మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తాను వెండితెర పైనే కాదు.. నిజ జీవితంలో కూడా మెగాస్టారే అని మరోసారి నిరూపించుకున్నారు. దీనికి సంబంధించిన ఒక తాజా వార్త ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇంతకీ చిరంజీవి ఏం చేసారు? ఆయనని అందరు రియల్ లైఫ్ మెగాస్టార్ అని ఎందుకు పొగుడుతున్నారు? మొదలైన విషయాలను మనం తెలుసుకుందాం.
గత వారం రోజులుగా హైదరాబాద్ నగరాన్ని.. ప్రతిరోజు సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం పలకరిస్తూనే ఉంది. అలా మొన్నీమధ్యనే ఒకరోజు కురిసిన భారీ వర్షాలకు గౌలిగూడ (Gowliguda) ప్రాంతంలో వరద నీటిని రోడ్డు పై నుండి తరలించేందుకు ఒక మ్యాన్ హోల్‌ని తెరవడం జరిగింది. అలా తీసిన మ్యాన్ హోల్‌లో ఆ రోజు ఉదయం దివ్య అనే నాలుగేళ్ళ పాప ప్రమాదవశాత్తు పడిపోవడం జరిగింది.
కళ్ళముందే అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకి.. ఒక్కసారిగా షాక్‌కి గురైన పాప తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే దగ్గరలోని అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు.
అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఆ మ్యాన్ హోల్ వద్దకు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఆ మ్యాన్ హోల్ వ్యాసార్థం చాలా చిన్నదిగా ఉండడంతో.. ఎవరైనా ఒకరు లోపలికి వంగి పాపని చాకచక్యంగా బయటకి తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. లేదంటే ఈ చిన్నారి మరింత లోపలికి పడిపోయి.. మెయిన్ డ్రైన్ లైన్‌లోకి వెళ్లిపోయే ప్రమాదముంది.
అటువంటి పరిస్థితుల్లో ఫైర్ మెన్ క్రాంతి కుమార్ (Fireman Kranthi Kumar) ఎంతో చాకచక్యంగా ఎటువంటి తొట్రుపాటు లేకుండా మ్యాన్ హోల్‌లో చిక్కుకుపోయిన పాపని బయటకి తీసుకువచ్చారు. పాప సురక్షితంగా బయటపడడంతో.. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.
ఈ మొత్తం ప్రక్రియని అక్కడే ఉన్న స్థానికుడు ఒకరు తన చరవాణిలో బంధించగా.. ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతూ.. అది మెగాస్టార్ చిరంజీవి వరకూ చేరింది. తన కంటపడిన ఆ వీడియోను చూసి.. చిరంజీవి ఉద్వేగానికి లోనయ్యారు. అంత గొప్ప సాహసాన్ని చేసిన ఫైర్‌మన్‌ను ఎంతగానో కొనియాడారు. అదే సమయంలో మీడియాలో సైతం ఈ వార్తని ప్రసారం చేశారు.
ఈ వీడియో చూసాక చిరంజీవి క్రాంతి కుమార్ వివరాలు అన్నీ తెలుసుకున్నారు. ఎంతో సాహసోపేతంగా మరియు చాకచక్యంగా వ్యవహరించి.. ప్రమాద పరిస్థితుల నుండి నాలుగేళ్ల దివ్యని కాపాడిన ఫైర్‌మెన్ క్రాంతి కుమార్‌ని సత్కరించాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువుగా సదరు ఫైర్ మెన్ క్రాంతి కుమార్‌ని, ఆయనకు సహాయం చేసిన గౌలిగూడ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ జయరాజ్ కుమార్‌తో పాటు.. మొత్తం సిబ్బందిని మెగాస్టార్ ప్రత్యేకంగా అభినందించినట్టుగా తెలిసింది.
ఇక ఎంతో ధైర్య సాహసాలతో పాటుగా సమయస్ఫూర్తిని కూడా ప్రదర్శించిన క్రాంతి కుమార్‌కి చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ (Chiranjeevi Charitable Trust) ద్వారా రూ 1 లక్షని బహుమతిగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ఆ మొత్తాన్ని ఈ రెస్క్యూ టీమ్‌కు అందచేయడం జరిగింది. అదే సమయంలో.. మ్యాన్‌హోల్‌లో పడి ప్రాణాపాయ స్థితికి చేరుకున్న దివ్యకి కూడా.. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అల్లు అరవింద్ తెలిపారు.
ఈ వార్తను చదివిన నెటిజన్లు అనేకమంది ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి సమాజానికి ఎంతో మంచి ఉదాహరణగా నిలుస్తున్నారని తెలిపారు. మంచిపని చేసినవారిని మరింత ప్రోత్సహిస్తే.. అది మరింతమందికి ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఇక మెగా ఫ్యాన్స్ అయితే.. తమ మెగాస్టార్ రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మెగాస్టారే అని పొగుడ్తూ పోస్టులు పెడుతున్నారు.
ఇక చివరగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే.. హైదరాబాద్ వంటి నగరాల్లోనే కాకుండా.. పట్టణాల్లో సైతం వర్షాకాలంలో నీటిని మళ్ళించేందుకు మ్యాన్ హోల్స్ మరమ్మతులు చేస్తుంటారు. ఆ సమయంలో మన ఇళ్లలో ఉండే పిల్లలని రోడ్ల పైకి పంపించే సమయంలో.. తల్లిదండ్రులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఊహించని ప్రమాదాలు ఎప్పుడు జరుగుతాయో మనం ఊహించడం కష్టం.
తల్లిదండ్రులూ.. పిల్లలతో తస్మాత్ జాగ్రత్త!
ఇవి కూడా చదవండి
నా ఆఫీస్‌లో ఆడవారికి మాత్రమే ఎంట్రీ : రేణు దేశాయ్
సక్సెస్ కోసం పరితపించే కుర్రాడి కథ.. ‘చిత్రలహరి’ మూవీ రివ్యూ..!
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్‌కు గాయాలు.. RRR షూటింగ్ వాయిదా..!