శనగ పప్పు .. తెలుగువారి వంటల్లో దీని పాత్ర ప్రత్యేకమైంది. అయితే కేవలం వంటలో మాత్రమే కాదు.. ఆరోగ్య పరిరక్షణలో.. సౌందర్య పోషణలో కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. శనగ పప్పులో ఎన్నో పోషకాలుంటాయి. అలాగే చర్మ పరిరక్షణకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది. మరి.. మనం కూడా శనగ పప్పు ఉపయోగాల (Benefits) గురించి మరింత సమాచారం తెలుసుకుందామా
శనగ పప్పులో (chana dal) అనేక పోషకాలుంటాయి. అలాగే పీచు పదార్థం కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే కొవ్వుగుణాలు తక్కువగా ఉంటాయి. కప్పు శనగ పప్పులో.. కేవలం 252 క్యాలరీలు మాత్రమే ఉండడం విశేషం. ఇక పోషకాల విషయానికి వస్తే..
కార్బొహైడ్రేట్స్ 42గ్రా.
ప్రొటీన్లు 13 గ్రా.
ఫైబర్ 11గ్రా.
చక్కెరలు 7.3 గ్రా.
శ్యాచురేటెడ్ ఫ్యాట్ 0.4గ్రా.
పాలీ అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ 1.8 గ్రా.
మోనో అన్ శ్యాచురేటెడ్ ఫ్యాట్ 0.9 గ్రా.
సోడియం 387 ఎంజీ
పొటాషియం 199 ఎంజీ
వీటితో పాటు.. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ సి, ఫోలిక్ యాసిడ్, జింక్, క్యాల్షియం, ఐరన్ వంటివి కూడా శనగల్లో లభ్యమవుతాయి.
శనగ పప్పులోని పోషకాలు చర్మాన్ని అందంగా మెరిసేలా చేస్తాయి. అయితే ఈ ప్రయోజనాన్ని పొందాలంటే.. ముందుగా పప్పును బాగా ఎండబెట్టి.. పిండిగా చేయాలి. ఇలా తయారుచేసుకున్న పిండిని మాత్రమే చర్మానికి ఉపయోగించాలి.
సూర్యరశ్మి, కాలుష్యం ప్రభావం వల్ల సాధారణంగా శరీరంపై ట్యాన్ పెరిగిపోతుంది. శనగ పప్పులోని గుణాలు చర్మాన్ని డీట్యాన్ చేసి మెరిపిస్తాయి. అందుకే శనగ పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడంతో పాటు.. నాలుగు టీస్పూన్ల శనగ పిండి, టీస్పూన్ నిమ్మరసం, టీస్పూన్ పెరుగు, చిటికెడు ఉప్పు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖంతో పాటు.. మెడ భాగంలో ప్యాక్‌లా అప్లై చేసుకోవాలి. పూర్తిగా ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. ట్యాన్ సమస్య తొలగిపోతుంది.
జిడ్డుచర్మం కలిగినవారికి మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటి చర్మ సమస్యలు రావడం సహజం. అందుకే ముఖం జిడ్డుగా కనిపించకుండా ఉండేందుకు.. తరచూ దానిని శుభ్రం చేసుకోవాల్సి వస్తుంది. దీనివల్ల చర్మం రసాయనాల బారిన పడి.. ఇతర సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. శనగ పప్పు చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. అందుకోసం తొలుత పప్పును ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని రెండు టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. దీనికి రెండు టేబుల్ స్పూన్ల పాలు లేదా పెరుగు కలిపి.. ముఖానికి ప్యాక్ మాదిరిగా వేసుకుని 20 నిమిషాలు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ ముఖంపై ఉన్న జిడ్డును తొలిగిస్తుంది.
చాలామందికి మెడ, మోచేతుల భాగంలో.. చర్మం నలుపు రంగులోకి మారిపోవడం చూస్తుంటాం. ఇలా వచ్చిన పిగ్మంటేషన్‌ని తగ్గించేందుకు శనగ పప్పు ఉపయోగపడుతుంది. దీనికోసం పప్పును బాగా నానబెట్టి రుబ్బి.. ఆ మిశ్రమాన్ని నిమ్మరసంతో మిక్స్ చేసి.. దానిని చర్మం నల్లగా ఉన్న చోట రుద్దుకోవాలి. ఇలా తరచూ అప్లై చేయడం వల్ల నలుపు తగ్గుతుంది.
శనగ పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. మొటిమలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ ప్యాక్ వల్ల చర్మం మెరుస్తుంది. మచ్చలు కూడా తగ్గుతాయి. అందుకు చేయాల్సిందల్లా శనగ పిండిలో నిమ్మరసం, పాల పొడి వేసి.. బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. తర్వాత పావు గంట పాటు.. దానిని అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. మొటిమలతో పాటు మచ్చలు కూడా తగ్గుతాయి.
పొడి చర్మానికి తగినంత తేమను అందించేందుకు.. శనగ పిండితో చేసే ప్యాక్ ఎంతగానో తోడ్పడుతుంది. దీనికోసం ఒక అరటి పండును మెత్తని గుజ్జుగా చేసి.. అందులో తేనె, శనగపిండి మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దీన్ని చర్మానికి అప్లై చేసి.. పావు గంట పాటు అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి. దీనివల్ల పొడి చర్మంలోనూ.. తేమ పెరిగి చర్మం పట్టులా తయారవుతుంది.
మొటిమలు.. ఇది చాలామంది స్త్రీలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య. ముఖ్యంగా టీనేజ్‌లో ఉన్నవారికి ఇది సాధారణ సమస్య. శనగ పప్పులోని జింక్, విటమిన్లు మొటిమలను తగ్గిస్తాయి. దీనికోసం పప్పును తొలుత బాగా పొడి చేయాలి. రెండు స్పూన్ల ఆ పొడిలో.. టీస్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పాలతో దీన్ని మిక్స్ చేసి.. ఒక ప్యాక్‌లా చేసుకొని ముఖం, మెడ భాగాలతో పాటు.. మొటిమలు ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసుకోవాలి. ఆ తర్వాత.. 15 నిమిషాల పాటు దాన్ని అలాగే ఉంచుకొని కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తే.. మొటిమలతో పాటు బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా తగ్గిపోతాయి.
చర్మంపై ముడతలు రాకుండా ఉండేందుకు.. శనగ పప్పులోని గుణాలు ఎంతగానో తోడ్పడుతాయి. దీనికోసం శనగ పిండి రెండు టేబుల్ స్పూన్లు, పసుపు టీస్పూన్, పెరుగు రెండు టేబుల్ స్పూన్లు తీసుకొని.. వాటిని బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి.. పావు గంట పాటు ఉంచుకోవాలి. ఆ తర్వాత కడిగేస్తే సరిపోతుంది.
అవాంఛిత రోమాలను తొలిగించేందుకు శనగ పిండి చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనికి చేయాల్సిందల్లా పప్పుని పిండిగా చేసి.. అందులో పాలు పోసి ప్యాక్‌లా తయారుచేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. తర్వాత బాగా ఆరిపోయే వరకూ ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా ముఖాన్ని నలుపుతూ.. మిశ్రమాన్ని తీసేయడం వల్ల కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి.
ఇలా తరచూ ప్యాక్ వేసుకోవడం వల్ల అవాంఛిత రోమాల పెరుగుదల తగ్గుతుంది. అలాగే శనగ పిండి, మెంతి పొడిని సమపాళ్లలో తీసుకుని.. నీటితో కలిపి కూడా మిశ్రమాన్ని తయారుచేసుకోవచ్చు. దీన్ని ఫేషియల్ హెయిర్ పై ప్యాక్‌లా వేయాలి. ఇది బాగా ఆరిన తర్వాత.. ప్యాక్‌ను తొలగించి శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ కూడా వెంట్రుకలను తొలిగించడంతో తోడ్పడుతుంది.
చర్మంపై కనిపించే మృత కణాలను తొలిగించడంలో కూడా.. శనగ పప్పు ప్రధాన పాత్రను పోషిస్తుంది. దీనికోసం తొలుత పప్పును పొడిగా తయారుచేసుకోవాలి. ఈ పిండిని మూడు చెంచాలు తీసుకోవాలి. దీనికి ఒక టేబుల్ స్పూన్ ఓట్స్ పొడి, రెండు టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ కలపాలి. ఈ మిశ్రమానికి పచ్చిపాలు కలిపి పేస్ట్‌లా తయారుచేయాలి. అదే పేస్టును శరీరానికి రాసుకుని.. స్క్రబ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉండే మృత కణాలు, మురికి, జిడ్డు తొలిగిపోతాయి.
పార్టీ లేదా ఫంక్షన్లకు ముందు.. చర్మం మెరిసిపోతే ఎంత బాగుంటుందని అనుకునేవారిలో మీరూ ఉన్నారా? అయితే అప్పటికప్పుడు చర్మం మెరిసిపోయేలా ఓ ఫేస్ ప్యాక్‌ను ప్రయత్నించండి. ఇందుకు నాలుగు టీస్పూన్ల శనగ పిండి, టీస్పూన్ ఆరెంజ్ పీల్ పౌడర్, కొద్దిగా పాలు వేసి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.. 15 నిమిషాల పాటు ఉంచుకొని ఆ తర్వాత కడిగేసుకోవాలి. అంతే.. చర్మం మెరిసిపోతుంది.
ప్రతి రోజూ మనం తినే ఆహారంలో శనగ పప్పును.. కచ్చితంగా ఏదో ఒక రూపంలో భాగంగా చేసుకుంటూ ఉంటాం. కూరలకు పెట్టే పోపుల్లో, చట్నీల్లో, రోటి పచ్చళ్లలో శనగపప్పును ఉపయోగిస్తాం. ఇలా కొంచెం కొంచెం కాకుండా.. కాస్త ఎక్కువ మొత్తంలో శనగపప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల.. కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.
శనగ పప్పులో ప్రొటీన్లు, పీచుపదార్థం అధికంగా ఉంటాయి. ఉడకబెట్టిన శనగపప్పులో మన రోజువారీ అవసరాలకు సరిపడే మోతాదులో.. 54 శాతం ఫైబర్ లభిస్తుంది. అలాగే ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. దీనికి కారణం పప్పు చాలా నెమ్మదిగా జీర్ణమవడమే. రోజుకి వంద గ్రాముల ఉడకబెట్టిన శనగపప్పును తినడం ద్వారా.. జంక్ ఫుడ్ లేదా ఇతర చిరుతిళ్లకు దూరంగా ఉండచ్చు. అంటే బరువు పెరగకుండా కూడా చూసుకోవచ్చు. ఓ అధ్యయనం ప్రకారం.. రోజుకి సగటున 104 గ్రాముల చొప్పున.. ఉడకబెట్టిన శనగపప్పు లేదా శనగలను తినడం ద్వారా జంక్ ఫుడ్ తినాలనే ఆలోచన తగ్గుతుందని తేలిందట.
శనగ పప్పులో ప్లాంట్ బేస్డ్ ప్రొటీన్ అధికంగా ఉంటుంది. మాంసాహారానికి దూరంగా ఉండేవారికి ప్రొటీన్లు సరిగ్గా అందవు. కాబట్టి వారు.. ప్రొటీన్ల కోసం శనగ పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు. 60 గ్రాముల శనగపప్పులో.. ఆరు గ్రాముల వరకు ప్రొటీన్ లభిస్తుంది. ఇతర పప్పు దినుసులతో పోలిస్తే.. దీనిలో ఎక్కువ మోతాదులో ప్రొటీన్లు ఉంటాయి. అలాగే దీనిలో మనకు ఎంతో ఆవశ్యకమైన అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయి. ఈ ప్రొటీన్ల కారణంగా ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది.
బరువు తగ్గాలనుకునేవారు.. తమ ఆహారంలో భాగంగా శనగ పప్పును తీసుకోవడం చాలా మంచిది. ఇందులో పీచు పదార్థం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. అలాగే శనగపప్పులో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతి రోజూ కప్పు శనగపప్పు తినేవారు.. ఇతరులతో పోలిస్తే రోజుకి 25% మేర ఎక్కువ బరువు తగ్గుతున్నారని నిపుణులు చెబుతున్నారు.
శనగ పప్పులో మధుమేహాన్ని తగ్గించే గుణాలున్నాయి. ఇది ప్రొటీన్‌తో పాటు.. పీచుపదార్థాలను ఎక్కువగా అందిస్తుందనే విషయం తెలిసిందే . ఈ రెండూ మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. పైగా దీని గ్లైసిమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అలాగే ఇది నెమ్మదిగా జీర్ణమవడం వల్ల.. శరీరంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదలవుతుంది. వారానికి 728 గ్రాముల చొప్పున.. పన్నెండు వారాల పాటు శనగపప్పును ఆహారంగా తీసుకున్న వారిలో ఇన్సులిన్ స్థాయి పెరిగినట్లు పరిశోధనల్లో నిర్ధారణ అయ్యింది.
ఆహారం సులభంగా జీర్ణం కావాలంటే.. పీచుపదార్థం చాలా అవసరం. అది శనగపప్పులో తగినంత ఉంటుంది. ఇందులోని ఫైబర్ సులువుగా జీర్ణమై.. పోషకాలను అందించడంతో పాటు.. జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేయడానికి తోడ్పడుతుంది. అంతే కాదు.. ఇది పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచి, చెడు బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. జీర్ణాశయ క్యాన్సర్, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్ వంటి సమస్యలను కూడా రాకుండా చేస్తుంది.
శనగ పప్పు లేదా శనగలను ప్రతి రోజూ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. కొన్ని రకాల క్యాన్సర్లను రాకుండా చూసుకోవచ్చు. దీనిలో క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించే విటమిన్లు, మినరల్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. శనగ పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. పేగుల్లోని కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి.. క్యాన్సర్‌ను నియంత్రించడంతో పాటు.. ఇది క్యాన్సర్ కణితులను పెరగకుండా చూస్తుంది.
శనగ పప్పులో మెగ్నీషియం, పొటాషియం వంటి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఖనిజ లవణాలుంటాయి. ఇవి అధిక రక్తపోటును తగ్గిస్తాయి. శనగపప్పులోని పీచు పదార్థం రక్తంలోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతే కాదు.. గుండె ఆరోగ్యాన్ని దెబ్బ తీయడానికి కారణమయ్యే గుణాలన్నింటినీ శనగ పప్పు తగ్గిస్తుందన్న మాట. అందుకే తరచూ శనగ పప్పును ఆహారంలో భాగంగా తీసుకుంటే చాలు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.
శనగ పప్పులో ఫాస్ఫరస్, క్యాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలు, దంతాల ఆరోగ్యానికి చాలా అవసరం. కాబట్టి రోజూ ఆహారంలో శనగ పప్పును భాగంగా చేసుకుంటే.. ఆరోగ్యవంతమైన ఎముకలు మీ సొంతమవుతాయి. దంతాలు కూడా అందంగా, ఆరోగ్యంగా మెరిసిపోతాయి.
శనగ పప్పులో కంటి ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ ఎ, జింక్ ఉంటాయి. కాబట్టి కంటిచూపు మెరుగవుతుంది. ముఖ్యంగా రేచీకటితో బాధపడేవారు.. శనగపప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం ద్వారా.. ఈ సమస్యను కాస్త తగ్గించుకోవచ్చు.
గర్భం దాల్చిన ప్రతి మహిళ.. ఫోలిక్ యాసిడ్‌ను కచ్చితంగా తీసుకోవాల్సిందే. ఇది గర్భంలో పెరుగుతున్న బిడ్డ వెన్నెముక, మెదడులో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూస్తుంది. అలాగే బిడ్డ శరీరంలో ఎర్ర రక్తకణాలు ఏర్పడడానికి కూడా ఉపయోగపడుతుంది. అందుకే గర్భిణీ స్త్రీలు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ ఎక్కువగా తీసుకోవాలి. శనగ పప్పులో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి గర్భిణులు కచ్చితంగా దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.
శనగ పప్పులో ఫాస్ఫరస్ అధికంగా ఉంటుందనే విషయం మనకు తెలిసిందే. ఇది శరీరంలోని ఆమ్లాలను సమతుల్యం చేస్తుంది. ఫలితంగా శరీరంలోని.. పీహెచ్ విలువ సైతం సమతులంగా ఉంటుంది.
శనగ పప్పును ఆహారంలో భాగంగా చేసుకోవడం చాలా సులభం. తెలుగు వారికి శనగ పప్పును తాలింపుల్లో, పచ్చళ్లలో వేయడం అలవాటు. అలాగే కొంతమంది కూరగా కూడా వండుకుంటారు. అసలు శనగపప్పు లేని వంటిల్లు ఉండదంటే అతిశయోక్తి కాదేమో. వీటితో పాటుగా సూప్స్, సలాడ్స్, శాండ్ విచెస్లో శనగపప్పును భాగం చేసుకోవచ్చు.
బాగా ఉడకబెట్టిన శనగపప్పు లేదా శనగలను తాలింపు వేసుకుని తినడం.. మనకు అలవాటైన పనే. ఇంట్లోనే తయారు చేసుకునే బర్గర్లలో మాంసానికి బదులుగా.. శనగపప్పును ఉపయోగించి ప్యాటీలు తయారుచేసుకోవచ్చు. శనగపప్పును మెత్తగా ఉడికించి ఆలివ్ నూనెలో కొద్దిగా రోస్ట్ చేసి వెల్లుల్లి, తగినంత ఉప్పు, నిమ్మరసం వేస్తే చాలా రుచిగా ఉంటుంది. గోదావరి జిల్లాల్లో అయితే శనగపప్పు, కొబ్బరి కలిపి కూరగా చాలామంది వండుకుంటారు. ఇది కూడా మనకు పోషకాలను అందిస్తుంది.
శనగ పప్పును ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే దీన్ని తీసుకోవడం వల్ల కొందరికి దుష్ప్రభావాలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. అవేంటంటే..
1.శనగ పప్పు ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేస్తుంది. అయితే మోతాదుకి మించి ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వల్ల.. అది గ్యాస్ట్రిక్ సమస్యకు కారణమవుతుంది. ఎందుకంటే ఇది చాలా నెమ్మదిగా జీర్ణమవుతుంది.
2 .శనగపప్పును మరీ ఎక్కువగా ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల.. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
3. పప్పు ధాన్యాలు తినడం వల్ల కొందరిలో అలర్జీలు తలెత్తుతుంటాయి. అలాంటి వారు శనగ పప్పును తినడం వల్ల డయేరియా, వాంతులు, తల తిరగడం, కడుపులో నొప్పి, చర్మం దురదగా అనిపించడం, ఊపిరి పీల్చుకోలేకపోవడం వంటి లక్షణాలు తలెత్తుతాయి.
4.శనగ పప్పులో పీచుపదార్థం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానిని అతిగా తినడం వల్ల ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపు ఉబ్బరంగా అనిపించడం, కడుపు నొప్పి వంటి సమస్యలు తలెత్తవచ్చు.
బరువు తగ్గాలనుకునేవారికి శనగ పప్పు మంచి ఫలితాలను అందిస్తుంది. దీనిలో పీచు పదార్థం, ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. పైగా నెమ్మదిగా జీర్ణమవుతుంది. కాబట్టి ఎక్కువ సమయం ఆకలి వేయకుండా ఉంటుంది. దీనివల్ల తరచూ ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే శరీరంలో అదనపు క్యాలరీలు చేరవు. కాబట్టి బరువు పెరిగే అవకాశం ఉండదు. బరువు తగ్గాలనుకునేవారు శనగ పప్పును కూరగా గానీ.. వేయించిన శనగ పప్పును స్నాక్స్‌గా గానీ తీసుకోవచ్చు. దీంతో పాటు శనగలను నానబెట్టి.. మొలకలు వచ్చిన తర్వాత.. ఉడికించి లేదా వేయించుకొని తినడం వల్ల మరెన్నో పోషకాలు కూడా అందుతాయి.
శనగ పప్పు ఎక్కడ దొరకుతుందో మనం ప్రత్యేకించి చర్చించుకోనవసరం లేదు. కానీ మనం కొనుగోలు చేస్తున్న శనగ పప్పు ఎంత నాణ్యతతో ఉంటుందో తెలుసుకోవడం ముఖ్యం. రంగు మారిపోయినవి, కాస్త తేమగా ఉన్నవి కొనుగోలు చేయవద్దు. ఎందుకంటే వీటిపై ఫంగస్ పెరిగిపోతుంది. అలాంటివి మనం తింటే.. అనారోగ్యం పాలవ్వాల్సి వస్తుంది. లావుగా, చూడడానికి మంచి రంగులో ఉన్న పప్పును తీసుకోవాలి. కొన్న తర్వాత దాన్ని భద్రపరచడం కూడా ముఖ్యమే. పొడిగా ఉన్న డబ్బాలో గాలి తగలకుండా నిల్వ చేయాలి. కావాలంటే అప్పుడప్పుడు ఎండబెడుతూ ఉండడం వల్ల.. పురుగు పట్టకుండా ఉంటుంది.
శనగ పిండి శనగ పప్పు నుంచి వస్తుంది. కాబట్టి రెండూ దాదాపుగా ఒకే రకమైన ఫలితాలనిస్తాయి. ముఖ్యంగా శనగ పప్పు అందించే సౌందర్యపరమైన ప్రయోజనాలు పొందడానికి.. పప్పు బదులుగా పిండినే ఉపయోగించవచ్చు. అయితే దీనికోసం మార్కెట్లో దొరికే శనగ పిండి కాకుండా.. ఇంట్లోనే మీరు పిండిని తయారుచేసుకోవడం మంచిది.
గర్భం దాల్చిన మహిళతో పాటు.. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలకు అవసరమైన ఫోలిక్ యాసిడ్.. శనగ పప్పులో ఉంటుంది. అయితే దీనిని మరీ ఎక్కువ తినడం వల్ల.. మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. కాబట్టి శనగపప్పును అవసరమైన మేరకు మాత్రమే తినాల్సి ఉంటుంది.
POPxo ఇప్పుడు ఆరు భాషల్లో అందుబాటులోకి వచ్చింది: తెలుగు, ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, తమిళం, బెంగాలీ.
క్యూట్‌గా, కలర్ఫుల్గా ఉండే వస్తువులంటే ఇష్టమా? అయితే POPxo Shop లో సూపర్ ఫన్ మగ్స్, ఫోన్ కవర్స్, కుషన్స్, లాప్ టాప్ స్లీవ్స్ ఇంకా ఎన్నో రకాల అందమైన కలెక్షన్ ఉంది.