నందమూరి తారక రామారావు.. అలనాటి అందాల కథానాయకుడు. రాముడినైనా, కృష్ణుడినైనా.. అంతా ఆయనలోనే చూసుకునేవారు. ఇక వారసుడిగా ఆయన పేరు మాత్రమే కాదు.. పోలికలు కూడా పుణికి పుచ్చుకొని తాతకు తగ్గ మనవడిగా పేరు సంపాదించాడు మనందరం తారక్ అని పిలిచుకొనే జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). ఇండస్ట్రీకి వచ్చి పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న ఈ హీరో ఈ రోజు తన 36వ పుట్టినరోజును (Birthday) జరుపుకుంటున్నాడు.
గతేడాది ఆగస్టులో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. తండ్రి మరణించి ఏడాది పూర్తికాకపోవడంతో.. ఈ ఏడాది పుట్టినరోజు వేడుకలు చేసుకోనని ఎన్టీఆర్ ప్రకటించాడు. అయితే అభిమానులు మాత్రం సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటిస్తోన్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఆయన పాత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేయనుందట. ఈ అందాల కథానాయకుడి పుట్టినరోజు సందర్భంగా మన యంగ్ టైగర్ గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.
ఎన్టీఆర్ అంటేనే పవర్ ఫుల్ నటన, అద్భుతమైన డైలాగ్ డెలివరీ గుర్తొస్తాయి. ఇది ఆయనకు తాత నుంచి లభించిందేనని చెప్పుకోవాలి.
ఆయన తండ్రి హరికృష్ణ, తల్లి షాలిని. వారిద్దరికీ తారక్ ఏకైక సంతానం. హరికృష్ణ మరో భార్య సంతానమైన జానకీ రామ్, కల్యాణ్ రామ్ అనే ఇద్దరు అన్నలు, అక్క సుహాసిని జూనియర్ ఎన్టీఆర్‌కి తోబుట్టువులు.
మనవడిలోని కళను గుర్తించిన ఆయన తాత ఎన్టీఆర్ తనకు బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో అవకాశాన్ని అందించడంతో వెండితెరపై కనిపించాడు తారక్. తర్వాత బాల రామాయణం చిత్రంలోనూ నటించాడు.
రాముడిగా తెరపై కనిపించి రెండో సినిమాతోనే భరతముని అకాడమీ అవార్డు వంటి పురస్కారాలు గెలుపొందాడు. ఈ సినిమాలో నటించే సమయానికి తన వయసు కేవలం పదేళ్లు మాత్రమే. సినిమాల్లోకి రాకముందే కూచిపూడి డ్యాన్స్ నేర్చుకున్నాడు ఎన్టీఆర్. అంతేకాదు.. ఎన్నో ప్రదర్శనలు కూడా ఇచ్చాడట.
తారక్‌కి 9 సంఖ్య అంటే ఎంతో ఇష్టమట. ఆయన తీసుకునే ప్రతి కారు, ప్రతి వాహనానికి 9 సంఖ్య ఉండేలా చూసుకుంటారట. 9999 నంబర్ కారు నంబర్ కోసం ఎంతో డబ్బు కట్టి.. ఆ నంబర్‌తో కారును రిజిస్టర్ చేయించుకున్నారట.
2001లో నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టినా.. రాజమౌళి దర్శకత్వంలోని స్టూడెంట్ నం.1 తోనే మొదటి హిట్ సంపాదించాడు ఎన్టీఆర్. హీరోగా తన మొదటి సినిమాకి రెండున్నర లక్షల పారితోషికం తీసుకున్న తారక్.. ఆ మొత్తాన్నీ అమ్మ చేతిలో పెట్టేశాడట.
ఎన్‌టిఆర్ తన కెరీర్ ప్రారంభంలో కాస్త బొద్దుగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. కంత్రీ సినిమాకి ముందు 20 కేజీల బరువు తగ్గాడట. ఇప్పుడు ఎంతో కష్టతరమైన వ్యాయామాలను కూడా సులువుగా చేస్తూ.. తన ఫిజిక్‌ని కాపాడుకుంటూ వస్తున్నాడు.
కేవలం ఇండియన్స్ మాత్రమే కాదు.. తారక్‌కి జపనీయులు కూడా మంచి ఫ్యాన్సేనట. 2003లో విడుదలైన బాద్షా చిత్రం అక్కడి ఫిల్మ్ ఫెస్టివల్‌కి కూడా ఎంపికైంది. బాద్షా చిత్రంలో సైరో సైరో పాట అక్కడ మంచి సెన్సేషన్ క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ మంచి భోజన ప్రియుడట. అమ్మ చేసిన రొయ్యల బిర్యానీ అంటే ఆయనకు అమితమైన ప్రీతి. అయితే కేవలం తినడమే కాదు.. రుచికరంగా వండడం కూడా వచ్చట. వంట చేయడం వల్ల తన ఒత్తిడి పూర్తిగా దూరమవుతుందని చెబుతాడీ హీరో.
2011లో లక్ష్మీ ప్రణతిని పెళ్లాడిన తారక్‌కి అభయ్ రామ్, భార్గవ్ రామ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
చిన్నతనంలో ఎన్టీఆర్ కూచిపూడి ప్రదర్శన ఇస్తున్న వీడియోను మీరూ చూసేయండి..
ఎన్టీఆర్ చిన్నతనం నుంచి ఇప్పటివరకూ ఎక్కువ మంది చూడని చిత్రాలు మీకోసం..
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ
కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !
ఇవి కూడా చదవండి
మన వెండితెర ముద్దుల ‘రౌడీ’ల గురించి.. ఈ విశేషాలు మీకు తెలుసా?
నాకు తెలిసిన రాక్షసి సమంత ఒక్కరే: నాగ చైతన్య
పెళ్లికి సిద్ధమైన మరో నటి.. ఎంగేజ్ మెంట్‌తో అందరికీ సర్ ప్రైజ్..!