నిత్యజీవితంలో మనం రోజూ బయట తిరగాల్సి వస్తుంది. ఆఫీస్‌లకు, స్కూళ్లకు, కాలేజీలకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే రోజంతా అలా బయట ఉన్నప్పుడు అక్కడి టాయిలెట్‌ని (toilet) కూడా ఉపయోగించాల్సిన అవసరం తప్పనిసరిగా ఏర్పడుతుంది. దీంతో పాటు వివిధ ట్రిప్స్‌కి వెళ్లినప్పుడు, ఏదైనా ప్రదేశానికి పని మీద వెళ్లినప్పుడు అక్కడి పబ్లిక్ టాయిలెట్స్‌ని (public toilet) ఉపయోగించాల్సిన అవసరం కూడా ఉంటుంది.
అయితే వీటిని ఉపయోగించే ముందు మనల్ని రెండు విషయాలు భయపెడతాయి. ఒకటి అక్కడ టాయిలెట్‌కి వెళ్లడం మనకు ఆరోగ్యకరమా? కాదా? అని. అంటే ఆ టాయిలెట్ శుభ్రంగా ఉందా? లేదా? అన్నది ఒక సందేహం. రెండోది అక్కడి టాయిలెట్ వాసనొస్తుందేమో అని. సాధారణంగా చాలా వరకూ టాయిలెట్స్ పైకి శుభ్రంగా వాసన లేకుండా కనిపించినా.. వాటిలో చాలా క్రిములు దాగి ఉంటాయి. అందుకే పబ్లిక్ టాయిలెట్.. ఆ మాటకొస్తే మీ ఆఫీస్ లేదా కాలేజీ టాయిలెట్ ఉపయోగించే ముందు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటంటే..
1. హ్యాండిల్‌ని పట్టుకోకండి.
సాధారణంగా మనం టాయిలెట్ డోర్ తీయడానికి హ్యాండిల్ పట్టుకొని లాగుతూ ఉంటాం. అయితే ఈ హ్యాండిల్ మీద చాలా క్రిములుంటాయి. కేవలం పబ్లిక్ టాయిలెట్స్ మాత్రమే కాదు.. ఆఫీసులు, పెద్ద పెద్ద రెస్టరంట్లు, హోటల్లలోనూ టాయిలెట్‌ని శుభ్రం చేస్తారేమో కానీ.. ఈ హ్యాండిల్స్‌ని మాత్రం ఎవరూ శుభ్రం చేయరు. దీంతో ఆయా ప్రదేశాల్లో క్రిములు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీలైనంత వరకూ ఈ హ్యాండిల్స్ పట్టుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. ఒకవేళ పట్టుకోవాల్సి వస్తే టిష్యూతో పట్టుకోవడం మంచిది.
2. కాస్త శుభ్రమైనవి ఎంచుకోండి..
షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు.. ఇలాంటి చోట్ల టాయిలెట్స్ చూడడానికి కాస్త శుభ్రంగా కనిపిస్తాయేమో కానీ.. అవి అంత శుభ్రంగా ఏమీ ఉండవు. వాటిలో చాలా క్రిములు దాగి ఉంటాయి. కానీ మనకు వేరే ఏ అవకాశం లేదు కాబట్టి.. ఉన్నవాటిలో మీకు కాస్త శుభ్రంగా కనిపించేదాన్ని ఎంచుకోవడం మంచిది.
3. కూర్చునేముందు ఫ్లష్ చేయండి..
మీరు వెస్ట్రన్ టాయిలెట్‌ను ఉపయోగిస్తుంటే.. కూర్చునే ముందు ఫ్లష్ చేయడం మర్చిపోవద్దు. దీనివల్ల మీకంటే ముందు ఆ టాయిలెట్ సీట్ పై కూర్చున్న వ్యక్తి శరీరం ద్వారా.. అక్కడికి చేరిన క్రిములు కొంతవరకైనా తొలగిపోయే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకూ బయటకు వెళ్లినప్పుడు.. ఇండియన్ స్టైల్ టాయిలెట్ అందుబాటులో ఉంటే దాన్నే ఉపయోగించడం మంచిది. దాని మీద కూర్చునే అవకాశం ఉండదు. కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా కూడా.. మీ చర్మానికి అంటుకునే అవకాశం ఉండదు.
4. డిస్ ఇన్ఫెక్టంట్స్ దగ్గరుంచుకోండి..
మీతో పాటు డిస్ ఇన్ఫెక్టంట్స్.. అంటే టాయిలెట్ సీట్ శానిటైజర్‌ని మీతో పాటు ఉంచుకోండి. మీరు టాయిలెట్‌కి వెళ్లినప్పుడు దాన్ని స్ప్రే చేసి.. ఇరవై సెకన్ల పాటు ఆగి తర్వాత ఉపయోగించడం మంచిది. ఈ స్ప్రేలు ఏ మెడికల్ స్టోర్‌లో అయినా అందుబాటులో ఉంటాయి. ఒకవేళ అందుబాటులో లేకపోతే.. ఆన్ లైన్‌లో కూడా దీన్ని కొనే వీలుంటుంది. దీని ధర కూడా పెద్దగా ఎక్కువ ఏమీ ఉండదు.
5. వాటిని కింద పెట్టకండి.
చాలాసార్లు మనం షాపింగ్‌కి, సినిమాకి వెళ్లినప్పుడు మనతో పాటు బ్యాగ్ కూడా తీసుకెళ్తాం. దాన్ని టాయిలెట్‌కి కూడా తీసుకెళ్లాల్సిన పరిస్థితి అప్పుడప్పుడూ ఉంటుంది. ఇలా తీసుకెళ్లినప్పుడు చాలామంది దాన్ని కింద పెడుతుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. చూసేందుకు ఎంత శుభ్రంగా కనిపించినా.. అక్కడ చాలా బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి బ్యాగ్‌ని మీ ఒళ్లో పెట్టుకోవడం లేదా భుజానికే వేసుకోవడం మంచిది. కొన్ని టాయిలెట్స్‌లో డోర్‌కి చిన్న హ్యాంగర్ లాంటిది ఉంటుంది. దానికి మీ హ్యాండ్ బ్యాగ్‌ని తగిలించడం మంచిది.
6. హ్యాండ్ శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచుకోండి
మీతో పాటు ఎప్పుడూ ఓ హ్యాండ్ శానిటైజర్‌ని బ్యాగ్‌లో ఉంచుకోండి. టాయిలెట్ ఉపయోగించిన తర్వాత దాన్ని మీ చేతుల్లో వేసుకొని కడుక్కోవడం వల్ల.. వీలైనంత తక్కువగా క్రిముల బారిన పడతారు.
7. పీ బడ్డీ ఉపయోగించండి.
పబ్లిక్ టాయిలెట్స్‌లో చాలామంది టాయిలెట్ సీట్ పై కూర్చోవడానికి భయపడుతుంటారు. అలా కూర్చోవడం వల్ల తమకు ఎన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయో అని కూడా ఆలోచిస్తుంటారు. ఇలాంటివారు కావాలంటే పీ బడ్డీ పరికరాన్ని తమతో పాటు తీసుకెళ్తే కూర్చోవాల్సిన అవసరం లేకుండా టాయిలెట్‌ని ఉపయోగించే వీలుంటుంది. యూజ్ అండ్ త్రో గా వచ్చే ఈ పీ బడ్డీని మీరు బయటకు వెళ్తున్నప్పుడు.. రెండు మూడు మీతో పాటు ఉంచుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. దీన్ని మీరు ఆన్ లైన్‌లో కొనుగోలు చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
తన బెడ్రూంకి సంబంధించిన.. ఓ సీక్రెట్‌ని బయటపెట్టిన ప్రియాంక..!
మీ సెక్స్ లైఫ్ ని ఆనందంగా మార్చేందుకు ఈ ఆహారపదార్థాలు ఎంతో తోడ్పడతాయి..