బేకింగ్ సోడా(Baking soda) వంటను రుచికరంగా మారుస్తుందనే విషయం మనకు తెలిసిందే. మొటిమల నుంచి అవాంఛిత రోమాలను తొలగించుకోవడం వరకు ఎన్నో సౌందర్యపరమైన సమస్యలకు పరిష్కారాన్ని అందిస్తుంది బేకింగ్ సోడా. చర్మ సమస్య ఏదైనా సరే.. దాన్ని సత్వరం తగ్గించే చిట్కాగా వంటసోడాను ఉపయోగించవచ్చు. మరి, సౌందర్యపరమైన ప్రయోజనాలను(Beauty benefits) పొందడానికి దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి?
బేకింగ్ సోడా.. దీన్నే మనం కుకింగ్ సోడా, వంట సోడా అని కూడా పిలుస్తాం. దీని శాస్త్రీయనామం సోడియం బై కార్బొనేట్. దాదాపు ప్రతి ఇంట్లోనూ వంటసోడా కచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని వివిధ రకాల పిండి వంటల్లో ఉపయోగిస్తారు. అలాగే కేక్ లు, బిస్కెట్ల తయారీలోనూ ఉపయోగిస్తారు.
బేకింగ్ సోడా వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు
బేకింగ్ సోడాను ఇలా కూడా ఉపయోగించవచ్చు
బేకింగ్ సోడా వల్ల కలిగే దుష్ప్రభావాలు
బేకింగ్ సోడా వల్ల కలిగే సౌందర్య ప్రయోజనాలు (Beauty Benefits Of Baking Soda In Telugu)
సాధారణంగా వంటల్లో రుచి కోసం ఉపయోగించే బేకింగ్ సోడా వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే సందేహం మీకు రావచ్చు. కానీ సౌందర్యపరమైన అవసరాలను తీర్చడంలో అది మనకు బాగా ఉపయోగపడుతుంది. వాటిని మనం పొందాలంటే బేకింగ్ సోడాను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం.
మొటిమలు తొలగించుకోవడానికి (To Get Rid Of Acne)
బేకింగ్ సోడాలో(baking soda) ఉన్న ఎక్స్ఫోలియేటింగ్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై వచ్చిన మొటిమలను ప్రభావవంతంగా తగ్గిస్తాయి. దీని కోసం టీస్పూన్ బేకింగ్ సోడాలో అంతే పరిమాణంలో నీటిని కలపాలి. ముఖాన్ని శుభ్రం చేసుకొని మొటిమలపై ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ఐస్ క్యూబ్ తో కాస్త రబ్ చేసి టోనర్ అప్లై చేయాలి. చర్మం పొడిగా మారినట్లినిపిస్తే కాస్త మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికోసారి ఇలా చేయడం ద్వారా మొటిమలు తగ్గించుకోవచ్చు.
మచ్చలను తగ్గిస్తుంది (Reduce Scarring)
మొటిమలు లేదా మరే ఇతర కారణం వల్లైనా ముఖంపై మచ్చలు ఏర్పడతాయి. బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల వాటిని చర్మం రంగులో కలిసిపోయేలా చేయచ్చు. గిన్నెలో టీస్పూన్ బేకింగ్ సోడా తీసుకోవాలి. దీనిలో అరచెక్క నిమ్మరసాన్ని పిండాలి. ఈ రెండింటినీ చిక్కటి మిశ్రమంగా తయారుచేయాలి. ముందుగా మచ్చలున్న చోట ఈ మిశ్రమాన్ని రాసుకోవాలి. మిశ్రమం మిగిలితే మిగిలిన చర్మానికి కూడా అప్లై చేసుకోవచ్చు. రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మరోసారి చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. బేకింగ్ సోడా రాసిన తర్వాత చర్మం పొడిగా అనిపించినట్లయితే మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా మచ్చలు క్రమంగా చర్మం రంగులో కలిసిపోతాయి.
బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి (To Fet Rid Of Blackheads)
జిడ్డు చర్మతత్వం కలిగినవారికి మొటిమల సమస్యతో పాటు బ్లాక్ హెడ్స్ సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. చర్మరంధ్రాల్లో మురికి, జిడ్డు చేరడం వల్ల బ్లాక్ హెడ్స్ వస్తాయి. బేకింగ్ సోడా చర్మరంధ్రాల్లో ఉన్న మురికిని తొలగిస్తుంది. దీని వల్ల బ్లాక్ హెడ్స్ సమస్య తగ్గుముఖం పడుతుంది. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను ఒక స్ప్రే బాటిల్లో వేయాలి. ఆ తర్వాత నీరు కూడా పోసి ఈ రెండూ బాగా కలిసేంత వరకు షేక్ చేయాలి. ఇప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా మిశ్రమాన్ని ముఖంపై స్ప్రే చేసుకొని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా చేయడం వల్ల చర్మరంధ్రాల్లో ఉన్న మురికి, జిడ్డు వదిలిపోతాయి. ఈ చిట్కాను ప్రతిరోజూ పాటించడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ బేకింగ్ సోడా మిశ్రమాన్ని రిఫ్రిజరేటర్లో భద్రపరచుకోవచ్చు.
మృతకణాలు తొలగించుకోవడానికి (To Remove Dead Skin)
మనం తరచూ ఫేస్ వాష్ చేసుకొన్నప్పటికీ చర్మంపై ఉన్న మురికి, మృతకణాలు పూర్తిగా వదలిపోవు. మరి, పూర్తిగా ముఖ చర్మాన్ని శుభ్రం చేసుకోవాలంటే? దానికి బేకింగ్ సోడా మంచి పరిష్కారాన్నిస్తుంది. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో అరచెంచా నీరు కలిపి దాన్ని చిక్కటి మిశ్రమంగా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని తయారుచేసే క్రమంలో బేకింగ్ సోడా పూర్తిగా కరిగిపోకుండా చూసుకోవాలి. ముందుగా ముఖాన్ని శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత ముందుగా తయారుచేసి పెట్టుకొన్న స్క్రబ్ ను ముఖానికి రాసుకొని గుండ్రంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేసేటప్పుడు కళ్లకు, కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి బేకింగ్ సోడా మిశ్రమం తగలకుండా చూసుకోవాలి. స్క్రబ్ చేసుకొన్న తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పొడిచర్మం, సున్నితమైన చర్మం కలిగినవారు ఈ చిట్కాను పాటించకపోవడమే మంచిది.
మెరిసే చర్మానికి: బేకింగ్ సోడా, (For Shiny Hair)
కమలాఫల రసంతో తయారైన మిశ్రమం చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా(baking soda)కు రెండు టేబుల్ స్పూన్ల కమలాఫల రసాన్ని కలపాలి. ముఖాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత చర్మం కాస్త తడిగా ఉన్నప్పుడే బేకింగ్ సోడా, కమలాఫల రసం మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మాన్ని పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఆరెంజ్ జ్యూస్ చర్మం పీహెచ్ విలువను క్రమబద్దీకరిస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి చర్మ ఆరోగ్యాన్ని రక్షించే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. బేకింగ్ సోడా చర్మ రంధ్రాల్లోని మురికిని తొలగిస్తుంది. వారానికోసారి ఈ ప్యాక్ వేసుకోవడం ద్వారా చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.
జిడ్డు చర్మానికి (To Get Rid Of Oily Skin)
చర్మం జిడ్డుగా ఉండటం వల్ల మొటిమలు, బ్లాక్ హెడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే చర్మం జిడ్డుగా మారకుండా జాగ్రత్తపడటం మంచిది. దానికి బేకింగ్ సోడా సరైన ప్రత్యామ్నాయం. ఈ ఫలితాన్ని పొందడానికి టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాలో టీస్పూన్ నీరు పోయాలి. అంటే పెద్ద చెంచాడు బేకింగ్ సోడాలో చిన్న చెంచాడు నీటిని కలపాలి. ముందుగా చర్మాన్ని క్లెన్సర్ తో శుభ్రం చేసుకొని పొడిగా తుడుచుకోవాలి. ఆ తర్వాత బేకింగ్ సోడా, నీరు మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్ లా వేయాలి. కళ్లకు, కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి బేకింగ్ సోడా తగలకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పదిహేను నుంచి ఇరవై సెకన్లపాటు మర్దన చేసుకొని చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ముఖాన్ని పొడిగా తుడుచుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ముఖానికి గాయాలున్నట్లైతే ఈ ప్యాక్ ను వేసుకోకూడదు.
గులాబీ రంగు పెదవులు పొందడానికి (Getting Pink Lips)
పెదవులను తరచూ కొరుక్కోవడం, ఎక్కువ సమయం లిప్స్టిక్ వేసుకోవడం, నిర్ణీత వ్యవధి తర్వాత లిప్స్టిక్ ను తొలగించకపోవడం, ఎక్కువ సమయం ఎండలో ఉండటం, పెదవులు సంరక్షణ విషయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల పెదవులు నల్లగా తయారవుతాయి. పెదవులు మళ్లీ మునపటిలా గులాబీ రంగులోకి రావాలంటే.. బేకింగ్ సోడా ఉపయోగించాల్సిందే. దీన్ని తేనెతో కలిపి ఉపయోగించడం వల్ల పెదవుల రంగు మారడంతో పాటు వాటికి తగిన పోషణ సైతం అందుతుంది. టీస్పూన్ చొప్పున బేకింగ్ సోడా, తేనె తీసుకొని మిశ్రమంగా తయారుచేసుకోవాలి. మీ పెదవులు పొడిగా ఉంటే మరికాస్త తేనె జోడించవచ్చు. ఈ మిశ్రమాన్ని పెదవులకు అప్లై చేసి సున్నితంగా, వేళ్లను గుండ్రంగా తిప్పుతూ రుద్దుకోవాలి. మర్దన చేసుకొన్న అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొని లిప్ బామ్ రాసుకోవాలి.
మోచేతులు, మోకాళ్ల నలుపు తగ్గడానికి (Reduce Blackness Of Elbows And Knees)
మోచేతులు, మోకాళ్ల వద్ద చర్మం అందంగా ఉండటం సౌందర్యానికి ఏ మాత్రం కొలమానం కాదు. కానీ మిగిలిన చర్మంతో పోలిస్తే అక్కడి చర్మం కాస్త డార్క్ ఉంటే అది చూడటానికి అంత బాగోదు. అందుకే అక్కడ చర్మం లైట్ గా మారడానికి బేకింగ్ సోడా ఉపయోగించవచ్చు. దీని కోసం మనం బేకింగ్ సోడా, బంగాళాదుంప మిశ్రమాన్ని ఉపయోగించాలి. చిన్న సైజులో ఉన్న బంగాళాదుంపను సన్నగా తురుముకోవాలి. ఈ తురుము నుంచి రసాన్ని వేరు చేయాలి. బంగాళాదుంప రసంలో టీ స్పూన్ బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమంలో దూదిని ముంచి దానితో మోకాళ్లు, మోచేతుల దగ్గర రాసుకోవాలి. పది నిమిషాల తర్వాత ధారగా పడుతున్న నీటి కింద దీనిని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత మాయిశ్చరైజింగ్ సన్ స్క్రీన్ రాసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ చిట్కాను పాటించడం ద్వారా అక్కడి చర్మం లైట్ టోన్లోకి మారుతుంది. ఈ చిట్కాను అండర్ ఆర్మ్స్, ఇన్నర్ థైస్ వద్ద ఉన్న నలుపుని తగ్గించుకోవడానికి ఉపయోగించవచ్చు.
మెడ మీద ఏర్పడిన నలుపు తగ్గించడానికి (To Remove Blackness Of Neck)
టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను టీ స్పూన్ నీటిలో కరిగించి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకొనే ముందు మెడను సబ్బు లేదా క్లెన్సర్ తో శుభ్రం చేసుకోవాలి. టవల్ తో పొడిగా తుడుచుకొని కరిగించి పేస్ట్ గా మార్చిన బేకింగ్ సోడాను మెడకు రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొని మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ చిట్కాను మెడ వద్ద మీ శరీర రంగులో కలిసేంత వరకు ప్రతి రోజూ పాటించాలి. ఆ తర్వాత వారానికి రెండు సార్లు పాటించడం ద్వారా స్కిన్ రంగు ఎప్పుడూ ఒకేలా ఉంటుంది.
శరీర దుర్వాసనను పోగొడుతుంది (Remove Body Odor)
అధిక చెమటకు చర్మంపై ఉన్న బ్యాక్టీరియా తోడైతే దుర్వాసన అధికమవుతుంది. ఈ సమస్య చాలామందిని వేధిస్తుంది. దీని నుంచి బయటపడేందుకు పెర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ ఉపయోగిస్తుంటారు. అయితే బేకింగ్ సోడా ఉపయోగించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను అంతే మోతాదులో నిమ్మరసంలో కలిపి మిశ్రమంగా తయారుచేయాలి. దీన్ని స్నానానికి ముందు చెమట ఎక్కువగా పట్టే భాగాలైన మెడ, చంకలు, వీపు తదితర భాగాల్లో రాసుకోవాలి. పావుగంట తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఇలా ఓ వారం రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ చిట్కాను పాటించాలి. ఆ తర్వాత రోజు విడిచి రోజు పాటించాల్సి ఉంటుంది.
లోపలికి పెరిగే వెంట్రుకలను తొలగించడానికి (To Remove The Hair That Grow Inside)
వ్యాక్సింగ్, షేవింగ్ చేసుకొన్న తర్వాత కొన్నిసార్లు వెంట్రుకలు చర్మం లోపలికి పెరుగుతుంటాయి. ఇలాంటి వాటిని తొలగించడం కూడా కష్టమే. అయితే బేకింగ్ సోడా ఉపయోగించి వాటిని సులభంగా తొలగించవచ్చు. ముందుగా వెంట్రుకలు లోపలికి బాగా పెరిగిన చోట ఆముదం రాసి మసాజ్ చేయాలి. కాసేపాగిన తర్వాత తడి చేసి పిండిన కాటన్ క్లాత్ తో ఒకసారి పైపైన తుడవాలి. ఇప్పుడు నీరు, బేకింగ్ సోడా సమ పాళ్లలో తీసుకొని పేస్ట్ లా తయారు చేయాలి. ఆ తర్వాత ఆముదం రాసిన చోట బేకింగ్ సోడా పేస్ట్ తో కొంత సేపు రబ్ చేయ ాలి. ఆపై ట్వీజర్ తో ప్లక్ చేసేస్తే చాలా సులభంగా వచ్చేస్తుంది. ఆ తర్వాత చల్లటి నీటిలో ముంచిన కాటన్ ప్యాడ్ ను అక్కడ కాసేపు ఉంచితే సరిపోతుంది. ఆముదం చర్మాన్ని పొడిబారకుండా చేస్తుంది. బేకింగ్ సోడా వెంట్రుకల కుదుళ్లను వదులుగా అయ్యేలా చేస్తుంది. అందుకే వెంట్రుకలను సులభంగా తొలగించడానికి వీలవుతుంది.
పాదాల పగుళ్లు తగ్గడానికి (To Remove Foot Cracks)
చాలామంది మహిళలు పాదాల పగుళ్లతో బాధపడుతుంటారు. దీన్ని తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. బేకింగ్ సోడా ఉపయోగించడం ద్వారా పాదాలను మృదువుగా మార్చుకోవచ్చు. దీని కోసం బకెట్లో పాదాలు మునిగేంత వరకు వేడి నీటిని నింపాలి. ఈ నీరు మరీ వేడిగా ఉండకూడదు. ఈ నీటిలో మూడు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయాలి. ఈ నీటిలో పాదాలను పావుగంట నుంచి ఇరవై నిమిషాల వరకు ఉంచాలి. ఆ తర్వాత ప్యుమిస్ స్టోన్ తో పాదాలను సున్నితంగా రుద్దుకోవాలి. పాదాలపై ఉన్న మృతకణాలు వదిలిపోయిన తర్వాత మాయిశ్చరైజింగ్ లోషన్ లేదా కొబ్బరి నూనె అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత పాదాలకు సాక్స్ వేసుకోవాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది.
ర్యాషెస్ తగ్గడానికి (To Reduce Rashes)
కొన్ని సందర్బాల్లో చర్మంపై ఎర్రటి పొక్కులు ఏర్పడతాయి. వాటిని తగ్గించుకోవడానికి కూడా బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాకు, మరో టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి. సమస్య తగ్గేంత వరకు ఇలా ప్రతి రోజూ పాటిస్తే ర్యాషెస్ తగ్గిపోతాయి.
ఫేసియల్ హెయిర్ తగ్గించుకోవడానికి (To Reduce Facial Hair)
ఫేసియల్ హెయిర్ అమ్మాయిలను చాలా ఇబ్బంది పెడుతుంది. వాటిని తొలగించుకోవడానికి అమ్మాయిలు చాలానే ప్రయత్నాలు చేస్తుంటారు. బేకింగ్ సోడా ఉఫయోగించడం ద్వారా వాటిని సులభంగా తొలగించుకోవచ్చు. దీని కోసం 200 మి.లీ. వేడి నీటిలో టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా కలపి మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమంలో దూది ముంచి బాగా పిండాలి. ముఖంపై వెంట్రుకలు ఎక్కువగా ఉన్న చోట ఆ దూదిని ఉంచి బ్యాండేజ్ వేయాలి. మరుసటి రోజు ఉదయం బ్యాండేజ్ తొలగించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత ముఖానికి మాయిశ్చరైజర్ రాసుకోవాలి.
జుట్టు ఒత్తుగా ఉండాలంటే.. (Shiny Hair)
జుట్టు ఒత్తుగా ఉండాలని ప్రతిఒక్కరూ కోరుకొంటారు. దాని కోసమే రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. మీరు కూడా అంతేనా? అయితే ఓసారి మీరు బేకింగ్ సోడాను ప్రయత్నించి చూడండి. చక్కటి ఫలితం లభిస్తుంది. దీని కోసమ మూడు కప్పుల నీటిలో ఒక కప్పు బేకింగ్ సోడా, 20 చుక్కల ఆముదం కలపాలి. ఈ మిశ్రమాన్ని షాంపూ మాదిరిగా ఉపయోగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని స్కాల్ప్ కు మసాజ్ చేసుకోవాలి. రెండు నిమిషాల తర్వాత తలను మరోసారి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత హెయిర్ కండిషనర్ రాసుకొంటే సరిపోతుంది. బేకింగ్ సోడా ఉపయోగించడం ద్వారా జుట్టుపై ఉన్న రసాయనాల ప్రభావం పడకుండా చూస్తుంది. అలాగే సహజమైన నూనెలను తొలగించుకుండా మురికిని మాత్రమే తొలగిస్తుంది.
చుండ్రు సమస్య తగ్గిస్తుంది (Reduce Dandruff Problems)
చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాం. బేకింగ్ సోడా కూడా ఈ సమస్యను తగ్గిస్తుంది. దీని కోసం తలను కాస్త తడిపి టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను స్కాల్ప్ కు రాసుకొని సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఆ తర్వాత తలను నీటితో శుభ్రం చేసుకొని కండిషనర్ రాసుకొంటే సరిపోతుంది. షాంపూ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఈ చిట్కాను వారానికి రెండుసార్లు పాటించడం ద్వారా మంచి ఫలితం కనిపిస్తుంది.
చూశారుగా.. ఇవి బేకింగ్ సోడా ఉపయోగించడం వల్ల చర్మానికి, కురులకు అందుతున్న సౌందర్య ప్రయోజనాలు. వీటిని మీ బ్యూటీ రొటీన్ లో భాగం చేసుకోవడం ద్వారా మీ సౌందర్యం మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
బేకింగ్ సోడాను ఇలా కూడా ఉపయోగించవచ్చు (Other Benefits Of Baking Soda)
కేవలం సౌందర్య ప్రయోజనాలేనా..? ఇతరత్రా ఉపయోగాలు కూడా ఉన్నాయా? కచ్చితంగా ఉన్నాయి. బేకింగ్ సోడాను టూత్ పేస్ట్ గా, షాంపూగా, డియోడరెంట్ గా ఇలా ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు. దాని కోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు తెలుసుకొందాం..
దంతాలు తెల్లగా మారడానికి (Tooth Whitening)
పళ్లు పసుపు రంగులోకి మారడం అందరిలోనూ సహజంగా జరిగేదే. మరి, పళ్లను తెల్లగా మార్చడానికి ఏం చేయాలి? బేకింగ్ సోడా ఉపయోగిస్తే సరి. అర టీస్పూన్ బేకింగ్ సోడాలో కొన్ని చుక్కల నీరు వేసి పేస్ట్ మాదిరిగా తయారుచేయాలి. దీన్ని టూత్ బ్రష్ పై వేసి పైకి, కిందకు, గుండ్రంగా తోమాలి. రెండు నిమిషాల తర్వాత నీటితో నోరు శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. ఇలా వారానికి ఒకటి నుంచి రెండు సార్లు చేయడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు.
షాంపూగా.. (Can Be Used As Shampoo)
బేకింగ్ సోడాను షాంపూ మాదిరిగా ఉపయోగించవచ్చు. దీన్ని తయారు చేసుకోవడం కూడా సులభమే. దీని తయారీకి కావాల్సినవి: బేకింగ్ సోడా, ముప్పావు కప్పు ప్యూరిఫైడ్ వాటర్, 10 చుక్కల లావెండర్ ఎస్సెన్షియల్ నూనె, శుభ్రమైన షాంపూ బాటిల్. వంటసోడా, నీరు.. షాంపూ బాటిల్లో వేసి బాగా షేక్ చేయాలి. చివరిలో లావెండర్ నూనె కూడా వేసి బాగా షేక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలపై వేసుకొని కొన్ని నిమిషాల పాటు రుద్దుకొని ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
సూర్యరశ్మి ప్రభావం నుంచి రక్షిస్తుంది (Protects Against Harmful Effects Of Sunlight)
సూర్యరశ్మి ప్రభావం కారణంగా చర్మంపై పొక్కులు రావడం, చర్మం ఎర్రగా మారిపోవడం జరుగుతుంది. ఇలా జరగకుండా ఉండాలంటే.. నాలుగు చెంచాల ఓట్స్ పిండికి చెంచా బేకింగ్ సోడా కలపాలి. ఈ మిశ్రమానికి మరో చెంచా పాలు కలిపి చర్మానికి నలుగులా పెట్టుకొని స్నానం చేయాలి. ఇవి చర్మాన్ని సూర్యరశ్మి ప్రభావం కారణంగా ఎదురైన చర్మ సమస్యలను తగ్గిస్తుంది.
దురద తగ్గిస్తుంది (Reduce Itching)
బేకింగ్ సోడాలో యాంటీ ఫంగల్ గుణాలుంటాయి. ఇవి దురద రావడానికి కారణమైన ఫంగస్ ను సంహరిస్తాయి. బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో కలిపి దాన్ని ప్రభావిత ప్రాంతంలో రాసుకొంటే సరిపోతుంది.
డియోడరెంట్ గా (Can Be Used As Deodrant)
చెమట కారణంగా శరీరం నుంచి వచ్చే దుర్వాసనను బేకింగ్ సోడా పోగొడుతుంది. ఈ ఫలితాన్ని పొందడానికి ఒక వంతు బేకింగ్ సోడాకు ఆరు వంతుల కార్న్ స్టార్చ్ కలిపి దాన్ని పౌడర్ మాదిరిగా అండర్ ఆర్మ్స్ లో చల్లుకోవాలి.
బేకింగ్ సోడాను ఇన్ని రకాలుగా ఉపయోగించవచ్చా అని ఆశ్చర్యపోతున్నారా? దాదాపుగా ప్రతి ఇంట్లోనూ బేకింగ్ సోడా కచ్చితంగా ఉంటుంది. దీన్ని కొనుగోలు చేయడానికి ప్రత్యేకించి సమయం కూడా కేటాయించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీకు వీలు చిక్కినప్పుడు ఈ చిట్కాలను ప్రయత్నించి చూడండి. కచ్చితంగా ఫలితం కనిపిస్తుంది.
బేకింగ్ సోడా వల్ల కలిగే దుష్ప్రభావాలు (Side Effects Of Baking Soda)
చర్మ సౌందర్యం విషయంలో బేకింగ్ సోడాను నీటిలో కలిపి లేదా ఇతర పదార్థాలతో కలిపి ఉపయోగిస్తాం కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఎదురవ్వవు. డైల్యూట్ చేయకుండా ఉపయోగిస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే బేకింగ్ సోడాను ఎప్పుడు ఉపయోగించినా తగినంత నీటిలో లేదా ఇతర పదార్థాల్లో కలిపి దాని గాఢతను తగ్గించి ఉపయోగించడం మంచిది.
- పొడిచర్మం, సున్నితమైన చర్మం కలిగినవారు బేకింగ్ సోడా ఉపయోగించకపోవడమే మంచిది. ఎందుకంటే దీని వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.
- బేకింగ్ సోడా ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మం త్వరగా ముడతలు పడే అవకాశం ఉంది.
- కొన్ని సందర్భాల్లో మొటిమలు తగ్గడానికి బదులుగా అవి మరింత పెరిగే అవకాశమూ లేకపోలేదు.
- బేకింగ్ సోడాను జుట్టుపై ఎక్కువగా ఉపయోగిస్తే అది కురులను పొడిగా మార్చేస్తుంది.
- కొన్నిసార్లు బేకింగ్ సోడా చర్మం పీహెచ్ విలువను మార్చేస్తుంది. దీని కారణంగానూ చర్మసంబంధ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దీన్ని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
బేకింగ్ సోడాను అప్లై చేసుకొన్నప్పుడు చర్మం మంటగా అనిపిస్తే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం మంచిది. అంతేకాదు.. ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది.
తరచూ అడిగే ప్రశ్నలు (FAQ’s)
1. బేకింగ్ సోడా చర్మానికి హాని చేస్తుందా?
సాధారణంగా బేకింగ్ సోడా గాఢతను తగ్గించి అంటే నీటిలో లేదా ఇతర పదార్థాల్లో కలిపి ఉపయోగిస్తాం కాబట్టి చర్మానికి పెద్దగా హాని జరగదు. కానీ కొన్ని సందర్భాల్లో బేకింగ్ సోడా చర్మం పీహెచ్ విలువపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల చర్మం పొడిగా మారిపోతుంది. అందుకే బేకింగ్ సోడాను తరచూ ఉపయోగించకూడదు.
2. సున్నితమైన చర్మం(సెన్సిటివ్ స్కిన్)పై బేకింగ్ సోడా ఉపయోగించవచ్చా?
బేకింగ్ సోడా గాఢత చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల సెన్సిటివ్ స్కిన్ పై ప్రభావం చూపించే అవకాశం లేకపోలేదు. కాబట్టి సున్నితమైన చర్మం కలిగిన వారు బేకింగ్ సోడా ఫేస్ ప్యాక్ వేసుకొనే ముందు ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ఎలాంటి ఇబ్బంది లేకపోతే బేకింగ్ సోడా ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. అయితే వారానికి ఒకసారి మాత్రమే బేకింగ్ సోడాను చర్మంపై ఉపయోగించాల్సి ఉంటుంది.
3. బేకింగ్ సోడాకు బదులుగా బేకింగ్ పౌడర్ ఉపయోగించవచ్చా?
బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వేర్వేరు ఉత్పత్తులు. వీటి కెమికల్ కాంపోజిషన్ కూడా వేర్వేరుగానే ఉంటుంది. కాబట్టి బేకింగ్ సోడాకి బదులుగా బేకింగ్ పౌడర్ ఉపయోగించకూడదు. బేకింగ్ పౌడర్తో తయారుచేసే వంటలు పొంగినట్లుగా రావడానికి బేకింగ్ సోడాను ఉపయోగిస్తారు. బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ రెండూ వేర్వేరు. కానీ కుకింగ్ సోడా, బేకింగ్ సోడా రెండూ ఒకటే.
4. బేకింగ్ సోడాను ప్రతి రోజూ ముఖంపై ఉపయోగించవచ్చా?
బేకింగ్ సోడాను ముఖచర్మంపై ప్రతిరోజూ ఉపయోగించకూడదు. ఎందుకంటే ఇది చర్మం పీహెచ్ విలువను మార్చేస్తుంది. పైగా బేకింగ్ సోడా గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అతిగా ఉపయోగించడం వల్ల అనర్థమే కానీ ఎలాంటి ప్రయోజనం ఉండదు. వారానికి ఒకటి నుంచి రెండుసార్లు ఉపయోగిస్తే సరిపోతుంది.
5. బేకింగ్ సోడాను షాంపూగా ఉపయోగించడం మంచిదేనా? జుట్టు పెరుగుదలకు అది ఏరకంగా దోహదపడుతుంది?
బేకింగ్ సోడాతో షాంపూ జుట్టుపై పేరుకొన్న మురికి, జిడ్డును సమర్థంగా వదలగొడుతుంది. అలాగని దీన్ని ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. ఏదో వారానికి ఒకసారి వాడితే మంచి ఫలితం పొందవచ్చు. కానీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల జుట్టు పొడిగా, నిర్జీవంగా మారిపోతుంది. అలాగే జుట్టు రాలిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. కాబట్టి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం మంచిది.
ఇంకా చదవండి –
Baking Soda Benefits for Face in Hindi
Images: Shutterstock
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ
క్యూట్‌గా, కలర్ఫుల్‌గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.