తులసి (basil) మొక్కను మనం చాలా పవిత్రంగా భావిస్తాం. తెలుగునాట తులసి మొక్క లేని ఇల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. ఈ తులసి (tulasi) మొక్కకు ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. అందుకే రోజూ తులసి మొక్కకు పూజ చేస్తుంటారు తెలుగు మహిళలు. తులసి ఆధ్యాత్మికంగానే కాదు.. ఆరోగ్యపరంగానూ మనకు ఎంతో మేలు చేస్తుంది. అందుకే తులసి మొక్కకు ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం కల్పించారు.
చర్మ సౌందర్యానికి, కురుల అందం కాపాడుకోవడానికి తులసిని ఉపయోగిస్తారు. తులసి వల్ల ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయా? అని ఆశ్చర్యపోయేంతగా మనకు లాభాలను చేకూరుస్తుంది తులసి. మన దేశంలో రామ తులసి, కృష్ణ తులసి, వాన తులసి అని రకరకాల పేర్లతో తులసి మొక్కలున్నాయి. ఇవన్నీ వేర్వేరే అయినప్పటికీ అవి అందించే ప్రయోజనాలన్నీ ఒకేలా ఉంటాయి.
తులసి ఆకుల వల్ల చర్మానికి అందే ప్రయోజనాలు
జుట్టు ఆరోగ్యానికి తులసి ఆకులు
తులసి వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు
తులసిని ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే..
తులసికి వీరు దూరంగా ఉండాల్సిందే
తులసి ఆకుల్లో ఉండే పోషకాలు (Nutrients in Basil (Tulsi) Leaves)
ఆయుర్వేదంలో తులసికి (basil) చాలా ప్రాధాన్యముంది. ఇంట్లో సైతం కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు తులసి ఆకులను మందుగా వాడటం చూస్తూనే ఉంటాం. తులసి ఆకుల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. దీనిలో విటమిన్ కె, విటమిన్ ఎ, మాంగనీస్, మెగ్నీషియం, క్యాల్షియం, ఐరన్ వంటి ఆవశ్యకమైన పోషకాలు ఉంటాయి. వీటితో పాటు ఆరోగ్యానికి మేలు చేసే ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి.
రెండు గ్రాముల తాజా తులసి ఆకుల్లో విటమిన్ ఎ 3%, విటమిన్ కె 13%, క్యాల్షియం 0.5%, ఐరన్ 0.5%, మాంగనీస్ 1.5 % మేర లభిస్తాయి. అదే ఎండబెట్టిన తులసి ఆకుల్లో అయితే విటమిన్ ఎ 4%, విటమిన్ కె 43%, క్యాల్షియం 4%, ఐరన్ 5%, మాంగనీస్ 3 % మేర లభిస్తాయి. క్యాలరీల విషయానికి వస్తే తాజా తులసి ఆకుల్లో 0.6, ఎండబెట్టిన ఆకుల్లో 5 క్యాలరీలు లభిస్తాయి. అంటే తాజా తులసి ఆకులతో పోలిస్తే ఎండబెట్టిన ఆకుల్లో అధిక మొత్తంలో పోషకాలు లభిస్తాయి. ఇవే కాకుండా రైబోఫ్లేవిన్, థయమిన్, నియాసిన్, సోడియం, విటమిన్ సి, విటమిన్ ఇ మొదలైనవి కూడా లభిస్తాయి.
తులసి ఆకుల వల్ల చర్మానికి అందే ప్రయోజనాలు (Benefits Of Basil Leaves For Skin)
తులసి మొక్కలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేసి సౌందర్యాన్ని మరింత పెంచుతాయి.
- మొటిమలు రాకుండా చేస్తుంది (Avoid Acne): తులసి ఆకుల్లో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియా, ఫంగస్‌ను నాశనం చేసి వాటిని తగ్గిస్తాయి. కొన్ని తులసి ఆకులను రోజ్ వాటర్‌తో కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగితే సరిపోతుంది. ఈ ప్యాక్ మొటిమలను తగ్గించడంతో పాటు కొత్తవి రాకుండా చేస్తుంది.
- బ్లాక్ హెడ్స్ తొలగించడానికి (To Remove Blackhead): చర్మ రంధ్రాల్లో మురికి, జిడ్డు వంటివి చేరడం ద్వారా బ్లాక్ హెడ్స్ ఏర్పడతాయి. వీటిని అలాగే పట్టించుకోకుండా వదిలేస్తే మొటిమల సమస్యకు దారి తీస్తాయి. తులసిలో ఉన్న గుణాలు బ్లాక్ హెడ్స్‌ను తొలగిస్తాయి. దీని కోసం గుప్పెడు తులసి ఆకులను రెండుకప్పుల నీటిలో వేసి వేడి చేయాలి. ఆ తర్వాత ఈ నీటితో ముఖానికి ఆవిరి పట్టుకోవాలి. ఆ తర్వాత బ్లాక్ హెడ్ రిమూవింగ్ టూల్‌తో బ్లాక్ హెడ్స్ తొలగించుకోవాలి. ఇదే చిట్కాను వైట్ హెడ్స్ తొలగించడానికి కూడా పాటించవచ్చు.
- స్కిన్ టోన్ మెరుగుపరుస్తుంది (Improves Skin Tone): కాలుష్యం, సూర్యరశ్మి ప్రభావం కారణంగా చర్మం కాస్త డార్క్‌గా మారుతుంది. తులసి ఆకులతో తయారుచేసిన ఫేస్ ప్యాక్ వేసుకోవడం ద్వారా స్కిన్ టోన్ మెరుగుపడేలా చేసుకోవచ్చు. దీని కోసం కొన్ని తులసి ఆకులను మెత్తగా నూరాలి. ఈ పేస్ట్‌కు కొద్దిగా శెనగపిండి కలిపి మిశ్రమంగా చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. బాగా ఆరిన తర్వాత శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ ప్యాక్‌ను తరచూ అప్లై చేసుకోవడం ద్వారా స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. దీని కోసం మరో చిట్కాను సైతం పాటించవచ్చు. తులసి ఆకుల పేస్ట్‌కు చెంచా చందనం పొడి, చెంచా నిమ్మరసం కలిపి మిశ్రమంగా చేయాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
- చర్మ సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది (Reduce Skin Tone): ఎగ్జిమా వంటి చర్మ సంబంధిత సమస్యలను తులసి ఆకులతో తగ్గించుకోవచ్చు. దురద, మంట, పొక్కులు, చర్మం ఎర్రగా మారడం వంటివి ఎగ్జిమా లక్షణాలు. భుజం, మెడ, ముఖం, చేతులపై ఇవి కనిపిస్తాయి. తులసి ఆకులతో ఈ సమస్యను సులభంగా తగ్గించుకోవచ్చు. తులసిలో ఉన్న ఉర్సోలిక్ ఆమ్లం దురదను తగ్గిస్తుంది. తులసిలో ఉన్న యాంటీ ఇన్ఫ్లమేషన్ గుణాలు మంటను తగ్గిస్తాయి. దీని కోసం తులసి ఆకులు (Basil Leaves), పచ్చి పసుపుకొమ్ముల మిశ్రమాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే గుప్పెడు తులసి ఆకులను పేస్ట్‌గా తయారుచేయాలి. దీనికి టేబుల్ స్పూన్ పచ్చి పసుపు కొమ్ము పేస్ట్‌ను కూడా జోడించాలి. ఈ రెండింటిని బాగా కలిపి దురద, మంట, పొక్కులు ఉన్న చోట ఈ మిశ్రమాన్ని రాసి అరగంట తర్వాత శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఈ చిట్కాను తరచూ పాటించడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
- చర్మం ముడతలు పడకుండా (Prevents Wrinkle): తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ ప్రభావం నుంచి చర్మాన్ని రక్షించి ముడతలు రాకుండా కాపాడతాయి. దీని కోసం తులసి ఆకులతో ప్రత్యేకంగా టోనర్ తయారుచేసుకోవాల్సి ఉంటుంది. గుప్పెడు తులసి ఆకులను సరిపడినంత నీటిలో వేసి ఐదు నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత ఈ నీటిని చల్లారబెట్టి వడపోయాలి. దీనిలో కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి బాటిల్లో పోయాలి. ఈ తులసి టోనర్లో దూదిని ముంచి దాంతో ముఖాన్ని తుడుచుకోవాలి. రోజూ ఇలా చేయడం ద్వారా ముఖం ముడతలు పడకుండా చూసుకోవచ్చు. చర్మం ముడతలు పడకుండా ఉండటానికి మరో చిట్కాను సైతం పాటించవచ్చు. పది నుంచి పదిహేను తులసి ఆకులను పేస్ట్‌లా తయారుచేసి కోడిగుడ్డు తెల్లసొనలో వేసి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకొంటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఈ చిట్కాలను చర్మాన్ని క్లెన్సింగ్ చేసుకోవడానికి కూడా వాడొచ్చు.
సౌందర్యాన్ని సంరక్షించుకోవడానికి ఆముదాన్ని ఎలా వాడాలో ఇక్కడ చదవండి
జుట్టు ఆరోగ్యానికి తులసి ఆకులు (Benefits Of Basil (Tulsi) Leaves For Hair)
తులసిలో ఉన్న ఔషధ గుణాలు చర్మ ఆరోగ్యానికి ఏవిధంగా మేలు చేస్తాయో కురుల ఆరోగ్యానికి కూడా అంతే మంచిని చేస్తాయి. అసలు తులసి ఆకుల వల్ల మనకు ఏం మేలు జరుగుతుందో చూద్దాం.
- డాండ్రఫ్ తగ్గిస్తుంది (Reduces Dandruff): చుండ్రు తగ్గించుకోవడానికి ఎన్ని రకాల ఉత్పత్తులు వాడినా.. అది మళ్లీ మళ్లీ వేధిస్తూనే ఉంటుంది. తులసి ఉపయోగించడం ద్వారా శాశ్వత పరిష్కారం పొందవచ్చు. రోజూ తలకు రాసుకోవడానికి మీరు ఉపయోగించే నూనెలో కొద్దిగా తులసి నూనె కలపాలి. ఈ నూనెతో రోజూ తలకు మర్దన చేసుకొంటూ ఉండాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల చుండ్రు సమస్య తగ్గిపోతుంది.
- తులసిలో చుండ్రు రావడానికి కారణమైన నాలుగు రకాల ఫంగస్‌లను సంహరించే గుణాలున్నాయి. ఇవి చుండ్రు, మంటను తగ్గిస్తాయి. ఈ నూనెతో మర్దన చేసుకోవడం వల్లకు కుదుళ్లకు రక్త సరఫరా చక్కగా జరుగుతుంది. ఫలితంగా జుట్టుకు కావాల్సిన పోషణ అంది ఆరోగ్యంగా తయారవుతుంది.
- జుట్టు పెరిగేలా చేస్తుంది (Improves Hair Growth): తులసి ఆకుల్లో కురుల పెరుగుదలకు అవసరమైన పోషకాలున్నాయి. ఇవి కుదుళ్లకు పోషణ ఇచ్చి జుట్టు పొడవుగా అయ్యేలా చేస్తాయి. అంతేకాదు.. రాలిన వెంట్రుకల స్థానంలో కొత్త వెంట్రుకలు వచ్చేలా చేస్తాయి. ఈ ఫలితాన్ని పొందడానికి తులసి ఆకులను కచ్చాపచ్చాగా నూరి దాన్ని.. రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని తలకు రాసుకొని మర్దన చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఈ చిట్కాను వారానికి మూడుసార్లు పాటించడం ద్వారా మంచి ఫలితాన్నిపొందవచ్చు.
- స్కాల్ప్ దురదను తగ్గిస్తుంది(Reduces Itchiness In Scalp): తులసి ఆకులతో పాటించే ఈ చిన్నచిట్కా ద్వారా దురద సమస్య తగ్గుముఖం పడుతుంది. తులసి ఆకులను మెత్తటి పేస్ట్‌లా తయారు చేసి.. దాన్ని కొద్దిగా నూనెలో కలిపి హెయిర ప్యాక్‌లా వేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే తల దురద పెట్టడం మానేస్తుంది. వారానికి రెండు నుంచి మూడుసార్లు.. ఈ చిట్కాను పాటించడం ద్వారా తల దురద తగ్గడంతో పాటు జుట్టు కూడా ఒత్తుగా మారుతుంది.
- జుట్టు తెల్లబడకుండా చేస్తుంది (Prevents Hair Whitening): తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేయాలి. ఈ పొడిని ఉసిరి పొడితో కలిపి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మిశ్రమాన్ని వడపోయాలి. వడపోసిన నీటితో తలను తడుపుకోవాలి. ఇలా చేయడం వల్ల కురులు నల్లగా తయారవుతాయి.
తలస్నానం ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.
తులసి వల్ల కలిగే ఆరోగ్యపరమైన ప్రయోజనాలు (Health Benefits Of Basil Leaves)
తులసికి ఆయుర్వేదంలో ప్రత్యేకమైన స్థానం ఉందని మనం ముందుగానే చెప్పుకొన్నాం. తులసి నయం చేయలేని సమస్య అంటూ ఏదీ లేదనడం అతిశయోక్తి అవుతుందేమో కానీ.. చాలా సమస్యలకు తులసి చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. జలుబు, దగ్గులాంటి చిన్నపాటి సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తులసిని ఔషధంగా ఉపయోగించవచ్చు. ఆశ్చర్యంగా అనిపిస్తోంది కదా.. అసలు తులసి ఎలాంటి వ్యాధులను నయం చేయగలుగుతుంది? మనకు ఆరోగ్యాన్ని ఎలా ప్రసాదిస్తుందో తెలుసుకొందాం.
డిప్రెషన్ తగ్గిస్తుంది (Reduces Depression):
ఇటీవలి కాలంలో ప్రతి చిన్న విషయానికి కుంగుబాటుకు లోనుకావడం పరిపాటిగా మారిపోయింది. ఉద్యోగం, కుటుంబ బాధ్యతలు, బంధంలో కలతలు, చదువుల ఒత్తిడి ఇలా ఏదైనా కారణం కావచ్చు. మానసికంగా కుంగుబాటుకు గురవుతున్న వారు తులసి ఆకులు (basil leaves) తినడం ద్వారా మానసిక పరిస్థితిని మెరుగుపరచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఇది ఒత్తిడిని కలిగించే హార్మోన్ల విడుదలను నియంత్రిస్తుంది. అందుకే తులసిని యాంటీ డిప్రసెంట్ అని పిలుస్తారు.
నోటి దుర్వాసన తగ్గిస్తుంది (Removes Oral Odor):
నోటి దుర్వాసన సమస్యతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. నోరు దుర్వాసన రాకుండా ఉండటానికి మౌత్ వాష్ వాడుతుంటారు. దీనికి బదులుగా తులసి ఆకులను వాడటం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు. దీని కోసం కొన్ని తులసి ఆకులను నమలడం ద్వారా నోటి దుర్వాసనను తగ్గించుకోవచ్చు. తులసి ఆకులు దంతాల ఆరోగ్యాన్ని నాశనం చేసే క్రిములు, బ్యాక్టీరియా వంటి వాటిని సంహరిస్తాయి. ఫలితంగా దంతాలు గట్టిగా ఉంటాయి.
బ్లడ్ షుగర్ తగ్గిస్తుంది (Reduces Blood Sugar Level):
టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడేవారు తులసి ఆకుల రసాన్ని తాగడం వల్ల రక్తంలో షుగర్ స్థాయిని తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తులసిలో ఉన్న సపోనిన్స్, ట్రెటెర్పిన్స్, ప్లేవనాయిడ్స్ రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గిస్తాయి. ఈ విషయంలో టైప్ 2 డయాబెటిస్‌తో బాధపడుతున్నవారు కాస్త జాగ్రత్త పాటించాల్సిందే. మీ వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకొని దానికి తగినట్లుగా ఇన్సులిన్ మోతాదును మార్చుకోవాల్సి ఉంటుంది.
ఒత్తిడిని తగ్గిస్తుంది (Reduces Stress):
తులసిలో ఉండే అడాప్టోజెన్ (adaptogen) యాంటీ స్ట్రెస్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని కలిగించే కార్టిసోల్ విడుదలను నియంత్రిస్తుంది. దీని ఫలితంగా ఒత్తిడిని కూడా అధిగమించగలుగుతాం. మానసికపరమైన ఒత్తిడి మాత్రమే కాకుండా శారీరక, భావోద్వేగపరమైన ఒత్తిడిని సైతం అడాప్టోజెన్ తగ్గిస్తుంది.
జలుబు తగ్గుతుంది (Reduces Cold):
ఎప్పుడైనా జలుబు చేస్తే మన తాతయ్యో.. నాన్నమ్మో ‘రెండు తులసాకులు నములు.. అదే తగ్గిపోతుందని’ చెబుతూ ఉంటారు. ‘ఇంకా ఏ కాలంలో ఉన్నారం’టూ వారి మాటలను మనం కొట్టిపారేస్తుంటాం. కానీ ఈ చిట్కా జలుబును తగ్గించడానికి బాగా పనిచేస్తుంది.
జ్వరం తగ్గడానికి (Helps At The Time Of Fever):
తులసి ఆకులు (Basil Leaves) జ్వరానికి మందుగానూ పనిచేస్తాయి. జ్వరంగా ఉన్నప్పుడు తులసి ఆకులతో చేసిన టీ తాగడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మరి తులసి టీ ఎలా తయారుచేయాలి? కప్పు నీటిలో తులసి ఆకులను వేసి బాగా మరిగించి వడపోస్తే సరిపోతుంది. మరికొన్ని రోజుల్లో వర్షాకాలం మొదలవబోతోంది కాబట్టి ఈ చిట్కా ఆ సమయంలో బాగా పనిచేస్తుంది.
తలనొప్పి (To Get Rid Of Headache):
తలనొప్పి వచ్చినప్పుడు ట్యాబ్లెట్ వేసుకొని దాన్నుంచి ఉపశమనం పొందేందుకు మనం ప్రయత్నిస్తుంటాం. అయితే ఈ సారి ఎప్పుడైనా మీకు తలనొప్పి వస్తే మాత్రలు వేసుకోవడానికి బదులుగా తులసి టీ తాగండి. తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి ఆకుల రసం తాగినా తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా (Helps Solve Digestive Problems):
జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేసినప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. అయితే ఇటీవలి కాలంలో జీర్ణ సంబంధమైన సమస్యలతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం, సమయానికి తినకపోవడం, తినే ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం.. వంటి కారణాల వల్ల ఈ సమస్య బారిన పడుతున్నారు. ఈ సమస్యకు తులసి ఆకులు మంచి పరిష్కారాన్ని అందిస్తాయి. తులసి ఆకులను తినడం వల్ల పేగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని వల్ల జీర్ణమైన ఆహారం శరీరానికి పూర్తిగా అందుతుంది.
ఎప్పుడైనా కడుపు నొప్పి వచ్చినా లేదా కడుపు ఉబ్బరంగా అనిపించినా.. రెండో మూడో తులసి ఆకులు తినడం వల్ల ఈ సమస్య తగ్గుముఖం పడుతుంది. తులసి ఆకులు (Tulsi) ఆహారం సులభంగా జీర్ణమవడానికి కూడా తోడ్పడతాయి. అలాగే ఎసిడిటీ సమస్యను సైతం తగ్గిస్తాయి.
అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది (Control Blood Pressure):
తులసి ఆకులు తినడం లేదా తులసి రసం తాగడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే యుగెనాల్ (eugenol) అనే రసాయనం రక్తనాళాలను సంకోచింపచేసి వాటిని నియంత్రిస్తుంది. దీని వల్ల హైబీపీ తగ్గుతుంది. రోజుకు ఒకట్రెండు ఆకులు తినడం ద్వారా ఈ ఫలితాన్ని పొందవచ్చు.
మతిమరుపు పోగొడుతుంది (Reduce The Problem Of Forgetfullness):
వయసు పెరిగే కొద్దీ కొన్ని విషయాలను మరచిపోవడం సహజమే. ఈ సమస్యనే డెమెన్షియా అని పిలుస్తారు. అయితే తులసి ఎస్సెన్షియల్ ఆయిల్ ఉపయోగించడం ద్వారా మతిమరుపును తగ్గించుకోవచ్చు. ఇది మతిమరుపును పూర్తిగా తగ్గించలేదు కానీ జ్ఞాపకశక్తి మెరుగుపడేలా చేస్తుంది. దీని కోసం తులసి ఎస్సెన్షియల్ ఆయిల్‌ను ఎయిర్ డిఫ్యూషర్లో వేస్తే సరిపోతుంది. లేదా తులసి టీ తాగినా మంచి ఫలితం కనిపిస్తుంది.
కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది (Reduces Cholesterol):
మన ఆరోగ్యానికి అత్యంత హాని చేసే వాటిలో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. దీని వల్ల గుండె జబ్బులు, ఊబకాయం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. తులసి ఆకులు (Basil Leaves)తినడం ద్వారా శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులు తగ్గినట్టు వైద్యులు గుర్తించారు. కుందేళ్లపై చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. తులసి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలస్ట్రాల్‌ను పెంచుతుంది.
నొప్పి, వాపు తగ్గిస్తుంది (Reduces ain & Swelling):
తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. దీనిలో యుకలిప్టోల్ అనే రసాయనం ఉంటుంది. ఇది నొప్పిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే వాపును కూడా తగ్గించి ప్రభావిత భాగంలో రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చూస్తుంది. ఈ ఫలితాన్ని పొందడానికి ఒక కప్పు తులసి టీ తాగితే సరిపోతుంది. అలాగే తులసి ఆకులను మెత్తగా నూరి ప్రభావిత భాగంలో కట్టుగా కట్టుకొన్నా ఫలితం కనిపిస్తుంది.
క్యాన్సర్ నివారిణిగా (Prevents Cancer):
తులసిలో రేడియో ప్రొటెక్టివ్ గుణాలుంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను సంహరిస్తాయి. తులసిలో ఉండే యుగెనాల్, ఇతర ఫైటో కెమికల్స్ క్యాన్సర్ కణాలపై పోరాడతాయి. ఇది వైద్య పరిశోధనల్లో సైతం రుజువైంది. తులసి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల శరీరంలో క్యాన్సర్ కారకమైన ఎంజైమ్‌లు తగ్గినట్టు గుర్తించారు. ముఖ్యంగా పాంక్రియాటిక్ (క్లోమ) క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ కణాల సంఖ్య తగ్గినట్టు గుర్తించారు.
ఎసిడిటీ (Useful During Acidity):
కడుపులో మంట లేదా ఎసిడిటీకి సైతం దీన్ని మందుగా ఉపయోగించవచ్చు. కొన్ని తులసి ఆకులను నమలడం ద్వారా ఎసిడిటీ తగ్గుముఖం పడుతుంది. లేదా మరో చిట్కాను సైతం పాటించవచ్చు. దీని కోసం కప్పు నీటిలో మూడు నుంచి నాలుగు తులసి ఆకులు (Tulsi) వేసి కొన్ని నిమిషాల పాటు అలా వదిలేయాలి. అప్పుడప్పుడూ ఈ నీటిని తాగడం ద్వారా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. తులసి గింజల్లో యాంటీ అల్సర్ గుణాలుంటాయి. ఇవి జీర్ణాశయంలో విడుదలయ్యే ఆమ్ల ఉత్పత్తిని నియంత్రిస్తాయి.
మట్టికుండ వల్ల మనకు కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఇవే
తులసిని ఆహారంలో ఎలా భాగం చేసుకోవాలంటే.. (How To Consume Basil Leaves)
- పరగడుపున కొన్ని తులసి ఆకులను నమలడం ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుకోవచ్చు.
- తులసితో టీ తయారుచేసుకొని తాగవచ్చు. ఈ తులసి టీని ఎలా తయారు చేసుకోవాలంటే.. గిన్నెలో మూడు కప్పుల నీరు పోసి స్టవ్ మీద పెట్టాలి. నీరు వేడెక్కిన తర్వాత అరటీస్పూన్ అల్లం, కొన్ని తులసి ఆకులు, పావు టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ మీద నుంచి దింపి ఐదు చుక్కల తేనె, సరిపడినంత నిమ్మరసం వేస్తే తులసి టీ తయారవుతుంది.
- కూరల్లో తులసి ఆకులను సన్నగా కోసి వేసుకొని ప్రత్యేకమైన ఫ్లేవర్ యాడ్ చేసుకొని తినొచ్చు.
- కూరల్లో మాత్రమే కాదు.. వెజిటబుల్ సలాడ్, ఫ్రూట్ సలాడ్‌లోనూ వీటిని భాగం చేసుకోవచ్చు.
తులసికి వీరు దూరంగా ఉండాల్సిందే (Who Should Stay Away From Basil Leaves)
గర్భవతులు (Pregnant Women):
గర్భం దాల్చినపుడు తులసి ఆకులను తినడం, తులసి టీ తాగడం వంటివి చేయకపోవడమే మంచిది. జంతువుల్లో జరిపిన అధ్యయనం ప్రకారం తులసి ఆకుల్లోని గుణాలు ఫలదీకరణం చెందిన అండాన్ని గర్భాశయం గోడలకు అతుక్కోకుండా చేస్తాయి. ఇది అంత మంచి విషయం కాదు. అలాగే గర్భధారణ సమయం పూర్తి కాకముందే ప్రసవం జరిగే అవకాశాలూ లేకపోలేదు. అయితే ఇవన్నీ జంతువులపై జరిగిన పరిశోధనల్లో మాత్రమే జరిగాయి. మనుషుల్లో ఎంత వరకూ జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు. అయినప్పటికీ తులసి ఆకులకు గర్భిణిలు దూరంగా ఉండటమే మంచిది.
పాలిచ్చే తల్లులు (Those o Are Breastfeeding):
తులసి ఆకులు (Tulsi leaves) తీసుకోవడం వల్ల పాలిచ్చే తల్లుల్లో ఏమైనా దుష్ప్రభావాలు కలుగుతాయేమో అనేదానిపై స్పష్టత లేనప్పటికీ తులసి ఆకులు, తులసి ఎస్సెన్షియల్ నూనెకు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
హైపో థైరాయిడిజం (Hypothyroidism/Hypothyroidism):
థైరాక్సిన్ అనే హార్మోన్ తక్కువ అవడం వల్ల హైపో థైరాయిడిజం సమస్య వస్తుంది. తులసి ఈ థైరాక్సిన్ స్థాయిని మరింత తగ్గించేస్తుంది. దీని వల్ల హైపో థైరాయిడిజం సమస్య మరింత తీవ్రమవుతుంది.
సర్జరీ అయినవాళ్లు (Before Surgery): తులసి రక్తాన్ని నెమ్మదిగా గడ్డ కట్టేలా చేస్తుంది. అందుకే గాయాలైనవారు, సర్జరీ చేసుకొన్నవారు తులసికి దూరంగా ఉండటం మంచిది. ఈ సమయంలో తులసిని తీసుకోవడం వల్ల మరింత ఎక్కువగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. బ్లీడింగ్ డిజార్డర్స్ ఉన్నవారు కూడా తులసిని ఆహారంలో భాగంగా చేసుకోకపోవడమే మంచిది.
లోబీపీ ఉన్నవారు: తులసిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును బాగా తగ్గిస్తుంది. కాబట్టి లోబీపీ ఉన్నవారు తులసికి దూరంగా ఉండాల్సిందే.
తులసి వల్ల కలిగే దుష్పలితాలు (Side Effects Of Basil Leaves):
- తులసిని ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల రక్తం పలుచగా తయారవుతుంది. కాబట్టి యాంటీ క్లాటింగ్ మెడిసిన్ తీసుకొంటున్నవారు తులసిని ఆహారంలో భాగం చేసుకోకూడదు.
- మధుమేహంతో బాధపడేవారు తులసిని ఎక్కువగా తిన్నట్లయితే హైపోగ్లైసీమియా సమస్యకు దారితీయవచ్చు. ఇది రక్తంలో బ్లడ్ షుగర్ స్థాయులను మరీ ఎక్కువగా తగ్గించే అవకాశాలూ లేకపోలేదు. దీని వల్ల తీవ్రమైన అనారోగ్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.
- గర్భం ధరించినవారు తులసిని ఆహారంగా తీసుకొంటే తల్లీబిడ్డలిద్దరి ఆరోగ్యానికి ప్రమాదం ఏర్పడవచ్చు.
- కొన్ని రకాల ఔషధాలు వాడేవారు తులసిని తినడం వల్ల తీవ్రమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు. కాబట్టి తులసిని ఆహారంలో భాగం చేసుకోవాలనుకొనేవారు ముందుగా వైద్యులను సంప్రదించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవడం మంచిది.
- పురుషులు తులసి ఆకులను ఎక్కువగా తినడం వల్ల వారిలో స్పెర్మ్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది.
తరచూ అడిగే ప్రశ్నలు (FAQ’s):
1. రోజుకి ఎన్ని తులసి ఆకులు తినాలి?
ఆయుర్వేదం ప్రకారం రోజూ పరగడుపునే 3 నుంచి 5 తులసి ఆకులు (Tulsi Leaves) తినవచ్చు. రోజూ ఇలా చేయడం ద్వారా పిత్త, వాత, కఫ దోషాలను నయం చేసుకోవచ్చు. అయితే తులసిని ఎంత మోతాదులో తీసుకోవచ్చనే విషయం వయసు, ఆరోగ్యం వంటి వాటిపై ఆధారపడి ఉంటుంది.
2. ఎక్కువ మొత్తంలో తులసి ఆకులను తీసుకోవడం వల్ల.. ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయా?
ఏదైనా పరిమితుల్లో తీసుకొన్నంత వరకే మనకు ప్రయోజనాన్ని అందిస్తుంది. ఆ పరిమితిని దాటితే దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సిందే. ఈ విషయం తులసికి కూడా వర్తిస్తుంది. తులసిని అధికమొత్తంలో తీసుకోవడం వల్ల రక్తపోటు, బ్లడ్ షుగర్ బాగా తగ్గిపోతాయి. రక్తం పలచగా తయారవుతుంది. కొన్ని సందర్భాల్లో వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే రోజుకి మూడు నుంచి ఐదు ఆకులు చొప్పున ఆరువారాల వరకు తులసి ఆకులు తింటే సరిపోతుంది. అంతకుమించి తింటే అనారోగ్యం పాలవ్వాల్సి ఉంటుంది.
3. గర్భిణులు తులసి ఆకులను తినవచ్చా?
గర్భిణులు తులసి ఆకులను ఆహారంగా తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే తులసి ఆకులను తినడం వల్ల గర్భిణులు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా తులసి ఆకులు ఎక్కువ మోతాదులో తినడం వల్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల నెలలు నిండకుండానే బిడ్డకు జన్మనిచ్చే అవకాశం ఉంది. గర్భం దాల్చడానికి ప్రయత్నించేవారు సైతం తులసి ఆకులను తినడం, తులసి టీ తాగడం లాంటివి చేయకూడుదు. ఎందుకంటే ఇది ఇన్ఫెర్టిలిటీకి దారితీస్తుంది.
4. తులసి బ్లడ్ ప్రెజర్, బ్లడ్ షుగర్ రెండింటినీ తగ్గిస్తుందా?
నిజంగానే తగ్గిస్తుంది. తులసిని తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కర స్థాయిలు కూడా తగ్గుతాయి. అయితే ఈ విషయంలో వైద్యులను సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దానికి తగినట్లుగా మందులను సైతం మార్చుకోవాల్సి ఉంటుంది.
5. బరువు తగ్గడానికి తులసి ఉపయోగపడుతుందా?
బరువు తగ్గాలని ప్రయత్నించేవారు తులసి ఆకులను తినడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. తులసి మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. దీని వల్ల శరీరంలో అధికమొత్తంలో చేరిన క్యాలరీలు ఖర్చవడం ప్రారంభిస్తాయి. ఆహారాన్ని సులభంగా జీర్ణమయ్యేలా తులసి చేస్తుయి. బరువు తగ్గాలనుకొనేవారు పరగడుపున తులసి ఆకులు (Tulsi Leaves) తినడం లేదా తులసి టీ తాగడం ద్వారా మంచి ఫలితం పొందవచ్చు.
Images: Shutterstock