. రుచికరమైన సలాడ్ తయారీలో, చాలామంది ఇష్టపడే వైన్ తయారీలో ఉపయోగపడే ఈ ద్రాక్ష కేవలం నలుపు, ఆకుపచ్చ రంగుల్లోనే కాదు… ఎరుపు, నీలం, పర్పుల్, తెలుపు, బంగారు రంగుల్లో అందుబాటులో ఉంటాయి. ఇందులో చాలా రకాల ద్రాక్ష కాస్త పుల్లగా అనిపించినా.. వాటిలో ఎన్నో అత్యావశ్యక పోషకాలు నిండి ఉంటాయి.
ద్రాక్ష గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ విషయం కూడా వినేయండి. మిడిల్ ఈస్ట్ దేశాల్లో ద్రాక్ష ఎక్కువగా పండుతుంది. ఒకసారి షిరాజ్ పట్టణానికి చెందిన ప్రజలు ద్రాక్ష పండ్లు పాడైపోకుండా దాన్ని పులియబెడితే ఎలా ఉంటుందని ప్రయత్నించారట. వాటి నుంచి రసం తీసి దాన్ని పులియబెట్టారు. దాని రుచి బాగుండడంతో అలాగే కొనసాగించారట. ఆ తర్వాత మిగిలిన దేశాలన్నీ ఆ పద్ధతిని పాటించి వైన్ తయారుచేయడం ప్రారంభించాయి. అలా ద్రాక్ష నుంచి వైన్ పుట్టిందట. కేవలం రుచి మాత్రమే కాదు.. ద్రాక్ష ఆరోగ్యాన్ని కూడా అందిస్తుంది. దీని వల్ల మన ఆరోగ్యానికి, అందానికి ఎలాంటి ప్రయోజనాలుంటాయో తెలుసుకుందాం రండి.
ఈ కథనంలోని ముఖ్యాంశాలు
ద్రాక్ష అందాన్ని ఎలా పెంపొందిస్తుంది..
చర్మానికి ద్రాక్ష అందించే ప్రయోజనాలు
జుట్టుకి ద్రాక్ష అందించే ప్రయోజనాలు
ద్రాక్ష పండ్లలో రకాలు
ద్రాక్షతో ఫేస్‌ప్యాక్
ద్రాక్షతో హెయిర్‌ప్యాక్
ద్రాక్ష పండ్లలోని పోషక విలువలు
ద్రాక్ష అందరికీ ఇష్టమైన పండు ఎందుకంటే దాని చక్కటి రుచితో పాటు తినడానికి సులువుగా ఉండడమే కారణంగా చెబుతారు చాలామంది. అవును. దీన్ని తినడానికి తొక్క తీయాల్సిన అవసరం లేదు. కోయాల్సిన అవసరం లేదు. గింజల బాధ అసలే ఉండదు. ఇక తింటున్నప్పుడు రసం కారుతుందన్న ఇబ్బందీ ఉండనే ఉండదు. ఇలా నోట్లో వేసుకొని అలా గుటుక్కుమనిపిస్తే సరి.. అందుకే చాలామంది వీటిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. అయితే చాలామందికి తెలీని సంగతేటంటే ఈ పండ్లు మన జీవక్రియలు సరిగ్గా కొనసాగేందుకు, చర్మం అందాన్ని పెంచేందుకు ఎంతో తోడ్పడుతుంది. ఇందులోని పోషక విలువల గురించి తెలుసుకుందాం రండి..
1. ద్రాక్షలో రెస్వేరెట్రోల్ అనే పాలీఫినోలిక్ ఫైటోకెమికల్ కాంపౌండ్ నిండి ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది మన శరీరాన్ని పెద్దపేగు క్యాన్సర్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి బారి నుంచి తప్పించడమే కాదు.. రక్తాన్ని కూడా శుద్ధి చేస్తుంది.
2. ఎర్ర ద్రాక్షలో యాంతోసైనిన్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి యాంటీ ఎలర్జిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలను కలిగి ఉంటాయి కాబట్టి మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
3. కాటెచిన్స్ అనే యాంటీబయోటిక్స్ ఆకుపచ్చ ద్రాక్షలో ఉంటాయి.ఇవి మన శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల కణాలు నాశనం కాకుండా కాపాడతాయి.
4. కేవలం ద్రాక్షే కాదు.. అన్ని రకాల బెర్రీలు తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి. అందుకే డైటింగ్ చేసేవారు కూడా వీటిని ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు. వంద గ్రాముల ద్రాక్ష పండ్లలో 69 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులో కొలెస్ట్రాల్ ఏ మాత్రం ఉండదు.
5. ద్రాక్ష పండ్లలో ఐరన్, కాపర్, క్యాల్షియం, పొటాషియం, మాంగనీస్ వంటి మైక్రోన్యూట్రియంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన చర్మ ఆరోగ్యానికి ఎంతగానో తోడ్పడతాయి.
6. ఇందులో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె వంటివి ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటితో పాటు కెరోటిన్లు, పైరిడాక్సిన్, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి బీ కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఇందులో అందుబాటులో ఉంటాయి.
ద్రాక్షను సూపర్ ఫుడ్ అని ఎందుకంటాం?
కొన్ని రకాల ఆహారపదార్థాలు తినడం వల్ల మనం ఎంతో ఆరోగ్యంగా మారిపోతాం. అన్నిరకాలుగా మనకు ప్రయోజనాలు అందుతాయి. అందుకే వాటిని సూపర్ ఫుడ్స్ అంటాం. గింజలు, సుగంధద్రవ్యాలు, ఇతర బెర్రీల్లా ద్రాక్ష పండ్లు కూడా సూపర్ ఫుడ్స్‌లో భాగంగా పేరు సాధించాయి. అదెందుకో తెలియాలంటే ద్రాక్ష వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలియాల్సిందే.. ఇవన్నీ చూస్తే ద్రాక్షను రోజూ తినడం తప్పనిసరి అనుకుంటారు.
1. ద్రాక్షపండ్లు యాంటీఆక్సిడెంట్ల ఖజానా అని చెప్పవచ్చు. వీటిలో చాలా రకాల యాంటీఆక్సిడెంట్లు లభిస్తాయి.
2. ద్రాక్షలో విటమిన్ ఎ, విటమిన్ సి. విటమిన్ బీ6, ఫోలేట్‌లు లభిస్తాయి. ఇవన్నీ మన చర్మ ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎంతో అవసరం.
3. వీటిని స్వీట్లలో వేయడం వల్ల వాటికి తియ్యతియ్యని, పుల్లపుల్లని రుచి సొంతమవుతుంది.
4. ఈ బుజ్జి పండ్లు క్యాన్సర్, అల్జీమర్స్, గుండె సమస్యలను తగ్గించగలవని మీకు తెలుసా?
5. రకరకాల పరిశోధనల ప్రకారం ఫ్రెంచ్ వారికి గుండె సమస్యలు తక్కువగా ఉంటాయని తేలిందట! దీనికి కారణమేంటో మీకు తెలుసా? వారిలో వైన్ తాగే అలవాటు ఎక్కువగా ఉండడమే..!
6. ఈ పండ్లు ఎక్కువమందిలో ఉన్న చర్మ సమస్యలైన మొటిమలు, ముడతలను తగ్గిస్తాయి.
7. ద్రాక్ష పండ్లలోని పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది.
8. ద్రాక్ష పండ్లు మన శరీరంలోని ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ని తగ్గించే ప్రొటీన్లను విడుదల చేస్తాయి. ఈ ప్రొటీన్లు చర్మానికే కాదు.. కంటి చూపుకి కూడా ఎంతో మంచివి.
9. రెస్వేరెట్రోల్ శరీరం నుంచి మెదడుకి వెళ్లే రక్త సరఫరా వేగాన్ని పెంచుతుంది. దీని వల్ల మెదడుకి ఎక్కువ మొత్తంలో రక్తం అంది అది చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాదు.. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ని తొలగించడం ద్వారా వివిద వ్యాధులు రాకుండా అడ్డుకోవడంతో పాటు చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా చూస్తుంది. ఇంతకుముందు ఉన్నవాటిని తొలగిస్తుంది.
10. ద్రాక్షలోని యాంటీఆక్సిడెంట్లు మన కీళ్లకు సాగే గుణాన్ని, శక్తిని అందిస్తాయి. అందుకే ఇవి మోకాళ్ల సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచివి.
11. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు రక్తనాళాలను కాస్త వెడల్పుగా మార్చి రక్తప్రసరణ సులువుగా, సజావుగా సాగేలా చేస్తాయి.అంతేకాదు.. ఇవి గుండె, చర్మ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి.
అందానికీ ఉపయోగపడే ద్రాక్ష
ద్రాక్ష శాస్త్రీయ నామం వైటిస్ వినిఫెరా… దీన్ని స్నాక్స్, పండ్లు, స్వీట్స్.. ఇలా ఎందులో భాగంగా అయినా తీసుకోవచ్చు. టీవీ ముందు అలా కూర్చొని పాప్‌కార్న్‌లా తింటూ ఎంజాయ్ చేయవచ్చు. అయితే పాప్‌కార్న్ లేదా ఇతర స్వీట్ల వల్ల చర్మానికి ఎంతో హాని కలుగుతుంది. కానీ వాటిలా ఆరోగ్యానికి ఇది హాని చేయదు. ఇవి మన ఆరోగ్యానికి, అందానికి ఎంతో మంచివి.
ద్రాక్ష వల్ల మన చర్మానికి ఎలాంటి ప్రయోజనాలుంటాయంటే..
ఎండాకాలం వచ్చేస్తోంది. ఎండ మన చర్మాన్ని కమిలిపోయేలా చేస్తుంది. ఎండ నుంచి తప్పించుకున్నా కాలుష్యం బారినుంచైతే తప్పించుకోలేం. అది మన చర్మంపై ప్రభావం చూపి దాన్ని పాడయ్యేలా చేస్తుంది. ఎండ, కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకోవడానికి ద్రాక్ష చాలా బాగా పనిచేస్తుంది. ఎలాంటే..
1. కమిలిపోయిన చర్మాన్ని కాపాడుతుంది. – ద్రాక్షలో ఉన్న యాంటీఆక్సిడెంట్లు ఎండ బారిన పడి కమిలిపోయిన చర్మాన్ని తిరిగి మామూలుగా మారుస్తాయి. కేవలం అరగంటలోనే దీని ప్రభావం మనకు కనిపిస్తుంది.
2. వృద్ధాప్యఛాయలు తగ్గిస్తుంది – ద్రాక్షలో ఎక్కువగా ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై చక్కటి ప్రభావాన్ని చూపుతాయి. చర్మం ముడతలు పడడాన్ని తగ్గించి కాంతిమంతం చేస్తాయి. దీని కోసం ద్రాక్ష పండ్ల గుజ్జుతో ముఖాన్ని మసాజ్ చేసుకొని 15-20 నిమిషాల తర్వాత కడిగేసుకుంటే సరిపోతుంది.
3. మచ్చలను తగ్గిస్తుంది – ద్రాక్ష పండ్లలోని విటమిన్ సి మన చర్మంపై ఉన్న మచ్చలను క్రమంగా తగ్గించేందుకు తోడ్పడుతుంది. ఇందుకోసం ఒక బౌల్‌లో ద్రాక్ష పండ్లు, టేబుల్‌స్పూన్ పటిక బెల్లం, టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఒవెన్‌లో ఉంచి కాసేపు బేక్ చేయాలి. ఆపై బయటకు తీసి చల్లారాక చర్మానికి అప్లై చేసుకొని అరగంట పాటు ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మచ్చలు సులువుగా తగ్గిపోతాయి.
4. పిగ్మంటేషన్‌ని తగ్గిస్తుంది – కేవలం మచ్చలే కాదు.. ద్రాక్ష పిగ్మంటేషన్‌ని కూడా తగ్గిస్తుంది. ఇందులోని పాలీఫినాల్స్ చర్మాన్ని మొత్తం ఒకే రంగులో ఉండేలా చేస్తుంది. ఇందుకోసం ద్రాక్ష రసాన్ని ముఖానికి పట్టించి అరగంట పాటు ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవడం వల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది.
5. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది – మీ చర్మం మృదువుగా మారాలంటే కెమికల్స్ నిండిన క్రీములు రాయాల్సిన అవసరం కూడా లేదు. గ్రేప్‌సీడ్ ఆయిల్‌లో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది.. ఇది మన చర్మాన్ని ఎంతో మృదువుగా మారుస్తుంది. దీనికోసం ద్రాక్ష మిశ్రమంతో ముఖాన్ని నెమ్మదిగా స్క్రబ్ చేసుకొని అరగంట ఉంచుకొని కడిగేసుకుంటే సరి.. మొదటిసారిలోనే మీరు చక్కటి మార్పును గమనిస్తారు.
6. చర్మఛాయను పెంచుతుంది – కేవలం మచ్చలు తగ్గించడం మాత్రమే కాదు.. ద్రాక్ష పండ్లు మీ చర్మ ఛాయను పెంచుతాయి కూడా. వేసవిలో మీ చర్మం ట్యాన్‌కి గురై నల్లగా మారిపోతే నల్ల ద్రాక్షను ఉపయోగించి.. మీ మెరిసే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. ద్రాక్ష పండ్ల గుజ్జుతో పాటు ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. పావుగంట పాటు అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
7. జిడ్డుదనాన్ని తగ్గిస్తుంది – మన చర్మంలోని మలినాలను తొలగించడంతో పాటు మాయిశ్చరైజ్ కూడా చేస్తుంది ద్రాక్ష. ఇందులోని న్యూట్రియంట్లు చర్మంలో ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగించి అది తాజాగా కనిపించేలా చేస్తాయి. దీనికి టేబుల్ స్పూన్ చొప్పున ద్రాక్ష రసం, నిమ్మరసం, పుదీనా రసం కలిపి ముఖానికి అప్లై చేసుకొని పావుగంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత రోజ్‌వాటర్‌తో ముఖం తుడుచుకొని.. చన్నీళ్లతో కడుక్కోవాలి.
8. మొటిమలు, బ్లాక్‌హెడ్స్ తగ్గిస్తుంది – చర్మ సమస్యలన్నీ తొలగించే ద్రాక్ష మొటిమలను కూడా దూరం చేస్తుంది. మొటిమలు తగ్గించడం కోసం ద్రాక్ష గుజ్జు, చామంతి పూల రసం, చెరుకు రసం కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని పావుగంట ఉంచుకొని కడిగేసుకుంటే సరి.. ఇలా వారానికోసారి చేస్తూ ఉండాలి. ఇక బ్లాక్‌హెడ్స్ కోసం ద్రాక్ష పండ్ల గుజ్జును బ్లాక్‌హెడ్స్ ఉన్న భాగాల్లో అప్లై చేసుకొని పావుగంట పాటు ఉంచి అది ఆరిన తర్వాత నెమ్మదిగా తీసేస్తే సరిపోతుంది.
9. నల్లని వలయాలు తగ్గుతాయి – కళ్ల చుట్టూ నల్లని వలయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఈ సమస్య నుంచి మిమ్మల్ని తప్పించేందుకు ద్రాక్ష పండ్లు బాగా ఉపయోగపడతాయి. రోజూ రాత్రి పడుకునే ముందు గ్రేప్‌సీడ్ ఆయిల్‌ని మీ కళ్ల చుట్టూ అప్లై చేసుకోవడం వల్ల అలసిపోయిన కళ్లు రిలాక్స్ అవడంతో పాటు నిద్ర కూడా బాగా పడుతుంది. ఇది మీ నల్లని వలయాలను కూడా సులభంగా తొలగిస్తుంది.
జుట్టు ఆరోగ్యంగా ఉండేందుకూ ఉపయోగపడే ద్రాక్ష..
ద్రాక్షలో ఎక్కువగా ఉండేవి చక్కెర, నీళ్లు.. అందుకే చాలామంది దీన్ని తీసుకోవడం వల్ల క్యాలరీలు అందుతాయి తప్ప ఎలాంటి పోషకాలు అందవని అనుకుంటూ ఉంటారు. కానీ ఇది తప్పు. ద్రాక్షలో ఎన్నో రకాల యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు ఉంటాయి. ఇవి మీరు డీహైడ్రేషన్ కి గురైనప్పుడు మీ శరీరాన్ని తిరిగి మామూలుగా మార్చేందుకు చక్కటి ఎంపిక. మన చర్మంలో విడుదలయ్యే సహజ నూనెలను పోలి ఉండే గ్రేప్‌సీడ్ ఆయిల్‌ని ఉపయోగించడం వల్ల చర్మం, జుట్టు పొడిబారిపోకుండా కాపాడుకోవచ్చు. మన జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ద్రాక్ష పండ్లు ఎలా ఉపయోగపడతాయంటే..
1. జుట్టు శుభ్రం చేస్తుంది – అర కప్పు యాపిల్ సైడర్ వెనిగర్‌లో 20,30 ద్రాక్షపండ్లను వేసి కాసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత తడిజుట్టుకి దీన్ని అప్లై చేసుకొని పది నిమిషాలు అలాగే ఉంచాలి. లేదా జుట్టుకి గ్రేప్‌సీడ్ ఆయిల్ ని అప్లై చేసుకోవడం కూడా మంచిదే. వారానికోసారి ఈ నూనెతో మాడును మసాజ్ చేసుకోవాలి.
2. చుండ్రును తగ్గిస్తుంది – మన చర్మం మృతకణాలను తొలగించడానికి దాన్ని చుండ్రు రూపంలో వదులుతుంది. ఇది సహజమైన ప్రక్రియే.. కానీ మృత చర్మం ఎక్కువగా ఉండడం వల్ల చుండ్రు ఎక్కువగా తయారై సమస్యగా మారుతుంది. గ్రేప్‌సీడ్ ఆయిల్‌ని తరచూ వాడడం వల్ల ఇది మాడును మాయిశ్చరైజ్ చేస్తుంది. రక్తప్రసరణను పెంచుతుంది.
3. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది – ద్రాక్ష పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని తగ్గిస్తాయి. అందుకే గ్రేప్‌సీడ్ ఆయిల్ ని తలకు అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటే సరి. ఇలా చేయడం వల్ల జుట్టు తొందరగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు ఆరోగ్యంగా ఉండేలా చేసి వెంట్రుకలు మృదువుగా మారేలా చేస్తుంది. అంతేకాదు.. ఇందులోని లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ జుట్టు తెగిపోవడాన్ని, రాలిపోవడాన్ని అరికడతాయి.
గ్రేప్ డైట్ మీరూ పాటిస్తారా?
గ్రేప్ డైట్.. కేవలం ద్రాక్ష మాత్రమే తినే ఈ డైట్ గురించి వినడానికి విచిత్రంగా అనిపించినా దీన్ని ప్రయత్నించడంలో తప్పులేదు. మూడు రోజుల ఈ గ్రేప్ డైట్ ఎంతో పాపులరైంది. ఇది ఆరోగ్యానికి మంచిది. అవును.. ద్రాక్ష పండ్లను తినడం, దాని రసం తాగడం, ముఖానికి ద్రాక్ష గుజ్జుని, రసాన్ని అప్లై చేసుకోవడం వల్ల మన శరీరానికి, చర్మానికి అన్ని రకాల ప్రయోజనాలు అందుతాయి. దీన్ని నమ్మాలంతే.. ద్రాక్ష ద్వారా వివిధ వ్యాధులను తగ్గించడం 18వ శతాబ్దంలో పెద్ద ట్రెండ్. మనమూ దాన్ని పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ గ్రేప్ డైట్‌ని కనీసం సంవత్సరానికోసారి ట్రై చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి. ఈ మూడు రోజుల్లో కేవలం ద్రాక్షపండ్లని మాత్రం తీసుకోవాలి. ఈ మూడు రోజుల తర్వాత మీరెంతో శక్తిమంతంగా కనిపిస్తారు. మీ శరీరం మొత్తం డీటాక్సిఫికేషన్ కావడం వల్ల ముఖంలో మంచి మెరుపు కనిపిస్తుంది. ఈ డైట్ ఫాలో అయిన వాళ్లు డైట్ తర్వాత మృదువైన చర్మంతో పాటు సన్నని నడుము సొంతం చేసుకున్నామని చెబుతారు.
ఈ డైట్ పాటించడానికి రెండుమూడు రోజుల ముందు పండ్లు, కూరగాయలు తింటూ శరీరాన్ని డైట్ కోసం సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. డైట్ ప్రారంభించిన తర్వాత 2,3 కేజీల ద్రాక్ష పండ్లను తీసుకోవాల్సి ఉంటుంది. కావాలంటే మధ్యలో నీళ్లు, గ్రీన్‌టీ తాగవచ్చు. మొదటిరోజు కాస్త ఆకలిగా.. కళ్లు తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ఇది సహజమే. మీకు మరీ ఇబ్బందిగా అనిపిస్తే డాక్టర్‌ని సంప్రదించవచ్చు. ద్రాక్ష పండ్లలోని గింజల్లో కూడా ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని కూడా తినవచ్చు. అయితే మీరు మరీ బిజీగా ఉన్నరోజుల్లో మాత్రం ఈ డైట్‌ని పాటించకండి. ఎందుకంటే ఈ డైట్ పాటించడం వల్ల కాస్త శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే ఆకలి అయినప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే వీలుండేలా వీకెండ్స్‌లో లేదా ఏ పనీ లేనప్పుడు దీన్ని ఉపయోగించడం మంచిది. ఆఖరి రెండు రోజుల్లో కేవలం ద్రాక్ష పండ్లు మాత్రమే కాకుండా జ్యూస్ కూడా తీసుకోవాలి. ఈ మూడు రోజుల తర్వాత మీ కడుపు శుభ్రంగా మారుతుంది. మీ శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. మీ చర్మం మెరుస్తుంది. ఇది మిమ్మల్ని అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్ల నుంచి దూరం చేస్తుంది.
ఈ డైట్ ప్రయోజనాలు..
సాధారణంగా ఎక్కువమంది పది రోజుల పాటు ఈ గ్రేప్ క్లెన్సింగ్ డైట్‌ని పాటిస్తుంటారు. దీనివల్ల శరీరంలోని మలినాలు తొలగి ఆరోగ్యంగా తయారవడంతో పాటు బరువు కూడా తగ్గే వీలుంటుంది. అయితే ఈ డైట్ చేసే ముందు ఒకసారి మీ న్యూట్రిషనిస్ట్‌ని సంప్రదించడం మంచిది. ఈ ద్రాక్ష రసం తాగేటప్పుడు అందులో నిమ్మరసం, యాపిల్ సైడర్ వెనిగర్, చార్‌కోల్ పౌడర్ వంటివి జోడించవచ్చు. ఈ డైట్ చేయడం వల్ల ఎన్నో శారీరక, మానసిక మార్పులు వస్తాయి. వాటికి సిద్ధమై ఉండడం మంచిది.
ద్రాక్ష పండ్లలో రకాలు
ద్రాక్ష పండ్లను కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి పండిస్తున్నారు. ప్రస్తుతం ఇందులో దాదాపు పదివేల వరకూ రకాలు అందుబాటులో ఉన్నాయి. ఆకుపచ్చ, ఎరుపు, బంగారు, తెలుపు, నలుపు.. వంటి రంగుల్లో ఇవి పండుతున్నాయి. వీటిలో 70 శాతం ద్రాక్ష పండ్లు వైన్ ఇండస్ట్రీలో ఉపయోగపడతాయి. 1300 రకాల ద్రాక్ష పండ్లు పూర్తిగా వైన్ తయారీలోనే ఉపయోగపడతాయి. ద్రాక్ష పండ్లలో 20 రకాలు చాలా పాపులర్ అవేంటో.. వాటిలోని ప్రత్యేకతేంటో తెలుసుకుందాం.
1. క్యాబర్‌నెట్ ఫ్రాంక్ – ఇది ప్రపంచంలో ఎక్కువగా పండిస్తున్న ద్రాక్ష రకాల్లో ఒకటి. ఎరుపు రంగులో ఈ ద్రాక్ష తియ్యని రుచి కలిగి ఉంటుంది.
2. క్యాబర్‌నెట్ సావినాన్ – ఇవి ప్రపంచంలోనే ఎక్కువగా ఉపయోగించే ఎర్ర ద్రాక్ష. ఓసారి అనుకోకుండా క్యాబర్‌నెట్ ఫ్రాంక్, సావినాన్ బ్లాంక్ రకాల చెట్లు అంటు కట్టుకోవడం వల్ల ఇవి పుట్టుకొచ్చాయి. ఈ నల్లని పండ్లు బ్లాక్ కరంట్, బ్లాక్ బెర్రీస్ ల రుచిని పోలి ఉంటాయి.
3. కార్మెనెర్ – క్యాబర్‌నెట్ కుటుంబానికే చెందిన ద్రాక్ష పండ్లివి. ముదురు ఎరుపు రంగులో ఉండే ఈ పండ్లను వైన్ తయారీలో ఉపయోగిస్తారు. దీని రంగు, రుచి రెండూ అద్భుతంగా ఉండడం వల్ల ఈ ద్రాక్షను ఉపయోగించి చేసిన వైన్ ఖరీదు కాస్త ఎక్కువగానే ఉంటుంది. చెర్రీ, బెర్రీ, ప్లమ్‌ల రుచిని కలగలిపినట్లుగా ఈ బెర్రీ రుచి ఉంటుంది.
4. చార్డన్నొయ్ – ఇది చాలా మైల్డ్ రుచిని కలిగి ఉంటుంది. ఇది చాలా ఎక్కువగా పండే పాపులర్ రకం. తెలుపు రంగులో ఉండే ఈ ద్రాక్ష పుల్లగా ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రమే తియ్యని రుచిని కలిగి ఉంటాయి.
5. గ్రెనాచ్ – ఇవి ఎరుపు రంగు వైన్ కోసం పండించే నల్లని ద్రాక్ష. తియ్యని రుచి కలిగి ఉండేలా లేత రంగులో ఉండే ఈ ద్రాక్షను చాలా ఎక్కువ మంది ఇష్టపడతారు.
6. మాల్బెక్ – వైన్ కోసం ఉపయోగించే పర్పుల్ ద్రాక్ష పండ్లు ఇవి. బార్డాక్స్ వైన్‌లో ఉపయోగించే ద్రాక్ష పండ్లలో ఇదీ ఒకటి. ఈ ద్రాక్ష చాలా చక్కటి రుచిని కలిగి ఉంటుంది.
7. మెర్లాట్ – డార్క్ పర్పుల్ చర్మంలో ఉన్న నల్లని ద్రాక్ష పండ్లు ఇవి. ఇవి తాజా ఎరుపు రంగు ద్రాక్షలా తియ్యని రుచిని కలిగి ఉంటాయి.
8. మస్కట్ ఒట్టెనెల్ – ఈ తెల్ల ద్రాక్షను తియ్యని, డ్రై వైన్ తయారీకి ఉపయోగిస్తారు. చాలా లేత ఫ్లేవర్ ఉండే ఈ ద్రాక్ష పీచ్, ధనియాలను కలిపితే వచ్చే రుచిని అందిస్తుందట.
9. నెబ్బియోలో – ముదురు కెంపు రంగులో ఉండే ఈ ద్రాక్ష పండ్లు స్ట్రాంగ్ వైన్‌ని తయారుచేయడానికి బాగా ఉపయోగపడతాయి. ఈ పండ్లతో చేసిన వైన్‌ని కొన్ని రోజులు అలాగే ఉంచితే మరింత రుచిగా ఉంటుందట. అయితే రంగు తక్కువగా ఉంటుంది కాబట్టి రంగు ఎక్కువగా ఉండే ఇతర రకాలతో కలిపి దీనితో వైన్ తయారుచేస్తారట.
10. పినోటేజ్ – స్పార్క్‌లింగ్ వైన్ తయారీకి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఎరుపు రంగు బెర్రీల వాసనతో పాటు స్మోకీ రుచిని కలిగి ఉంటాయి ఈ పండ్లు.
11. పినోట్ గ్రిగియో – ఆరెంజ్ వైన్ తయారీలో ఉపయోగించే పదార్థాలీ ద్రాక్ష పండ్లు. సిట్రస్ వాసనతో, తియ్యని రుచితో ఉంటాయి ఈ పండ్లు..
12. పినోట్ నోయిర్ – అటు చెర్రీ, ఇటు స్ట్రాబెర్రీ రెండింటి రుచిని కలగలిపినట్లుంటాయి ఈ ద్రాక్షపండ్లు. మార్కెట్లో ఎక్కువగా లభ్యం కావడంతో పాటు వైన్ రూపంలోనూ అందుబాటులో ఉంటుంది.
13. రీస్లింగ్ – వీటిలో యాసిడ్ శాతం ఎక్కువగా ఉంటుంది. అయినా ఇవి తియ్యగానే ఉంటాయి.
14.. సావినాన్ బ్లాంక్ – ఈ ద్రాక్ష పండ్లు పసుపు రంగులో ఉంటాయి. సిట్రస్ వాసనతో ఉండే ఈ పండ్లు.. అడవి పండ్ల రుచిని కలిగి ఉంటాయి.
15. సెమిల్లాన్ – ఇవి బంగారు రంగులో ఉండే ద్రాక్ష పండ్లు. ఇవి డ్రై, స్వీట్ వైన్ తయారీలో ఉపయోగపడతాయి. కాస్త ఎక్కువగా కాల్చిన టోస్ట్ వాసనతో తేనె, నిమ్మ, గడ్డిల రుచిని కలగలిపి ఉంటాయి.
16. షిరాజ్ – ముదురు రంగులో ఉండే ఈ ద్రాక్ష పండ్లు వైన్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. బెర్రీల్లా వాసన వచ్చే ఈ ద్రాక్ష పండ్లు చెర్రీ, స్ట్రాబెర్రీల రుచితో ఉంటాయి.
17. టెంపరానిల్లో – మెత్తగా వెల్వెట్‌లా ఉండే ద్రాక్ష పండ్లివి.. బెర్రీ వాసనతో ఉన్నా.. వీటి రుచి మాత్రం అంతగా బాగోదట.
18. వియోనీర్ – చార్డోనాయ్, తెలుపు ద్రాక్షను కలిపితే ఇవి పుట్టుకొస్తాయి. సిట్రస్ వాసనతో రుచికరంగా ఉంటాయి.
19. జిన్‌ఫాండెల్ – క్రొయేషియాలో పెరిగే నలుపు రంగు ద్రాక్ష పండ్లివి. జెల్లీ రుచితో ఉండే ఈ పండ్లు బెర్రీ వాసనతో ఉంటాయి.
20. మూన్ డ్రాప్స్ – కాస్త పొడుగ్గా ఉండే నల్లని ద్రాక్ష ఇవి. లోపల గుజ్జు ఎక్కువగా ఉండే ఈ ద్రాక్ష రుచి కూడా బాగుంటుంది. తినడానికి గట్టిగా, క్రంచీగా నోరూరిస్తాయి ఇవి. తియ్యగా ఉండే ఇవి జెల్లీ రుచిని అందిస్తాయి.
21. కాంకార్డ్ – ఇవి తియ్యగా ఎంతో రుచిగా ఉంటాయి. పెద్దపెద్ద గింజలతో ఉండే ఈ ద్రాక్ష పండ్లు తొక్క సులువుగా తీయవచ్చు.
22. లెంబర్గర్ – ఈ పెద్ద ద్రాక్ష పండ్లు రుచిలో తియ్యగా ఉంటాయి. దీని తొక్క కూడా తీయవచ్చు. నీలి రంగు ద్రాక్షను వైన్ తయారీలో ఉపయోగిస్తారు.
23. స్వీట్ జుబ్లీ – పెద్దగా అండాకారంలో ఉండే ఈ ద్రాక్ష పండ్లు తియ్యగా నోరూరించేలా ఉంటాయి.
24. వేలియంట్ – ఇది కూడా కాంకర్డ్‌లాగే నోరూరిస్తుంది. తియ్యగా ఉండే ఈ ద్రాక్షలో గుజ్జు ఎక్కువగా ఉంటుంది.
25. షాంపేన్ – ఈ తరహా ద్రాక్ష పండ్లు చాలా చిన్నగా బఠానీ గింజ సైజులో ఉంటాయి. సున్నితంగా, తియ్యగా ఉండే ఈ ద్రాక్ష పండ్లు ఎంతో రుచిని అందిస్తాయి.
26. క్రింసన్ సీడ్‌లెస్ – తియ్యగా ఉండే ఈ ద్రాక్ష లేత ఇటుక రంగులో మెరుస్తుంటాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి కూడా.
27. క్యోహో – ఇవి చాలా పెద్దగా ఉంటాయి. పర్పుల్‌రంగులో ఉండే ఈ ద్రాక్ష గింజలను తినకూడదు. చర్మం కూడా గట్టిగా ఉంటుంది. ఈ ద్రాక్ష పండ్లు కూడా కాస్త వగరుగా ఉంటాయి. అయితే తొక్క తీస్తే లోపల గుజ్జు తియ్యగానే ఉంటుంది.
28. కాటన్ క్యాండీ – పీచు మిఠాయిలా తియ్యగా ఉంటాయి ఈ ద్రాక్షపండ్లు. ఆకుపచ్చ రంగులో తియ్యని రుచిగా అందిస్తాయి ఈ ద్రాక్ష పండ్లు.
29. గెవుర్జ్‌ట్రామైన్ – తెలుపు రంగు ద్రాక్షకు గులాబీ రంగు తొక్క ఉంటుంది. ఇది లోపల నుంచి క్లియర్‌గా గాజు గ్లాస్‌లో పోసిన నీళ్లలా కనిపిస్తుంది. చూస్తే ద్రాక్ష పండ్లు కాదేమో అనిపించేలా మృదువుగా ఉంటాయి.
30. మూన్ బాల్స్ – ఇవి పెద్దగా గుండ్రగా ఉండే హైబ్రిడ్ ద్రాక్ష పండ్లు. చర్మం గట్టిగా.. గుజ్జు తియ్యగా మృదువుగా ఉంటుంది.
31. సుల్తానా – చిన్నగా లేత ఆకుపచ్చ రంగులో అండాకారంలో ఉండే ద్రాక్ష పండ్లివి. వీటిలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎండబెట్టి కిస్‌మిస్ తయారుచేస్తారు.
32. ఫ్రై మస్కడీన్ – చెర్రీ టొమాటో సైజ్ లో ఉండే ఈ ద్రాక్ష పండ్లు బంగారు రంగులో తియ్యగా ఉంటాయి.
ఈ గ్రేప్ ఫేస్‌మాస్క్‌ని ప్రయత్నించండి.
చామంతి పూల రసం, చెరుకు రసం సమానపాళ్లలో తీసుకోవాలి. 8 నుంచి 10 నల్ల ద్రాక్షలను గుజ్జు చేసి ఆ గుజ్జును ఇందులో కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకొని పది నిమిషాల పాటు అలాగే ఉంచుకొని గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
హెయిర్ మాస్క్
8 నుంచి 10 ద్రాక్ష పండ్లు తీసుకొని వాటిని గుజ్జు చేసుకోవాలి. ఇందులో టేబుల్ స్పూన్ చొప్పున కొబ్బరి నూనె, జొజొబా ఆయిల్ వేసుకోవాలి. ఆపై తేనె, బాదం పప్పు పౌడర్‌ని కలుపుకోవాలి. దీన్ని తలలో కుదుళ్ల నుంచి అంచుల వరకూ రుద్దుకొని 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. తర్వాత వేడినీటితో తలస్నానం చేసి మామూలుగా ఆరబెట్టుకోవాలి. ఇలా వారానికోసారి చేస్తే మీ జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
ఆరోగ్యకరమైన చర్మం కోసం గ్రేప్ స్మూతీ
ముందుగా సీడ్‌లెస్ ఎర్ర లేదా నల్ల ద్రాక్ష పండ్లను తీసుకోవాలి. ఒక అరటి పండు, పావు కప్పు పాలు, పావు కప్పు పెరుగు తీసుకోవాలి. ముందుగా ద్రాక్ష, అరటి పండ్లను మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత పాలు, పెరుగు వేసుకొని మిక్సీ పట్టి తీసి ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.
మీ అందమైన మెరిసే జుట్టు కోసం.. చక్కటి షాంపూ బ్రాండ్లివే..!
సమంత మేకప్ సీక్రెట్లు తెలుసుకుందాం.. మనమూ సెలబ్రిటీ లుక్ పొందేద్దాం..!