పొడవాటి అందమైన జుట్టంటే (hair) ఇష్టపడని వారు ఎవరూ ఉండరేమో.. కానీ అందరికీ పొడుగు జుట్టు (Long hair) ఉండడం అసాధ్యం అని చెప్పుకోవాలి. కాలుష్యం, ఇతర కారణాల వల్ల జుట్టు రాలిపోవడం.. జుట్టు చివర్లు చిట్లిపోవడం.. వంటి వాటి వల్ల జుట్టు పొడవు(hair lenght) కూడా తగ్గిపోతుంది. అయితే పొడుగు జుట్టు సొంతం చేసుకోవాలనే మీ కలను నిజం చేసుకోవాలంటే.. మరీ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. మీ జుట్టు పొడుగ్గా.. అందంగా కనిపిస్తుంది.
1. స్ట్రెయిటెన్ చేయండి.
సాధారణంగా ఉంగరాల జుట్టు కంటే స్ట్రెయిట్‌గా ఉన్న జుట్టు పొడుగ్గా కనిపిస్తుంది. అందుకే మీ జుట్టు కర్లీ లేదా వేవీ స్టైల్‌లో కాకుండా స్ట్రెయిట్‌గా ఉండేలా స్టైలింగ్ చేసుకోండి. స్మూతెనింగ్, స్ట్రెయిటనింగ్ చేయడం వల్ల జుట్టు సిల్కీగా, పొడుగ్గా కనిపిస్తుంది. అంతేకాదు.. మీ లుక్ కూడా మారుతుంది. మీ జుట్టు ఎంతో పర్ఫెక్ట్‌గా కూడా కనిపిస్తుంది.
2. ట్రిమ్ చేస్తూ ఉండండి..
సాధారణంగా ట్రిమ్ చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుందన్న సంగతి మనకు తెలిసిందే. కానీ ఇది మన జుట్టు పొడుగ్గా కనిపించేలా చేస్తుందంటే కాస్త వింతగా అనిపిస్తోంది కదూ. అవును.. ఇలా జుట్టును కనీసం 45 రోజులకు ఒక సారి ట్రిమ్ చేసుకోవడం వల్ల జుట్టు డ్యామేజ్ బారిన పడకుండా ఉంటుంది. ఇలా జరగడం వల్ల జుట్టు పాడై దాన్ని కట్ చేయాల్సిన అవసరం కూడా ఎదురవ్వదు. సాధారణంగా జుట్టు చివర్ల నుంచి చిట్లడం ప్రారంభమవుతుంది. దానిపై మనం శ్రద్ధ వహించకపోతే అది మరింత ఎక్కువగా చిట్లే ప్రమాదం కూడా ఉంటుంది. ఇలా జరగడం వల్ల జుట్టు పాడవడమే కాదు.. పొట్టిగా కూడా తయారవుతుంది. పైగా తరచూ ట్రిమ్ చేయడం వల్ల జుట్టు రాలడం కూడా తగ్గుతుంది..
3. మధ్య పాపిడతో..
సాధారణంగా మన జుట్టు వెనక్కి దువ్వడం, పక్క పాపిడ తీయడం వంటివన్నీ చేసినా అందులో పెద్దగా మార్పుండదు. కానీ మధ్య పాపిడ తీసుకోవడం వల్ల జుట్టు పొడుగ్గా కనిపిస్తుంది. మీ ముఖ ఆకృతికి మధ్య.. పాపిడ నప్పితే ఆ పాపిడతో కొత్త లుక్ సొంతం చేసుకోవడంతో పాటు మీ జుట్టును పొడుగ్గా కనిపించేలా చేయచ్చు. అంతేకాదు.. మీ జుట్టు పల్చగా ఉంటే అది ఒత్తుగా కనిపించేందుకు కూడా ఇది ఉపకరిస్తుంది.
4. హై పోనీ టెయిల్‌తో..
మీ పోనీ టెయిల్‌కి మరింత లుక్‌ని అందించడంతో పాటు.. జుట్టు పొడుగ్గా కనిపించేలా చేయడానికి ఈ ట్రిక్ పనిచేస్తుంది. దీని కోసం మీరు చేయాల్సిందల్లా మీ పోనీని కాస్త పైకి వేసుకోవాలి. అయితే మామూలుగా పోనీ వేసినట్లు కాకుండా.. జుట్టును పైనొక భాగం, కింద ఒక భాగంగా చేయాలి. ఇలా రెండు భాగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు పై భాగానికి రబ్బర్ బ్యాండ్ పెట్టి ఉంచాలి. ఆ తర్వాత దాని కింద ఉన్న వెంట్రుకలతో మరో పోనీ వేయాలి. ఇలా చేయడం వల్ల మీరు వేసింది రెండు పోనీటెయిల్స్ అయినా.. కనిపించేది మాత్రం ఒకటే. ఇది హై పోనీ టెయిల్లా కనిపించడంతో పాటు జుట్టు పొడవు కూడా పెరిగినట్లు కనిపిస్తుంది.
5. లేయర్ హెయిర్ స్టైల్‌తో..
మీరు తరచూ హెయిర్ కట్స్ చేయించుకునేవారైతే మామూలు కట్ లేదా స్టెప్ కట్ లాంటివి కాకుండా మీ జుట్టును లేయర్ కట్ చేయించుకోండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా కనిపిస్తుంది. లేజర్ కట్ అయితే.. లుక్ ఇంకా బాగుంటుంది. ఇది మీ జుట్టును ఒక్కసారే పొడుగ్గా మార్చేస్తుంది.
6. లావుగా కనిపించేలా..
జుట్టు ఒత్తుగా ఉంటే అది పొడవుగా కనిపించడం పెద్ద కష్టం కాదు. అందుకే మీ జుట్టు ఒత్తుగా ఉన్నట్లుగా కనిపించేలా చేయాలి. దీని కోసం తలస్నానం చేసిన తర్వాత మీ జుట్టును కుదుళ్ల నుంచి పైకి లేపుతూ ఆరబెట్టాలి. ఇలా చేయడం వల్ల జుట్టు పొడుగ్గా కనిపిస్తుంది. కావాలంటే మీ జుట్టును వ్యతిరేక దిశలో వేసి బ్లోయర్‌తో ఆరబెట్టి చూడండి. ఇలా చేయడం వల్ల మీ జుట్టు ఒత్తుగా కనిపిస్తుంది. అలా ఆటోమేటిక్‌గా పొడుగ్గా ఉన్నట్లుగా లుక్‌ని సొంతం చేసుకోవచ్చు.
ఇవి కూడా చదవండి.
జుట్టు రాలుతోందా? అయితే మీకోసమే ఈ పరిష్కార మార్గాలు..!