15 ఏళ్లుగా అదే సొగసు.. అదే పొగరు : 'లేడీ సూపర్ స్టార్' విజయశాంతిపై 'మెగాస్టార్' ప్రశంసలు

15 ఏళ్లుగా అదే సొగసు.. అదే పొగరు : 'లేడీ సూపర్ స్టార్' విజయశాంతిపై 'మెగాస్టార్' ప్రశంసలు

Megastar Chiranjeevi Praises actress Vijaya Shanti at "Sarileru Neekkevaru" Pre Release Event

'సరిలేరు నీకెవ్వరు' సినిమా మెగా సూపర్ వేడుకలో ఆసక్తికరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ వేడుకకు హాజరైన మెగాస్టార్ చిరంజీవి, నటి విజయశాంతిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా ఆమెతో కలిసి తాను నటించిన సినిమాల గురించి, అలాగే ఆమె వ్యక్తిత్వం గురించి ఆయన తన మదిలోని భావాలను వెల్లడించారు. "మేమిద్దరం కలిసి దాదాపు 20 చిత్రాలలో నటించి ఉంటాం. సెట్స్‌లో ప్రాణ మిత్రుల్లా ఉండేవాళ్లం. టీనగర్‌లో మా ఇంటికి ఎదురుగానే ఆమె ఉండేవారు. శాంతి సినిమాలకు దూరమై ఓ 15 ఏళ్లు కావస్తోంది అనుకుంటాను. కానీ ఇప్పటికీ ఆమెది అదే సొగసు.. అదే పొగరు" అని లేడీ సూపర్ స్టార్ విజయశాంతిని పొగడ్తలతో ముంచెత్తారు.

'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో విజయశాంతి ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ బాబు కథానాయకుడు కాగా.. రష్మిక హీరోయిన్‌గా నటించింది . అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. దిల్ రాజు, అనిల్ సుంకర ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ సినిమా ప్రి రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా రావడంతో.. అందరికీ ఈ ఫంక్షన్ పై ఆసక్తి పెరిగింది. అందుకు తగ్గట్టుగానే చిరు కూడా అనేక ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

నా భర్తే నాకు హీరో.. కానీ పిల్లలు వద్దనుకున్నాం: లేడీ అమితాబ్ విజయశాంతి

"సాధారణంగా ఏదైనా సినిమా ఒప్పుకున్నాక.. అది పూర్తయ్యే వరకూ మహేష్ ఒక్క పైసా కూడా తీసుకోడని విన్నాను. ఇది చాలా ఆరోగ్యకరమైన సంప్రదాయం. అతనిలో ఎప్పుడూ ఏదో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. బహుశా తన తండ్రి కృష్ణగారి నుండే అది సంక్రమించిందేమో. మన తెలుగు సినీ చరిత్రలో కృష్ణగారు చేసినన్ని ప్రయోగాలు ఎవరూ చేసుండరు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అందుకు కృషి చేసి ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చేలా చేయాలి. ఒక సీనియర్ మోస్ట్ నటుడిగా ఆయనకు ఇదే మనం ఇచ్చే గౌరవం" అని తెలిపారు.

ఆ సమయంలో.. మహేష్ బాబుని కొట్టడానికి నాకు మనసు రాలేదు : విజయశాంతి

ఇదే సభలో చిరు, విజయశాంతిపై ఛలోక్తులు కూడా విసిరారు. "మీరు నాకన్నా ముందే రాజకీయాలలోకి వచ్చారు కదా. మన మధ్యనున్న స్నేహం కూడా మీకు తెలుసు. అయినా సరే మీరు పలుమార్లు నన్ను ఎందుకు తిట్టారు? అయినా మీ మీదనున్న ప్రేమ, అభిమానంతో నేను ఒక్కమాట కూడా అనలేదు " అని నవ్వుతూ అడిగారు. దానికి ఆమె "సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు కదా" అని చిరునవ్వుతో బదులివ్వడంతో సభలో కూడా నవ్వులు విరిశాయి. దానికి చిరు కూడా "అవును.. రాజకీయం శత్రువులను పెంచుతుంది. సినిమా స్నేహాన్ని పెంచుతుంది" అని తనదైన శైలిలో జవాబిచ్చారు. 

కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన.. టాలీవుడ్ సినిమాలెన్నో..!

ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ "ఈ రోజు ఒక మిరాకిల్. మా డైరెక్టరుకి ఈ రోజు ఉదయమే బాబు పుట్టాడు. అలాగే దిల్ రాజు గారింటికి ఒక పాప వచ్చింది. ఇన్ని శుభాల మధ్య ఈ వేడుక జరగడం ఆనందంగా ఉంది. పైగా మెగాస్టార్ ఈ వేడుకకు రావడం ఇంకా సంతోషంగా ఉంది. ఆయన నేను నటించిన ప్రతి సినిమా చూస్తారు. చూశాక ఫోన్ చేసి అభినందిస్తారు కూడా. అర్జున్, పోకిరి లాంటి సినిమాలు చూసి ఆయన నాతో "నీలాంటి వాళ్లు ఇండస్ట్రీకి కావాలి" అనేవారు. ఇక విజయశాంతి గారి గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఆమె ఎంతో క్రమశిక్షణ కలిగిన నటి. మేం ఆమెకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చామని అనుకోవడం లేదు. ఆమే మాకు ఒక అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో భారతి పాత్ర ఆమె తప్ప మరొకరు చేయలేరు" అని తెలిపారు. ఈ వేడుకకి  సుధీర్ బాబు, బండ్ల గణేష్, తమన్నా, రామజోగయ్య శాస్త్రి, కొరటాల శివ మొదలైన వారు హాజరయ్యారు.

మేం ఈ దశాబ్దాన్ని #POPxoLucky2020 తో ముగిస్తున్నాం. ప్రతి రోజూ మీకో ప్రత్యేకమైన సర్ ప్రైజ్ అందించబోతున్నాం. అంతేకాదు.. మా ప్రత్యేకమైన జోడియాక్ కలెక్షన్‌ని మిస్సవ్వకండి. ఇందులో నోట్ బుక్స్, ఫోన్ కవర్స్, మ్యాజిక్ మగ్స్ వంటి ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉన్నాయి. వీటిపై 20 శాతం డిస్కౌంట్ కూడా అందుబాటులో ఉంది. మరింకెందుకు ఆలస్యం? POPxo.com/shopzodiac కి వెళ్లిపోయి మీకు నచ్చిన షాపింగ్ చేసేయండి.