ADVERTISEMENT
home / Health
రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు.. ఎవరికి ఎక్కువగా ఉంటాయంటే..? (Breast Cancer In Telugu)

రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు.. ఎవరికి ఎక్కువగా ఉంటాయంటే..? (Breast Cancer In Telugu)

బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) బారిన పడి మరణిస్తున్న మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువవుతోంది. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నా.. వాటి ద్వారా వ్యాధి ముదరకుండానే తగ్గించే వీలున్నా.. ఇలా జరగడం బాధాకరం. రొమ్ము క్యాన్సర్ గురించి సరైన అవగాహన లేకపోవడం, సరైన చికిత్స తీసుకోకపోవడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నవారు ఎందరో. అందుకే మహిళలంతా కచ్చితంగా రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకోవాలి. అందుకు ఉద్ధేశించిందే ఈ కథనం. ఈ కథనంలో రొమ్ము క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఎవరిలో వస్తుంది? దాన్ని రాకుండా ఏం చేయాలి? క్యాన్సర్‌కు ఎలాంటి చికిత్స ఉంది? మొదలైన విషయాలన్నీ తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకొందాం.

బ్రెస్ట్ క్యాన్సర్ గురించి కొన్నివాస్తవాలు

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు

బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు

ADVERTISEMENT

బ్రెస్ట్ క్యాన్సర్ దశలు

బ్రెస్ట్ క్యాన్సర్ రకాలు

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు

చికిత్సా పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుందంటే..

ADVERTISEMENT

రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించే చికిత్సా పద్ధతులు

క్యాన్సర్ రాకుండా నివారణ మార్గాలు

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎలా తగ్గించుకోవాలి?

తరచూ అడిగే ప్రశ్నలు

ADVERTISEMENT

బ్రెస్ట్ క్యాన్సర్ (Breast Cancer) గురించి కొన్నివాస్తవాలు (Facts About Breast Cancer In Telugu)

ఇటీవలి కాలంలో మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోన్న క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది సోకిన వారి మరణాల రేటు సైతం ఎక్కువగానే ఉంది. ఆధునిక చికిత్స అందుబాటులో ఉన్నప్పటికీ సరైన అవగాహన లేకపోవడం, అశ్రద్ధ కారణంగా దీని కారణంగా ప్రాణాలు కోల్పోతున్న మహిళలు సైతం ఉన్నారు.

  • కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మనదేశంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 25.8 శాతం బ్రెస్ట్ క్యాన్సర్ కేసులే. ఇందులో  12.7 శాతం మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
  • వ్యాధి నుంచి బయటపడే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రాణాలు కోల్పోతున్నవారే ఎక్కువ మంది ఉంటున్నారు. 2010-2014 సంవత్సర గణాంకాల ప్రకారం 66.1 శాతం మంది మాత్రమే.. బ్రెస్ట్ క్యాన్సర్ మహమ్మారి చెర నుంచి విముక్తులవుతున్నారు. మిగిలిన వారు ప్రాణాలు కోల్పోతున్నారు.
  • అభివృద్ధి చెందిన ఆస్ట్రేలియా, అమెరికా వంటి దేశాల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సర్వైవల్ రేటు చాలా ఎక్కువగా ఉంటోంది. అక్కడ 90 శాతం మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డారు.
  • 2020 నాటికి మనదేశంలో కనీసం 17,97,900 మంది మహిళలు బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడవచ్చనేది ఓ అంచనా. 

బ్రెస్ట్ క్యాన్సర్ లక్షణాలు (Symptoms Of Breast Cancer In Telugu)

  1. రొమ్ముల్లో గడ్డలు ఏర్పడటం, రొమ్ములు గట్టిగా మారడం బ్రెస్ట్ క్యాన్సర్ తొలి లక్షణాలు. వీటితో పాటు మరికొన్ని లక్షణాల ఆధారంగా బ్రెస్ట్ క్యాన్సర్ సోకిందని గుర్తించవచ్చు.
  2. రొమ్ములు లేదా చంకల్లో నొప్పి. సాధారణంగా ఇవి నెలసరి సమయంలోనూ వస్తాయి. అయితే దాని తర్వాత కూడా నొప్పి తగ్గుముఖం పట్టనట్లయితే అనుమానించాల్సిందే.
  3. రొమ్ముల పరిమాణం, వాటి ఆకృతి మారిపోవడం.
  4. రొమ్ములపై ఉన్న చర్మంలో మార్పులు. బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లైదే.. రొమ్ములపై అక్కడక్కడా నొక్కులు కనిపిస్తాయి.
  5. చనుమొనలు లేదా రొమ్ములపై  ఉన్న చర్మం పొరలుగా ఊడటం, పొక్కులు రావడం, ర్యాషెస్ ఏర్పడటం.
  6. చను మొన సాధారణ స్థితిలో ఉండకుండా లోపలికి నొక్కుకుపోయినట్టుగా తయారవడం.
  7. చనుమొనల నుంచి ద్రవాలు డిశ్చార్జి కావడం.
  8. రొమ్ములపై ఉన్న చర్మం ఎర్రగా లేదా నారింజ వర్ణానికి మారిపోవడం

1-Breast Cancer In Telugu

డయాబెటిస్ కోసం ఇంటి నివారణలు

బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు (Causes Of Breast Cancer)

యుక్త వయసు వచ్చిన తర్వాత అమ్మాయిల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా రొమ్ముల పరిమాణం పెరగడంతో పాటు.. వాటిలో కొన్ని మార్పులు చోటు చేసుకొంటాయి. మాంసం, కొవ్వు చేరతాయి. పాల గ్రంథులు, లంబికలు ఏర్పడతాయి. పాలగ్రంథులతో పాటు క్షీరనాళాలు సైతం ఏర్పడతాయి. దానికి తగినట్లుగా కణాల విభజన జరుగుతుంది. ఇది సాధారణంగా జరిగే ప్రక్రియ.

ADVERTISEMENT

క్యాన్సర్ సోకినప్పుడు సైతం దాదాపుగా ఇలాంటి కణవిభజనే జరుగుతుంది. చెప్పాలంటే ఇది నియంత్రణ కోల్పోయిన కణవిభజన. సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ క్షీరనాళాల్లో మొదలవుతుంది. కణవిభజన నిరంతరాయంగా జరగడం వల్ల రొమ్ముల్లో కణితులు ఏర్పడతాయి. ఇవి నెమ్మదిగా లింఫ్ నోడ్స్, ఇతర భాగాలకు చేరుకొంటాయి. రొమ్ములో ఉన్న కండరంలో కూడా కణితులు ఏర్పడటం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.

ఇలా క్యాన్సర్ రావడానికి హార్మోన్ల అసమతౌల్యత, జీవన సరళిలో వచ్చిన మార్పులు, వాతావరణ ప్రభావం కారణం కావచ్చు. అన్నీ సక్రమంగానే ఉండి ఆరోగ్యపరంగా తగు జాగ్రత్తలు పాటించే వారిలో సైతం బ్రెస్ట్ క్యాన్సర్ వస్తోంది. వీరిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఏర్పడటానికి సరైన కారణం ఏంటో సరిగ్గా గుర్తించలేకపోతున్నారు వైద్యులు.

అయితే జన్యుపరమైన కారణాలు, వాతావరణంలో వస్తున్న మార్పులే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణమై ఉండవచ్చని భావిస్తున్నారు. తరాలు మారే కొద్దీ జన్యువుల్లో మార్పులు వస్తూ ఉంటాయి. ఇలా ఎన్ని సార్లు అవి మార్పులకు గురయ్యాయనేదానిపై క్యాన్సర్ వచ్చే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. అలాంటి వాటిలో బ్రెస్ట్ క్యాన్సర్ జీన్ 1 (బీఆర్సీఏ -1), బ్రెస్ట్ క్యాన్సర్ జీన్స్ 2 (బీఆర్సీఏ -2)  ముఖ్యమైనవి. వీటి వల్ల రొమ్ము క్యాన్సర్‌తో పాటు అండాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలున్నాయి.

వీటితో పాటు కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా రొమ్ము క్యాన్సర్ (Breast Cancer) రావడానికి కారణమవుతున్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

ADVERTISEMENT
  1. వయసు పెరగడం: వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇరవైయేళ్ల వయసులో ఉన్నప్పుడు రాబోయే పదేళ్లలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 0.6 శాతం మాత్రమే. అదే 70 ఏళ్ల వయసు వచ్చేసరికి అది 3.84 శాతానికి పెరుగుతుంది.
  2. జన్యువులు: పైన మనం చర్చించుకొన్నట్టుగా బీఆర్సీఏ1, బీఆర్సీఏ2 జన్యువులను కలిగి ఉన్న మహిళల్లో రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రెండింటితో పాటు టీపీ53 అనే మరో జన్యువు సైతం బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. మీకు బాగా దగ్గరి బంధువు అంటే రక్తసంబంధం ఉన్నవారికి ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినట్లయితే.. అది మీక్కూడా వచ్చే అవకాశాలున్నాయి.
  3. రొమ్ములో కణితులుండటం: రొమ్ములో కణితులున్నవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. వాటిలో క్యాన్సర్ కారక కణితులు లేనప్పటికీ.. వాటి వల్ల కూడా భవిష్యత్తులో క్యాన్సర్ రావచ్చు. ఉదాహరణకి లాబ్యులర్ కార్సినోమా, హైపర్ప్లాసియా వంటి సమస్యలు ఎదుర్కొన్నవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి.
  4. ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడడం:  ఒక రొమ్ము బ్రెస్ట్ క్యాన్సర్‌కి గురైతే.. అది రెండో రొమ్ముకి సైతం పాకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ముందుగానే మీకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉండి దాన్ని నయం చేసుకొన్నప్పటికీ.. మళ్లీ వచ్చేందుకు అవకాశం లేకపోలేదు.
  5. రేడియేషన్ ప్రభావం: ఏదైనా అనారోగ్యం కారణంగా గతంలో మీరెప్పుడైనా రేడియేషన్ చికిత్స తీసుకొన్నట్లయితే  బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు.
  6. ఈస్ట్రోజెన్ ప్రభావం: చిన్నవయసులో అంటే పన్నెండేళ్ల లోపు రజస్వల కావడం, చాలా ఆలస్యంగా మెనోపాజ్ అంటే నెలసరులు ఆగిన వారికి.. రొమ్ము క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈస్ట్రోజెన్ అధికంగా విడుదలవడం కారణంగా ఇలా జరిగే అవకాశాలున్నాయి. ఇలాంటి వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి ఛాన్సులున్నాయి.
  7. అధిక బరువు: ఒబెసిటీ సమస్యతో బాధపడేవారికి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలున్నాయి. ఈస్ట్రోజెన్ స్థాయి అధికమవడం వల్ల ఈ పరిస్థితి రావడానికి అవకాశాలున్నాయి.
  8. హార్మోన్ ట్రీట్మెంట్స్: హార్మోన్ ట్రీట్మెంట్ థెరపీ (హెచ్ఆర్టీ), గర్భనియంత్రణ మాత్రలు ఉపయోగించిన వారిలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చేందుకు అవకాశాలున్నాయి. ఈ రకమైన పద్ధతులు పాటించడం వల్ల శరీరంలో ఈస్ట్రోజెన్ అధికంగా విడుదలవుతుంది. బహుశ దీని కారణంగానే బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది.
  9. ఆల్కహాల్: మిగిలిన వారితో పోలిస్తే ఆల్కహాల్ సేవించే వారిలో రొమ్ము క్యాన్సర్ రావడానికి ఒకటిన్నర రెట్లు అవకాశం ఎక్కువ.
  10. గర్భం దాల్చక పోవడం: గర్భం దాల్చని వారిలో లేదా ఆలస్యంగా సంతానానికి జన్మనిచ్చిన వారిలో  అంటే 30 ఏళ్ల తర్వాత సంతానానికి జన్మనిచ్చిన వారిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి అవకాశాలున్నాయి.

Also Read About గర్భిణీ స్త్రీలు

5-Breast Cancer In Telugu

బ్రెస్ట్ క్యాన్సర్ దశలు (Stages Of Breast Cancer)

క్యాన్సర్ కణితి పరిమాణం ఆధారంగా Breast Cancer ఏ దశలో ఉందో గుర్తిస్తారు. ఈ విషయంలో క్యాన్సర్ కణాలు లింఫ్ నోడ్స్ లేదా ఇతర శరీరభాగాలకు కూడా విస్తరించిన విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటారు. దీని ఆధారంగానే సున్నా నుంచి నాలుగు వరకు మొత్తంగా ఐదు దశలుగా దీన్ని గుర్తిస్తారు.

స్టేజ్ 0: దీన్ని డక్టల్ కార్సినోమా అని పిలుస్తారు. ఈ దశలో దీని ప్రభావం క్షీర నాళాలకే పరిమితమై ఉంటుంది.

ADVERTISEMENT

స్టేజ్ 1: ఈ దశ మొదలయ్యేసరికి క్యాన్సర్ కణితి రెండు సెం.మీ. వరకు పెరుగుతుంది. కానీ లింఫ్ నోడ్స్‌కు క్యాన్సర్ కణాలు దూరంగానే ఉంటాయి.

స్టేజ్ 2: ఈ దశలో క్యాన్సర్ కణితి రెండు సెం.మీ. మాత్రమే ఉన్నప్పటికీ క్యాన్సర్ కణాలు కణితికి దగ్గరలో ఉన్న లింఫ్ నోడ్స్ వరకూ విస్తరిస్తాయి.

స్టేజ్ 3: మూడో దశలో క్యాన్సర్ కణితి 5 సెం.మీ. వరకు పెరుగుతుంది. అలాగే ఇతర లింఫ్ నోడ్స్‌కి సైతం క్యాన్సర్ కణాలు విస్తరిస్తాయి.

స్టేజ్ 4: ఇది తుది దశ. ఈ దశలో క్యాన్సర్ కణాలు రొమ్ముల నుంచి ఊపిరితిత్తులు, మెదడు, కాలేయం, ఎముకలు వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపించడం ప్రారంభిస్తాయి.

ADVERTISEMENT

బ్రెస్ట్ క్యాన్సర్ రకాలు (Types Of Breast Cancer)

రొమ్ము క్యాన్సర్లో రెండు రకాలున్నాయి.

మొదటిది డక్టల్ కార్సినోమా. ఈ రకమైన రొమ్ము క్యాన్సర్‌ క్షీరనాళాల్లో మొదలవుతుంది. రెండోది లాబ్యులర్ కార్సినోమా. రొమ్ము లంబికల్లో క్యాన్సర్ కణాలు పెరగడం వల్ల ఈ క్యాన్సర్ వస్తుంది.

అలాగే ప్రమాదకరమైన, ప్రమాదకరం కాని క్యాన్సర్ అనే రెండు రకాలు కూడా ఉంటాయి. లంబికలు లేదా క్షీరనాళాల్లో వచ్చిన కణితులు.. ఏర్పడిన చోట నుంచి ఇతర భాగాలకు సోకితే.. అది ప్రమాదకరమైన క్యాన్సర్‌గా పరిగణించాలి. అలా కాకుండా.. క్యాన్సర్ కణాలు పక్కనే ఉన్న కణాలకు లేదా ఇతర భాగాలకు సోకకుండా ఉంటే దాన్ని ప్రమాదకరం కానిదిగా పరిగణిస్తారు.

బ్రెస్ట్ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు (Diagnostic Tests )

2-Breast Cancer In Telugu

ADVERTISEMENT

సాధారణంగా రొమ్ము క్యాన్సర్‌ను (Breast Cancer)  మూడు రకాల పరీక్షల ద్వారా గుర్తిస్తారు. వీటిని ట్రిపుల్ ఎసెస్మెంట్ పరీక్షలని పిలుస్తారు. అవేంటంటే..

  1. బ్రెస్ట్ ఎగ్జామ్: ఈ పరీక్షను వైద్యుడు మహిళ రొమ్మును తాకి..  గడ్డలు లేదా ఇతర రొమ్ము క్యాన్సర్ లక్షణాలేమైనా ఉన్నాయేమో స్వయంగా పరీక్షిస్తారు.
  2. మామోగ్రామ్: ఇది ఎక్స్ రే లాంటిదే. ఇది క్యాన్సర్ ఉందా లేదా అని నిర్ధారించేందుకు చేసే స్క్రీనింగ్ పరీక్ష. రొమ్ములో ఉన్న కణితులు లేదా అసాధారణమైన మార్పులను గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు. అయితే అన్ని సందర్భాల్లోనూ ఇది నిజమైన ఫలితాలనివ్వదు. అంటే క్యాన్సర్ ఉన్నా లేనట్టు.. లేకపోయినా ఉన్నట్టు చూపించే అవకాశం కూడా ఉంది. అందుకే క్యాన్సర్ ఉందా? లేదా అని నిర్ధారించడానికి మరో పరీక్ష కూడా చేస్తారు.
  3. అల్ట్రాసౌండ్ స్కాన్: మామోగ్రామ్ ద్వారా గుర్తించిన క్యాన్సర్‌ను నిజమా కాదా? అని నిర్థారించడానికి ఈ పరీక్ష చేస్తారు. దీని ద్వారా క్యాన్సర్ కణితి ఉన్నదీ లేనిదీ నిర్ధారణ అవుతుంది. ప్రధానంగా ఈ మూడు పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత అవసరమైతే బయాప్సీ అనే పరీక్షను కూడా చేస్తారు.
  4. బయాప్సీ: లేబరేటరీ  ఎనాలసిస్ కోసం రొమ్ములోని క్యాన్సర్ కణితి నుంచి కొంత టిష్యూను తీసుకొని పరీక్ష చేస్తారు. ఈ పరీక్షలో అవి ఏ రకమైన క్యాన్సర్ కణాలో పరీక్షిస్తారు. అలాగే అందులో ఉన్న క్యాన్సర్ హార్మోన్ ప్రమాదకరమైనదా? కాదా? అని కూడా గుర్తిస్తారు.

చికిత్సా పద్ధతి దేనిపై ఆధారపడి ఉంటుందంటే.. (How To Diagnose The Treatment For Breast Cancer)

అవసరమైన పరీక్షలన్నీ పూర్తయిన తర్వాతే బ్రెస్ట్ క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తిస్తారు. క్యాన్సర్ కణితి పరిమాణం ఎంత ఉంది? ఎంత వరకు క్యాన్సర్ కణాలు విస్తరించాయి? అది ఏమేర ప్రభావం చూపిస్తోంది? దాని వల్ల ఎంత ప్రమాదం జరగడానికి అవకాశం ఉంది? వీటన్నింటి ఆధారంగా క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తిస్తారు. వీటితో పాటు మహిళ వయసు, ఆమె ఆరోగ్యం ఆధారంగా ఏ రకమైన చికిత్స తీసుకోవాలో కూడా సూచిస్తారు.

రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించే చికిత్సా పద్ధతులు (Treatment )

3-Breast Cancer In Telugu

రొమ్ము క్యాన్సర్ ఏ దశలో ఉందో గుర్తించిన తర్వాత దానికి తగిన చికిత్సను వైద్యులు సూచిస్తారు. ఈ విషయంలో వారి ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకొంటారు. దానికి అనుగుణంగా ఏ పద్ధతుల్లో చికిత్స అందిస్తారంటే..

ADVERTISEMENT
  1. సర్జరీ
  2. రేడియేషన్ థెరపీ
  3. హార్మోన్ థెరపీ
  4. కీమోథెరపీ

ఈ పద్ధతుల ద్వారా రొమ్ము క్యాన్సర్‌కు ట్రీట్మెంట్ చేస్తారు. క్యాన్సర్ కణాలు రొమ్ములోనే ఉండి.. ఇతర భాగాలకు పాకకుండా ఉంటే సర్జరీ ద్వారా క్యాన్సర్ కణితిని తొలగిస్తారు. అలా కాకుండా ఇతర అవయవాలకు కూడా పాకినప్పుడు మిగిలిన పద్ధతులను అవలంబిస్తారు. సర్జరీ ద్వారా క్యాన్సర్ గడ్డలను తొలిగించినప్పటికీ క్యాన్సర్ కణాలు పూర్తిగా నాశనం కావడానికి రేడియేషన్ థెరపీ లేదా కీమో థెరపీ చేస్తారు. ఇది చేయాలా? వద్దా? అనేది రోగి శరీరంలోని క్యాన్సర్ కణితి, కణాల మీద ఆధారపడి ఉంటుంది. అదే వక్షోజాలను పూర్తిగా తొలగించినట్లయితే (దీన్నే మాస్టరెక్టమీ అని పిలుస్తారు) రేడియేషన్ థెరపీ చేయాల్సిన అవసరం ఉండదు.

క్యాన్సర్ కణితి లేదా గడ్డను తొలగించడం ద్వారా ఏర్పడిన ఖాళీని పూరించి మునుపటిలా వక్షోజాలు కనిపించాలనుకొనేవారికి ఆంకో ప్లాస్టిక్ టెక్నిక్స్ ద్వారా ఇంప్లాంట్ చేస్తారు. రొమ్ములో కొంత భాగం మాత్రమే తొలగిస్తే.. శరీరంలోని ఇతర భాగాల నుంచి సేకరించిన కండరం లేదా కణజాలం ఉపయోగించి సర్జరీ చేస్తారు. దీన్నే ఆంకో ప్లాస్టిక్ బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీ అంటారు. రొమ్మును పూర్తిగా తీసేసిన వారికి సిలికాన్ ఇంప్లాంట్స్ అమర్చి బ్రెస్ట్ రీకనెక్షన్ సర్జరీ చేస్తారు. దీన్ని రొమ్ము తొలగించిన వెంటనే అమర్చాలా? లేదా పూర్తిగా కోలుకొన్న తర్వాత చేయాలా? అనేది పేషెంట్ ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

క్యాన్సర్ రాకుండా నివారణ మార్గాలు (Ways To Prevents )

వ్యాధి వచ్చిన తర్వాత ఇబ్బంది పడటం కంటే ముందుగానే దాన్ని రాకుండా చూసుకోవడం మంచిది. మరి ఇది క్యాన్సర్‌కు వర్తిస్తుందా? ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తే రొమ్ము క్యాన్సర్ మన జోలికి రాకుండా ఉంటుంది? తెలుసుకొందాం.

కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. లేదా తొలి దశలోనే దాన్ని గుర్తించి సరైన చికిత్స తీసుకోవచ్చు.

ADVERTISEMENT
  • స్క్రీనింగ్ పరీక్షలు: వైద్య నిపుణులను సంప్రదించి వారి సూచన మేరకు నిర్ణీత వ్యవధిలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొంటూ ఉండాలి.
  • రొమ్ము క్యాన్సర్ పై అవగాహన: సాధారణంగా మన దేశంలో మహిళలకు రొమ్ముల గురించి.. వాటి పనితీరు గురించి పెద్దగా అవగాహన లేదనే చెప్పుకోవాలి. వాటికి సంబంధించి ఏదైనా చిన్న సమస్య వస్తే.. దాని గురించి ఇతరులకు చెప్పడానికి లేదా చికిత్స తీసుకోవడానికి సిగ్గుపడుతుంటారు. మీరు కూడా ఇలా చేయకుండా రొమ్ము క్యాన్సర్ లక్షణాలపై అవగాహన పెంచుకోవడం మంచిది. అలాగే మీ రొమ్ములను మీరే తరచూ పరీక్షించుకొంటూ ఉండాలి. ఇలా చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఆపడం సాధ్యం కాదు. కానీ  ముందుగానే క్యాన్సర్‌ను గుర్తించవచ్చు. ఫలితంగా చికిత్స తీసుకొని హాయిగా జీవించవచ్చు.
  • ఆల్కహాల్‌కి దూరంగా: ఆల్కహాల్ అలవాటు సైతం క్యాన్సర్ రావడానికి కారణమవుతుంది. కాబట్టి దానికి దూరంగా ఉండటం మంచిది. లేదా పరిమితికి లోబడి సేవించాల్సి ఉంటుంది.
  • వ్యాయామం: చాలా సమస్యలకు వ్యాయామం చక్కని పరిష్కారం చూపిస్తుంది. రోజుకి 30 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ద్వారా రొమ్ము క్యాన్సర్ రాకుండా చూసుకోవచ్చు. ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్నవారు కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. ఎక్కువ క్యాలరీలున్న ఆహారం తగ్గించుకొని వ్యాయామం పెంచాలి.
  • ఆరోగ్యకరమైన ఆహారం: పండ్లు, కూరగాయలు, గింజలు, పప్పుధాన్యాలు, చేపలు, ఆలివ్ నూనె మొదలైనవాటిని  ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

4-Breast Cancer In Telugu

బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఎలా తగ్గించుకోవాలి? (How To Reduce Breast Cancer Risk)

మీ రక్తసంబంధీకులకు ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నా లేదా మీ డాక్టర్ మీలో క్యాన్సర్ వచ్చేందుకు ఆస్కారమున్న లక్షణాలను గుర్తించినా.. క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తగా వైద్యులు ట్రీట్మెంట్ సూచిస్తారు.

ప్రివెంటివ్ మెడికేషన్స్: క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణమైన ఈస్ట్రోజెన్ హార్మోన్ అధికంగా విడుదల కాకుండా ఉండేందుకు కొన్ని మందులు సూచిస్తారు. అయితే వీటి వల్ల దుష్ప్రభావాలు ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే రిస్క్ బాగా ఎక్కువ ఉన్నవారికే వాటిని సూచిస్తారు.

ప్రివెంటివ్ సర్జరీ: మరీ ఎక్కువ రిస్క్ ఉన్నవారికైతే.. రొమ్ములను తొలిగిస్తారు. రొమ్ములతో పాటు అండాశయాన్ని కూడా తొలగించవచ్చు. అవి ఆరోగ్యంగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో రొమ్ము, అండాశయ క్యాన్సర్లు రాకుండా ఉండటానికి ఇలా చేస్తారు.

ADVERTISEMENT

తరచూ అడిగే ప్రశ్నలు (Frequently Asked Questions)

అబ్బాయిలకు రొమ్ము క్యాన్సర్ వస్తుందా? 

వస్తుంది. కానీ చాలా అరుదనే చెప్పాలి. సాధారణంగా వయసు మళ్లినవారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. యుక్త వయసులో ఉన్నవారికీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రొమ్ముల్లో నొప్పి కలిగించని గడ్డలు ఏర్పడతాయి. రొమ్ములపై ఉన్న చర్మంలో మార్పులు వస్తాయి. చర్మం సొట్టలు పడటం, దురద రావడం, చర్మం రంగు మారడం, చర్మం పొరలుగా ఊడిపోతుండడం జరుగుతుంటుంది. చనుమొనల్లో సైతం మార్పులు వస్తాయి.

అలాగే చనుమొనలు ఎర్రగా మారడం, లోపలికి నొక్కుకుపోయినట్లుగా కనిపించడం జరుగుతుంది. పురుషుల్లో రొమ్ము క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తిస్తే.. దాన్ని నయం చేయడం సులభం. సాధారణంగా క్యాన్సర్ సోకిన బ్రెస్ట్ టిష్యూను సర్జరీ ద్వారా తొలిగిస్తారు. అలాగే రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ ద్వారా కూడా రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తారు.

బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడమెలా?

మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి మూడు రకాల పరీక్షలను చేస్తారు. బ్రెస్ట్ ఎగ్జామ్, మామోగ్రఫీ, అల్ట్రా సౌండ్ స్కాన్ ద్వారా నిర్దారిస్తారు. నలభై ఏళ్లు దాటిన మహిళలు కచ్చితంగా ఏడాదికోసారి ఈ స్క్రీనింగ్ పరీక్షలు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్‌కు చికిత్సనందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా, ఛారిటీ ఆసుపత్రుల్లో నామమాత్ర రుసుము తీసుకొని ఈ పరీక్షలు చేస్తారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మహిళల్లో తొలి దశలోనే రొమ్ము క్యాన్సర్‌ను గుర్తించేందుకు వీలుగా హెల్త్ కేర్ వర్కర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వారు క్రమం తప్పకుండా మహిళలను పరీక్షించి అనుమానించదగిన లక్షణాలు కనిపిస్తే.. వారిని స్క్రీనింగ్ పరీక్షల కోసం పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా రొమ్ము క్యాన్సర్ ద్వారా జరిగే మరణాలను చాలా వరకు తగ్గించవచ్చు.

రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాన్నిఎలా తగ్గించుకోవాలి?

ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటూ.. తగినంత వ్యాయామం చేయడం ద్వారా రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలను తగ్గించుకోవచ్చు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాల్సి ఉంటుంది. ఆల్కహాల్ అలవాటు ఉన్నట్లయితే వెంటనే దాన్ని మానేయడం మంచిది. అలాగే రొమ్ము క్యాన్సర్ పై అవగాహన పెంచుకొని ముందుగానే లక్షణాలను గుర్తించడం ద్వారా తొలిదశలోనే చికిత్స తీసుకోవచ్చు. ఫలితంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా జీవితాన్ని కొనసాగించవచ్చు.

ADVERTISEMENT

నా తల్లికి  రొమ్ము క్యాన్సర్ ఉంది. అది నాక్కూడా వస్తుందా?

రక్త సంబంధీకులకు ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉంటే మీక్కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న క్యాన్సర్ కేసుల్లో 5 నుంచి పది శాతం వంశపారంపర్యంగా వస్తున్నవే అని నిపుణులు నిర్ధారించారు. కాబట్టి ముందుగా మీరు వైద్యులను సంప్రదించండి. వారు మిమ్మల్ని పరీక్షించి ఎంత మేర క్యాన్సర్ వచ్చే అవకాశాలున్నాయో  అంచనా వేస్తారు. అలాగే ముందు జాగ్రత్తగా అవసరమైన చికిత్స సైతం చేస్తారు.

రొమ్ము క్యాన్సర్ వయసు పైబడిన వారికే వస్తుందా? చిన్న వయసు వారికి వచ్చే అవకాశాలేమైనా ఉన్నాయా?

రొమ్ము క్యాన్సర్ ఎవరికైనా.. ఏ వయసులోనైనా రావచ్చు. అయితే 50  ఏళ్లు దాటిన వారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 30 ఏళ్ల లోపు వయసున్నవారిలో రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. మనదేశంలో నమోదవుతున్న రొమ్ము క్యాన్సర్ కేసుల్లో కేవలం నాలుగు శాతం మాత్రమే 30 ఏళ్ల లోపు వారున్నారు. 50 ఏళ్లు దాటిన వారి సంఖ్య 50 శాతానికి పైనే ఉంది. ఇరవై ఏళ్ల వయసులో క్యాన్సర్ రావడానికి 0.6 శాతం మాత్రమే అవకాశం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ పెరిగే అవకాశాలు పెరుగుతుంటాయి. దీనికి మన ఆరోగ్యం, జీవనసరళి, ఆహారపు అలవాట్లు సైతం కారణమవుతాయి.

POPxo ఇప్పుడు ఆరు భాషల్లో లభ్యమవుతోంది: ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు బెంగాలీ

కలర్ ఫుల్‌గా, క్యూట్‌గా ఉండే వస్తువులను మీరూ ఇష్టపడతారా? అయితే సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కూషన్స్, ల్యాప్ టాప్ స్లీవ్స్ ఇంకా మరెన్నో.. వాటికోసం POPxo Shop ని సందర్శించండి !

ADVERTISEMENT

Images: Shutterstock

ఇవి కూడా చదవండి:

క్యాన్సర్ మహమ్మారిని గెలిచారు.. విజేతలై అందరికీ ఆదర్శంగా నిలిచారు..!

బాధ‌ను పంచుకుందాం.. క్యాన్స‌ర్‌ని దూరం చేసేలా ప్రోత్స‌హిద్దాం..

ADVERTISEMENT

మ‌న పూర్వీకులకు ఉన్న ఈ ఆహారపు అలవాట్లు.. మ‌న ఆరోగ్యానికి శ్రీ‌రామ‌ర‌క్ష‌..!

01 May 2019

Read More

read more articles like this
good points

Read More

read more articles like this
ADVERTISEMENT